logo

ఉపాధి కూలి.. నిరీక్షణతో సరి

పేద కూలీలతోపాటు ఇటీవల వ్యవసాయ పనుల సీజన్‌ ముగియడంతో రైతు కుటుంబాలు అధిక సంఖ్యలో  ఉపాధి హామీ పనుల బాట పట్టాయి. సకాలంలో డబ్బులు చేతికందక పూట గడవడం కోసం ఇతరుల వద్ద వారు చేతులు చాచాల్సి వస్తోంది.

Updated : 18 Apr 2024 05:24 IST

జిల్లా వ్యాప్తంగా రూ. 10 కోట్లకుపైగా బకాయిలు
న్యూస్‌టుడే, తాంసి

పనులకు వెళ్తున్న ఉపాధి హామీ కూలీలు

పేద కూలీలతోపాటు ఇటీవల వ్యవసాయ పనుల సీజన్‌ ముగియడంతో రైతు కుటుంబాలు అధిక సంఖ్యలో  ఉపాధి హామీ పనుల బాట పట్టాయి. సకాలంలో డబ్బులు చేతికందక పూట గడవడం కోసం ఇతరుల వద్ద వారు చేతులు చాచాల్సి వస్తోంది.

జిల్లా వ్యాప్తంగా 1.72 లక్షల జాబ్‌కార్డులుండగా 3.46 లక్షల వరకు కూలీలున్నారు. వివిధ కారణాల రీత్యా ప్రస్తుతం 1.26 లక్షల మంది కూలీలు మాత్రమే ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. వీరికి ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి కూలీ డబ్బులు అందడం లేదు. సుమారు రూ.10 కోట్లకుపైగా దినసరి వేతనాల బకాయిలు ఉన్నట్లు సమాచారం. త్వరగా అవసరానికి డబ్బులు వస్తాయని ఉపాధి పనికి వెళ్తే నెలల తరబడి డబ్బులకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎండకు విలవిల..

డబ్బులు రాక అవస్థలు పడుతున్న వీరికి పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఎండకు తాళలేకపోతున్నారు. ఎవరైనా సొమ్మసిల్లినా, వడదెబ్బ తగిలినా అందుబాటులో ప్రథమ చికిత్స కిట్లు లేవు. పని ప్రదేశంలో తాగునీరు ఇవ్వడం లేదు. భానుడి ప్రతాపానికి తట్టుకోలేక విశ్రాంతికి పది నిమిషాలు కూర్చుందామంటే ఎక్కడా టెంట్లు కానరావడం లేదని కూలీలు చెబుతున్నారు. ఉపాధి హామీ కూలీలకు గతంలో వేసవి భత్యం ఇచ్చేవారు. ఇప్పుడు దానికి కూడా స్వస్తి చెప్పారు. తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని పంచాయతీలకు ఇటీవల బాధ్యతలు అప్పగించినట్లు ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినా.. చాలా చోట్ల వసతులు కల్పించడం లేదు.

పొన్నారి చెరువు పూడికతీత పనుల్లో కూలీలు


సకాలంలో రాక ఆర్థిక ఇబ్బందులు

రెండు నెలలుగా ఉపాధి హామీ ప్రదేశాల్లో వసతులు లేకున్నా పనులు చేస్తున్నాం. ఇంతవరకు డబ్బులు రాలేదు. అధికారులు, బ్యాంకు, తపాలా కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదు. సకాలంలో కూలి డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇతర వ్యవసాయ పనులతోపాటు సీసీ రోడ్ల నిర్మాణానికి వెళ్తే రోజుకు రూ.500 నుంచి రూ.600 వచ్చేది. జైనథ్‌ మండలం భోరజ్‌ గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు ఆశన్న, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, విలాస్‌, ఎర్రన్న చెబుతున్న మాటలివి.


డబ్బులు రాక అప్పులు చేస్తున్నాం..

ఫిబ్రవరి, మార్చి నెలల్లో 6 వారాలు ఉపాధి హామీ పనికి వెళ్లాం. కానీ ఆ డబ్బులు ఇంతవరకు అందలేదు. నిత్యావసరాల కొనుగోలుకు, డ్వాక్రా రుణం కట్టడానికి ఇబ్బందిగా ఉంది. అప్పుచేసి తిండి గింజలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పత్తి తీయడం, కూరగాయలు తెంపడానికి వెళ్లినా రోజుకు రూ.300 వచ్చేది. తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు ఎస్‌కె జాముర, లక్ష్మి, నీలమణిల ఆవేదన ఇది...


త్వరలో చెల్లిస్తాం
జి.సాయన్న, డీఆర్డీవో, ఆదిలాబాద్‌

కూలీ డబ్బుల చెల్లింపులో ఆలస్యం జరగడం వాస్తవమే. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేస్తే అప్పుడు కూలీల ఖాతాల్లో జమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని