logo

సందడి లేకుండా గణతంత్ర వేడుకలు

గణతంత్ర వేడుకలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరిగాయి. పోలీసు పరేడ్‌ మైదానానికి బదులుగా కలెక్టరేట్‌ ఆవరణలో అధికారికంగా వేడుకలు నిర్వహించగా.. పాలనాధికారి సిక్తా పట్నాయక్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Published : 27 Jan 2023 05:45 IST

కలెక్టరేట్‌ ఆవరణకే పరిమితం
ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే

ణతంత్ర వేడుకలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరిగాయి. పోలీసు పరేడ్‌ మైదానానికి బదులుగా కలెక్టరేట్‌ ఆవరణలో అధికారికంగా వేడుకలు నిర్వహించగా.. పాలనాధికారి సిక్తా పట్నాయక్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జడ్పీఛైర్మన్‌ రాఠోడ్‌ జనార్దన్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, అదనపు పాలనాధికారులు రిజ్వాన్‌ బాషాషేక్‌, నటరాజ్‌, శిక్షణ సహాయపాలనాధికారి డా.పి.శ్రీజ, అధికారులు, తదితరులు హాజరయ్యారు. పతాకావిష్కరణకు ముందు పాలనాధికారి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అందరూ కలిసి పాలనాప్రాంగణ సమావేశానికి వెళ్లి జిల్లా ప్రగతిపై ప్రసంగాలు చేశారు. ఉత్తమ సేవలందించిన వారికి పురస్కారాలు హడావుడిగా అందజేసి మమ అనిపించారు. కొంతమందికే అతిథుల నుంచి పురస్కారాలు అందుకునే అవకాశం లభించడంతో మిగిలినవారు నిరాశ చెందాల్సి వచ్చింది. ముఖ్య అతిథి పాలనాధికారి ఒక్కరే తొలుత ప్రసంగించినా.. ఆ తర్వాత అతిథులు, అధికారుల చేత మాట్లాడించారు. హడావుడి వేడుకల నిర్వహణపై సర్వత్రా చర్చకు తెరలేపింది.

జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తున్నాం : కలెక్టర్‌

అన్ని వర్గాల ప్రజల, ప్రజాప్రతినిధుల, అధికారుల సమన్వయం, సహకారంతో జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తున్నట్లు జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్‌ అన్నారు. శాంతి భద్రతల్లో జిల్లా దేశంలోనే ముందుందని చెప్పారు. పోలీసు యంత్రాంగ చర్యలతో నేరాలు తక్కువున్న జిల్లాల్లో దేశంలోనే ఆదిలాబాద్‌ అయిదో స్థానంలో, రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలవడం గర్వకారణమని కొనియాడారు. అన్ని శాఖల సమష్టి కృషి వల్ల ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయన్నారు. మన ఊరు - మన బడి కార్యక్రమం కింద జిల్లాలో 237 పాఠశాలలను ఎంపిక చేయగా త్వరలో మాడల్‌లుగా తీర్చిదిద్దిన 20 పాఠశాలలను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కంటివెలుగు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి జిల్లావాసులందరికీ కంటి పరీక్షలు చేస్తామని తెలిపారు. జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాశ్రేయస్సుకే ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రజలందరికీ మేలు జరుగుతోందన్నారు. ఎక్కడా లేని పథకాలు అమలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్న ప్రభుత్వంగా పేరుగాంచిందని తెలిపారు. ఎస్పీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ వచ్చేది ఎన్నికల సంవత్సరమని, పోలీసు యంత్రాంగం మరింత చురుగ్గా పని చేయాల్సి ఉంటుందని, అందుకు ప్రజలూ, ప్రజాప్రతినిధులు తగు సహకారం అందించాలన్నారు. ఇబ్బందులు ఎదురైతే 100 డయల్‌ చేయాలని పిలుపునిచ్చారు. అదనపు పాలనాధికారులతో సహా జిల్లా అటవీఅధికారి రాజశేఖర్‌, ఏఎస్పీ హర్షవర్ధన్‌ మాట్లాడారు. ఇన్‌ఛార్జి డీఆర్వో అరవింద్‌కుమార్‌, ఆర్డీవో రమేష్‌ రాఠోడ్‌, ఆయా శాఖల అధికారులు, అధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని