Bombay HC: కారు టైరు పేలడం మానవ నిర్లక్ష్యమే.. బీమా సంస్థ పరిహారం చెల్లించాల్సిందే..!

కారు టైరు పేలడం మానవ నిర్లక్ష్యమేనని బాంబే హైకోర్టు (Bombay HC) స్పష్టం చేసింది. ఈ కేసులో బాధిత కుటుంబానికి బీమా (Insurance) సంస్థ పరిహారం చెల్లించాలని గతంలో ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సమర్థించింది.

Published : 12 Mar 2023 14:54 IST

ముంబయి: వాహనం టైరు పేలడం యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ (Act of God) కాదని.. అది మానవ నిర్లక్ష్యమేనని బాంబే హైకోర్టు (Bombay HC) అభిప్రాయపడింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి బీమా (Insurance) సంస్థ పరిహారం అందించాలని ట్రై బ్యునల్‌ ఇచ్చిన తీర్పును సమర్థించింది. కారు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం విపత్తు కిందకే వస్తుందని, అందుకు పరిహారం చెల్లించేందుకు నిరాకరిస్తూ ఓ బీమా సంస్థ చేసిన అప్పీలును బాంబే హైకోర్టు తోసిపుచ్చింది.

ముంబయికి చెందిన పట్వర్ధన్‌ (38).. తన స్నేహితులతో కలిసి 2010లో పుణె నుంచి ముంబయికి కారులో వెళ్తున్నారు. కారు యజమాని అయిన పట్వర్ధన్‌ స్నేహితుడు వాహనాన్ని అతివేగంగా నడిపించారు. దాంతో టైరు పేలి కారు ప్రమాదానికి గురయ్యింది. ఆ ఘటనలో  పట్వర్ధన్‌ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ కేసును విచారించిన వాహన ప్రమాదం క్లెయిమ్‌ల ట్రైబ్యునల్‌.. పట్వర్ధన్‌ కుటుంబానికి రూ.1.25కోట్ల రూపాయల పరిహారం అందించాలని న్యూ ఇండియా అస్యూరెన్స్‌ బీమా కంపెనీని 2016లో ఆదేశించింది. అతడి కుటుంబానికి అతనొక్కడే ఆర్థిక ఆధారమని వ్యాఖ్యానించింది. అయితే, ఆ పరిహారం చాలా అధికంగా ఉందని పేర్కొంటూ ట్రైబ్యునల్‌ తీర్పును సవాలు చేస్తూ బీమా సంస్థ బాంబే కోర్టులో అప్పీలు చేసింది.

వాహన టైరు పేలడం అనేది విపత్తు కిందకు వస్తుందని బీమా సంస్థ హైకోర్టులో వాదనలు వినిపించింది. వాదనలు విన్న జస్టిస్‌ ఎస్‌ డి డిగే ఏకసభ్య ధర్మాసనం.. బీమా సంస్థ చేసిన వాదనతో ఏకీభవించేందుకు నిరాకరించింది. టైరు పేలడం అనేది విపత్తు కిందకు రాదని.. అది నియంత్రించగలిగే చర్యేనని స్పష్టం చేసింది. అతివేగం, టైరులో గాలి హెచ్చు తగ్గులు లేదా సెకండ్‌ హ్యాండ్‌ టైర్‌, ఉష్ణోగ్రత వంటివి టైరు పేలడానికి కారణాలై ఉండవచ్చని పేర్కొంది. అందుకే ఇది మానవ తప్పిదం కిందకే వస్తుందని స్పష్టం చేస్తూ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సమర్థించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని