logo

గతం మెరుగు.. భవిత కనుమరుగు

ఏళ్ల క్రితం జిల్లా కేంద్రంలో నెలకొల్పిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కొద్ది రోజుల్లో కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూర్‌, హాజీపూర్‌, మందమర్రి, కాసిపేట మండలాల రైతులకు ఉపయోగపడాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిన

Published : 25 Jun 2022 04:24 IST

మార్కెట్‌కమిటీకి ప్రత్యామ్నాయ స్థలం చూపని ప్రభుత్వం.. ఆందోళనలో అన్నదాతలు

మంచిర్యాల గ్రామీణం, న్యూస్‌టుడే

జిల్లా కేంద్రంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం

ఏళ్ల క్రితం జిల్లా కేంద్రంలో నెలకొల్పిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కొద్ది రోజుల్లో కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూర్‌, హాజీపూర్‌, మందమర్రి, కాసిపేట మండలాల రైతులకు ఉపయోగపడాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ స్థలాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయించింది. అన్ని ఏర్పాట్లతో  ఉన్న స్థలాన్ని తీసుకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలం సేకరించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. విశాలమైన ప్లాట్‌ఫారాలు, తూకం యంత్రాలు, గోదాములు, తాగునీరు వంటి సకల సదుపాయాలు కలిగిన మార్కెట్‌ నేడు ఆనవాళ్లు కోల్పోవడం రైతులను వేధిస్తోంది. ఏకంగా ఈ వ్యవసాయ మార్కెట్‌ పరిధిలోని మండలాలను జైపూర్‌ మార్కెట్‌ పరిధిలో విలీనం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సమాచారం. ఇదే జరిగితే జిల్లా కేంద్ర సమీపంలోని రైతులకు తీరని అన్యాయం జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గ్రేడ్‌-1 మార్కెట్‌...కథ కంచికేనా...

జిల్లాలోనే అత్యధిక ఆదాయం పొందుతూ గత కొన్నేళ్లుగా గ్రేడ్‌-1 మార్కెట్‌గా మంచిర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కొనసాగుతోంది. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ భారీగా ఆదాయం సమకూర్చుకుంటోంది. స్పెషల్‌ గ్రేడు కార్యదర్శి హోదాతో కూడిన మార్కెట్‌ నిర్మాణానికి నూతన భవనం నిర్మించేందుకు స్థలం దొరకడం లేదన్న కారణంగా జైపూర్‌ మార్కెట్‌లో విలీనం చేద్దామనే ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఏటా భారీగా ఆదాయం సమకూర్చుకునే మార్కెట్‌ దూర ప్రాంతానికి తరలిపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని హాజీపూర్‌, నస్పూర్‌, మంచిర్యాల మండలాల రైతులు వాపోతున్నారు. మార్కెట్‌ కమిటీ నిర్మాణానికి హాజీపూర్‌ మండలం గుడిపేటలోని ఎల్లంపల్లి జలాశయం సమీపంలో భూమి పరిశీలన చేసిన అధికారులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.  


విలీనంపై సమాచారం లేదు..

మంచిర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీని ఇతర ప్రాంతాలకు తరలించాలని ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు, ప్రతిపాదనలు అందలేదు. మంచిర్యాల మార్కెట్‌ పరిధిలో గ్రేడింగు చేసే వ్యాపారులు లేకపోవడంతో అన్ని రకాల ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు మార్కెట్‌ కమిటీకి ధాన్యం పంపించడం లేదు. మంచిర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నిర్మాణం కోసం గుడిపేట సమీపంలో ఏడెకరాల స్థలం పరిశీలన చేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే నిర్మాణ పనులు చేపట్టనున్నాం.

- గజానంద్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి, మంచిర్యాల.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని