Crime News : 12 రోజుల క్రితం అదృశ్యమైన గాయని ఘటన విషాదాంతం...

రాజధానిలో 12 రోజుల క్రితం అదృశ్యమైన గాయని హర్‌యాన్వీ ఘటన విషాదాంతమైంది. హరియాణాలో రోహతక్‌ జిల్లాలోని మెహమ్‌ హైవే సమీపంలో పూడ్చిపెట్టిన ఆమె మృతదేహంలభ్యమైంది.

Updated : 18 Oct 2022 13:24 IST

దిల్లీ: దేశ రాజధానిలో 12 రోజుల క్రితం అదృశ్యమైన హరియాణాకు చెందిన గాయని ఘటన విషాదాంతమైంది. హరియాణాలోని రోహతక్‌ జిల్లాలోని మెహమ్‌ హైవే సమీపంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 
పోలీసుల కథనం ప్రకారం.. దిల్లీలో నివసించే గాయని సంగీత.. మే 11 నుంచి కనిపించడం లేదు.  మూడ్రోజుల అనంతరం యువతి అదృశ్యమైనట్లు ఆమె కుటుంబసభ్యులు సమీప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమెతో పనిచేస్తున్న రవి, రోహిత్‌లు కిడ్నాప్‌ చేశారని వారు అనుమానం వ్యక్తం చేశారు. పాటల చిత్రీకరణ కోసం రోహిత్‌తో ఆమె మెహమ్‌లోని భీవాని ప్రాంతానికి వెళ్లినట్లు తెలిపారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అక్కడ వీరు ఒక హోటల్‌లో భోజనం చేసిన దృశ్యాలను సీసీటీవీలో గుర్తించారు. ఆమె కోసం గాలింపు చేపట్టారు. అయితే.. భైరాన్‌ బైనీ ప్రాంతంలోని ఓ ఫ్లైఓవర్‌ సమీపంలో గుర్తు తెలియని ఓ మృతదేహాన్ని ఖననం చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతదేహాన్ని వెలికితీసీ శవపరీక్ష నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఆ మృతదేహాం అదృశ్యమైన గాయనిదిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని