logo

మందులిచ్చేవారేరి?

ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది.

Published : 19 Apr 2024 05:58 IST

ఫార్మసిస్టు లేని వైద్యకళాశాల, అనుబంధ ఆసుపత్రి

జీజీహెచ్‌లో బాధితులకు మందులు అందించే ఫార్మసీ గది

మంచిర్యాల వైద్యవిభాగం, న్యూస్‌టుడే: ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది. ఇక్కడ మందులు ఎవరు అందించినా పర్వాలేదు.. ఫార్మసిస్టులు ఎందుకు అనే వైఖరి కనిపిస్తోంది. రెండు జిల్లాలకు పెద్దదిక్కుతో పాటు పెద్దాసుపత్రిగా పేరుపొందిన మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోనే ఫార్మసిస్టులు లేరు. డీఎంఈ(డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌) పరిధిలోకి వెళ్లి దాదాపు మూడేళ్లు అవుతోంది. ఒక్క ఫార్మసిస్టు నియామకం కూడా చేపట్టకుండా నెట్టుకొస్తున్నారు. స్టాఫ్‌నర్సులే ఔషధాలు అందజేస్తున్నారు. తాత్కాలిక, పొరుగుసేవల ద్వారా అయినా నియమించేందుకు అవకాశమున్నా పర్యవేక్షకులు చొరవ చూపడం లేదు.

అవసరమైన విభాగాలపైనే నిర్లక్ష్యం..

ఆసుపత్రికి అత్యవసరమైన విభాగాల్లో ఫార్మసి ముఖ్యమైనది. ఇప్పటికే ప్రధానమైన రేడియోగ్రాఫర్‌, ల్యాబ్‌టెక్నీషియన్ల కొరత తీవ్రంగా ఉంది. దీనికితోడు కీలకమైన ఫార్మసిని పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైద్యకళాశాల పరిధిలో 12 పోస్టులు ఉండగా ఇప్పటి వరకు ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. శాశ్వత నియామకం పక్కనపెడితే కనీసం తాత్కాలికంగానైనా ఆయా ఖాళీలు చేపడితే ఉపశమనం కలుగుతుంది. కానీ ఆ ఆలోచనే చేయడం లేదు కళాశాల, ఆసుపత్రి నిర్వాహకులు. జీజీహెచ్‌, ఎంసీహెచ్‌లలో నాలుగైదు చోట్ల ఫార్మసి కేంద్రాలు ఉన్నాయి. ప్రతిచోటా స్టాఫ్‌నర్సులతోనే బాధితులకు మందులు అందిస్తున్నారు. ఏదైనా సమస్య ఎదురైతే ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకం. జీజీహెచ్‌ పర్యవేక్షకులు అనేకసార్లు విన్నవించుకున్నా వైద్యకళాశాల నిర్వాహకులు పట్టించుకోవడం లేదని తెలిసింది.


మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి(జీజీహెచ్‌)లోని డ్రగ్‌ స్టోర్‌లో మిగతా స్టాఫ్‌నర్సులకు సూచనలు ఇస్తూ సేవలు అందిస్తున్న ఈమె పేరు హేమలత. తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు (టీవీవీపీ) ఫార్మసిస్టు. అయినా సంబంధిత ఆసుపత్రుల్లో కాకుండా ఇక్కడ భారంగా విధులు నిర్వర్తిస్తున్నారు. జీజీహెచ్‌, ఎంసీహెచ్‌ రెండింటికీ పెద్దదిక్కు ఈమె ఒక్కరే. కనీసం తనతో విధులు పంచుకునేందుకు సంబంధిత విభాగానికి చెందిన వారు లేరు. మందుల సరఫరా పరిశీలనతో పాటు ఆసుపత్రుల్లోని ఇన్‌ పెషేంట్‌(ఐపీ), ఔట్‌ పెషెంట్‌(ఓపీ), ఐసీయూ తదితర వార్డులకు పంపిణీ చేయడం వరకు ఈమె చూసుకుంటున్నారు. పనిభారం తీవ్రమై ఇక్కడ నియామకాలైనా చేపట్టండి.. లేదా తన శాఖకు బదిలీ అయిన చేయండి అంటూ మొరపెట్టుకున్నారు.


ఈమె పేరు గాయత్రి.. 15 ఏళ్లుగా పొరుగు సేవల ద్వారా(టీవీవీపీ పరిధిలో) ఫార్మసిస్టుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏరియా ఆసుపత్రిలో మొదలైన తన సేవలు, జిల్లా, ప్రస్తుతం జీజీహెచ్‌ వరకు కొనసాగుతున్నాయి. గత నెలతో ఆమె కొలువు గడువు ముగిసింది. ఆసుపత్రిలో ఫార్మసిస్టు కొరత ఉండటంతో పొడిగిస్తామంటూ చెప్పి ఆమె సేవలు వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేదు. కానీ సంబంధిత ఏజెన్సీ ఆమె చేస్తున్న ఫార్మసిస్టు కొలువును కలిపి నూతన నియామకాలకు ఉద్యోగ ప్రకటన ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని