logo

మావలపై మౌనమేలా..?

స్థలాలు ఖాళీగా ఉన్నాయని గూడులేని నిరుపేదలు అక్కడ తాత్కాలిక పాకలు వేసుకుంటారు. ఆర్థిక స్తోమత లేకున్నా మెల్లిగా అక్కడ రేకులషెడ్లు, సిమెంటు ఇటుకలతో నిర్మాణాలు చేపడతారు. ఇక తమకు గూడు దొరికిందని సంబరపడుతున్న ఆ పేదల సంతోషం అంతలోనే ఆవిరైపోతోంది. అక్రమ నిర్మాణాలంటూ రెవెన్యూ అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు.

Published : 03 Oct 2022 04:25 IST

సర్వే నెంబరు 170లోని అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోని వైనం

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం

స్థలాలు ఖాళీగా ఉన్నాయని గూడులేని నిరుపేదలు అక్కడ తాత్కాలిక పాకలు వేసుకుంటారు. ఆర్థిక స్తోమత లేకున్నా మెల్లిగా అక్కడ రేకులషెడ్లు, సిమెంటు ఇటుకలతో నిర్మాణాలు చేపడతారు. ఇక తమకు గూడు దొరికిందని సంబరపడుతున్న ఆ పేదల సంతోషం అంతలోనే ఆవిరైపోతోంది. అక్రమ నిర్మాణాలంటూ రెవెన్యూ అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా మావల మండలం మావల శివారులోని సర్వే నం.170లో తరచూ జరుగుతున్న ఘటనలు ఇవి. ఈ సర్వే నెంబరు పరిధిలో మొత్తం 184.02 ఎకరాల భూమి ఉంది. పదేళ్లకిందట అందులో 35 ఎకరాల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు. ఈ సర్వే నెంబరులోని భూమికి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) రాని భూములే ఉన్నాయి. కొందరు చాకచక్యంగా ఇతర పట్టా చూపిస్తూ.. ఇక్కడ భూముల్లో పాగావేసి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. దర్జాగా ఈ దందా సాగిస్తున్నారు. ఇదే సర్వే నెంబరులోని పేదలు పాకలు వేసుకుంటే కూల్చివేస్తున్న అధికారులు పెద్దల జోలికి ఎందుకు వెళ్లడం లేదనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఈ ప్లాట్లను కొనుగోలు చేసే ప్రజలు నష్టపోతున్నా అధికారులు బాధ్యులపై చర్యలకు వెనుకంజ వేస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.


మావల శివారులోని సర్వే నం.170లో అక్రమ నిర్మాణాలంటూ రెవెన్యూ, పురపాలక సిబ్బంది పేదల పాకలను కూల్చివేశారు. తరచూ ఇక్కడ పాకలు కూల్చివేయడం పరిపాటి.


మావల శివారు సర్వే నెం.170/54లోని చిత్రమిది. సౌత్‌ పార్కు వెనుకాల ఉన్న 2.02 ఎకరాల స్థలం రెవెన్యూ ఆధీనంలో ఉండగా.. గతంలో ఈ భూమిని అసైన్డ్‌ చేసిన వ్యక్తి కోర్టుకెళ్లారు. కొందరు పక్కనే ఉన్న ఇతర ప్రైవేటు పట్టాపేరుతో ఇక్కడ పాగావేసి ప్లాట్లుచేసి విక్రయించారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఆటంకాలు ఉండటంతో ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు ఇచ్చి మరీ రిజిస్ట్రేషన్లు చేయించారు. ఈ విషయం తెలియక కొందరు కొనుగోలు చేశారు. ఈ అక్రమంపై ‘ఈనాడు’లో కథనం రావడంతో అధికారులు కొన్ని బండలు తొలగించారు. మరికొన్ని బండలు అలాగే ఉంచారు. రిజిస్ట్రేషన్లు మాత్రం రద్దుకాలేదు. బాధ్యులపై చర్యలు లేవు.

‘ఈనాడు’లో సర్వే నెం.170/54పై వచ్చిన కథనం


మావల శివారు సర్వే నెం.170/33లోని 5.60 ఎకరాల భూమి అమ్మడానికి వీల్లేకున్నా నకిలీ ఎన్‌ఓసీతో ప్లాట్లు చేసి విక్రయించారు. గతంలో పని చేసిన రెవెన్యూ అధికారులు సహకరించారు. రిజిస్ట్రేషన్లు జరిగాయి. ‘ఈనాడు’ కథనంతో హద్దు రాళ్లు తొలగించారు. వాస్తవానికి సాగుకోసం ఇచ్చిన భూమిని ప్లాట్లు చేసినందుకు ‘పీఓటీ’ యాక్టు మేరకు ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారం ఉన్నా రెవెన్యూ అధికారులు మౌనంగా ఉంటున్నారు.

‘ఈనాడు’లో 170/33పై వచ్చిన కథనం


సర్వే నం.170లోని రెండు పడక గదుల ఇళ్లకోసం నిర్మించిన అపార్ట్‌మెంట్‌ వెనుకాల దృశ్యమిది. ఇక్కడ ప్లాట్ల కోసం పాతిన బండలు పెరిగిన గడ్డిలో కలిసిపోయాయి. ఈ ఎకరం భూమిని అమ్మడానికి వీల్లేకున్నా కొందరు ఇతర పట్టా చూపిస్తూ ప్లాట్లు చేసి విక్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని