logo

ఆధునిక హంగులు.. సాంకేతిక బోధన

కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ప్రైమ్‌ మినిస్టర్‌ స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) పథకం కింద జిల్లా నుంచి 29 పాఠశాలలు ఎంపికయ్యాయి.

Published : 03 Feb 2023 04:48 IST

 ‘పీఎంశ్రీ’కి 29 బడులు ఎంపిక


ఇక మహర్దశ!

భీంపూర్‌ మండలం అంతర్గాం ప్రాథమికోన్నత పాఠశాల ఇది. తొలి విడతలో పీఎంశ్రీ పథకం కింద చోటుదక్కింది. ఇక్కడ అధునాతన సౌకర్యాల కల్పనకు, విద్యార్థులకు సాంకేతికత బోధన కోసం రూ.2 కోట్ల మేర నిధులు విడుదలయ్యే అవకాశముంది. విద్యార్థులూ కార్పొరేట్‌స్థాయి వారితో చదువులో పోటీపడే స్థాయికి ఎదిగేలా చర్యలు తీసుకోనున్నారు. అదే జరిగితే ఇలాంటి పాఠశాలల దశ, విద్యార్థుల దిశ మారినట్టే.


న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం: కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ప్రైమ్‌ మినిస్టర్‌ స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) పథకం కింద జిల్లా నుంచి 29 పాఠశాలలు ఎంపికయ్యాయి. తొలుత మండలానికి రెండు బడులకు చోటు దక్కుతుందని భావించారు. కానీ ప్రమాణాల మేరకు లేకపోవడంతో గాదిగూడ, మావల మండలాలను చివరి నిమిషంలో జాబితా నుంచి తప్పించారు. మరికొన్ని మండలాల్లో ఒకటే ఎంపికవడంతో తొలి విడతలో జిల్లా కోటాలో ఏడింటికి స్థానం లభించలేదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్కారు బడులపై ప్రత్యేక దృష్టి సారించడంతో వాటి రూపురేఖలు మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తుండగా.. మరిన్ని ఆధునిక హంగులు సమకూరేలా కేంద్రం పీఎంశ్రీ పథకం అమలుకు కార్యాచరణ ప్రారంభించింది. యుడైస్‌ ఫ్లస్‌ ప్రోగ్రాంలో నమోదైన సమాచారం ఆధారంగా పథక ఎంపిక కోసం బెంచ్‌మార్క్‌ స్కూల్స్‌ పేరిట రాష్ట్ర అధికారులు తొలుత 112 పాఠశాలలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అక్కడి హెచ్‌ఎంలు 60 రకాల ప్రశ్నావళిని పూరించి ఫొటోలను, పంచాయతీ, పాఠశాల తీర్మాన ప్రతులను నిర్ణీత ప్రొఫార్మాలో పీఎంశ్రీ పోర్టల్‌లో పొందుపర్చారు. ఆయా సౌకర్యాలను బట్టి మార్కులు కేటాయించారు. క్షేత్రస్థాయిలో ఆ సమాచారాన్ని తెలుసుకునేందుకు జిల్లాలో బెంచ్‌మార్కు పాఠశాలలను ఎంఈవోలు, పీజీహెచ్‌ఎంల నేతృత్వంలోని బృందాలు మండల స్థాయిలో సందర్శించారు. గ్రామీణ ప్రాంతంలో 60 శాతానికి పైగా వచ్చిన మార్కులను, అర్బన్‌లో 70 శాతానికి పైగా వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుని జిల్లా స్థాయిలో తొలుత 67 పాఠశాలలను ఎంపిక చేసినా.. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో 64 మాత్రమే ఆన్‌లైన్‌లో పొందుపర్చిన వివరాలు సరిపోలినట్లు తేల్చారు. అదే సమాచారాన్ని రాష్ట్ర అధికారులకు నివేదిస్తే.. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా 29 బడులు మాత్రమే ఎంపికవడం గమనార్హం.


కనీస వసతులు, విద్యార్థుల సంఖ్యను బట్టి!

పీఎంశ్రీ కింద రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, కనీస వసతులు ఉండటం కలిసొచ్చింది. ప్రధానంగా విద్యార్థులు సరిపడా లేని పాఠశాలలను, సరైన సదుపాయాలు లేని వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. ఎంపికైన వాటిలో 15 ప్రాథమిక, ప్రాథమికోన్నత, మరో 14 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఒక్కోదానికి రూ.2 కోట్ల మేర నిధులు విడుదల కానుండటంతో ఆయా బడులకు మహర్దశ రానుంది. ఆదిలాబాద్‌ అర్బన్‌, గ్రామీణం, బజార్‌హత్నూర్‌, బేల, భీంపూర్‌, బోథ్‌, గుడిహత్నూర్‌, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నేరడిగొండ, తలమడుగు, తాంసి, ఉట్నూరు మండలాల్లో రెండు చొప్పున, జైనథ్‌, నార్నూర్‌, సిరికొండ మండలాల్లో ఒకటి చొప్పున 29 పాఠశాలలు ఉన్నాయి.గాదిగూడ, మావల మండలాల్లో ఏ ఒక్క పాఠశాలకు స్థానం లభించలేదు.


రెండో విడతలో మరిన్ని ఎంపిక

- ప్రణీత, డీఈవో, ఆదిలాబాద్‌

క్షేత్రస్థాయిలో బృందాలను పంపి సిద్ధం చేసిన జాబితాను రాష్ట్ర అధికారులకు పంపాం. అందులో నిర్దేశిత ప్రమాణాలను బట్టి 29 పాఠశాలలను ఎంపిక చేశారు. మిగిలిన వాటిని రెండో విడతలో ఎంపిక చేస్తారు. నిధుల కేటాయింపు, మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని