మైనింగ్‌ మాఫియాపై పోలీసుల కాల్పులు.. భాజపా నేత భార్య మృతి

ఉత్తరాఖండ్‌లో మైనింగ్‌ మాఫియాపై ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ భాజపా నేత భార్య ప్రాణాలు కోల్పోయారు.

Published : 13 Oct 2022 13:21 IST

 

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లో మైనింగ్‌ మాఫియాపై ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ భాజపా నేత భార్య మరణించడం రెండు రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాల్పులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు.

మైనింగ్‌ మాఫియా సాగిస్తున్న జాఫర్‌ అనే క్రిమినల్‌ ఉత్తరాఖండ్‌ పారిపోయినట్లు యూపీ పోలీసులకు సమాచారమందింది. ఉత్తరాఖండ్‌లోని జస్పూర్‌ ప్రాంతంలో భాజపా నేత గుర్‌తాజ్‌ భుల్లార్‌ ఇంట్లో అతడు దాక్కున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం రావడంతో.. యూపీ మోరదాబాద్‌ పోలీసులు బుధవారం సాయంత్రం ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, మాఫియా అనుచరుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు యూపీ పోలీసులు గాయపడగా.. అప్పుడే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన గుర్‌తాజ్‌ భార్య గుర్‌ప్రీత్‌ కౌర్‌కు కూడా తూటాలు తగిలాయి. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

గుర్‌ప్రీత్‌ మృతితో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. యూపీ పోలీసులు బందీలుగా తీసుకుని ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత జిల్లా పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. అయితే ఈ ఆపరేషన్‌ గురించి యూపీ పోలీసులు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఉత్తరాఖండ్‌ పోలీసులు ఆరోపిస్తున్నారు. అంతేగాక, మోరదాబాద్‌ పోలీసులపై హత్య కేసు కూడా నమోదు చేశారు. ఘటనపై భాజపా నేత గురుతాజ్‌ మాట్లాడుతూ.. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని.. సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని