logo

దివ్యాంగులకు చేయూత

దివ్యాంగులకు మంచి రోజులు రానున్నాయి. వైకల్యానికి తోడు పేదరికంతో దయనీయంగా జీవనం సాగిస్తున్న వారికి ఊరట లభించనుంది. 

Published : 03 Feb 2023 04:23 IST

న్యూస్‌టుడే, నర్సీపట్నం

దివ్యాంగులకు మంచి రోజులు రానున్నాయి. వైకల్యానికి తోడు పేదరికంతో దయనీయంగా జీవనం సాగిస్తున్న వారికి ఊరట లభించనుంది. స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్కువ వడ్డీపై రుణాలు అందించనుంది. త్వరలోనే వీరికి రుణాల  పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

జిల్లాలో విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులు అనేక మంది ఏ ఆసరా లేక కుటుంబ పోషణకు అవస్థలు పడుతున్నారు. వీరికి గతంలో స్వయం ఉపాధికి రాయితీపై రుణాలు ఇచ్చేవారు. కొన్నేళ్లుగా నిలిపివేశారు. ఈ పరిస్థితుల్లో జాతీయ దివ్యాంగుల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఎఫ్‌డీసీ) ద్వారా కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి చేయూత ఇవ్వనుండటంతో ఆర్థికంగా భరోసా లభించనుంది.


33 మందికి రూ.52 లక్షలు

జేసీ అధ్యక్షతన లబ్ధిదారుల దరఖాస్తులను స్క్రీనింగ్‌ కమిటీ ఇటీవల పరిశీలించింది. 40 శాతం వైకల్యం కలిగి 18 నుంచి 60 ఏళ్ల వయసున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 33 మంది అర్హులుగా గుర్తించి వారికి ఎన్‌హెచ్‌ఎఫ్‌డీసీ ద్వారా రూ.52 లక్షలు రుణాలుగా ఇచ్చేందుకు అనుమతులు వచ్చాయి.


5 నుంచి 6 శాతం వడ్డీ

రుణ మొత్తంపై 5 నుంచి 6 శాతం వడ్డీ నిర్ణయిస్తూ దివ్యాంగులకు ఆర్థిక సాయం అందించనున్నారు. గత ఏడాదికి సంబంధించి ఎంపికైన లబ్థిదారులకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణం మంజూరుకానుంది. వీరిలో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. వీరంతా షామియానా, కిరాణా, డెయిరీ, జిరాక్స్‌ సెంటర్ల నిర్వహణ, ఆవులు, గేదెల పోషణ, కూరగాయలు విక్రయాల నిమిత్తం రుణాలకు దరఖాస్తు చేశారు.


రెండు వారాల్లోగా జమ
- జగదీష్‌, సహాయ సంచాలకుడు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ

లబ్ధిదారులకు రెండు వారాల్లో రుణ మొత్తం వారి బ్యాంకు ఖాతాలకు జమవుతుంది. తక్కువ వడ్డీతో అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని దివ్యాంగులు స్వయం ఉపాధి సాధించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని