Bangladesh: రెండు రైళ్లు ఢీకొని.. 20మంది దుర్మరణం

బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో కనీసం 20మంది మృతిచెందగా.. దాదాపు వంద మంది ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

Published : 24 Oct 2023 01:16 IST

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం(Train Accident) జరిగింది. కిషోర్‌గంజ్‌ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న రైలును సరకు రవాణా రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వేర్వేరు ఆస్పత్రులకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. కిషోర్‌గంజ్‌లోని భైరబ్ సమీపంలో (ఢాకాకు 60కి.మీల దూరంలో) సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఢాకాకు వెళ్తున్న ఎగరో సింధూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఛటోగ్రామ్ వైపు వెళ్తున్న సరుకు రవాణా రైలు వెనుక నుంచి ఢీకొట్టినట్లు భైరబ్‌ రైల్వే పోలీసులు చెబుతున్నారు.

ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 20మృతదేహాలను బయటకు తీయగా.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు ఫైర్‌ సర్వీసెస్‌ అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ధ్వంసమైన కోచ్‌లలో కొందరు ప్రయాణికులు ఇరుక్కుపోయినట్లు ఢాకాకు చెందిన పలు వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ ప్రమాదంలో ధ్వంసమైన కోచ్‌లను తొలగించేందుకు క్రేన్లను తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని