logo

పాలకులు పట్టించుకోరు.. గిరిజనమే పట్టుపట్టారు!

దశాబ్దాలుగా రహదారుల నిర్మాణంపై అధికారులు హామీలు, రాతలు, కాగితాల వరకే పరిమితమవుతున్నాయి. కనీస మార్గం లేని గ్రామాల్లో గిరిజనులు అత్యవసర సమయాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది.

Published : 27 Mar 2023 04:38 IST

శ్రమదానంతో తాత్కాలిక దారుల ఏర్పాటు
జి.మాడుగుల, న్యూస్‌టుడే

శ్రమదానంతో రహదారి నిర్మించుకుంటున్న డేగలరాయి గ్రామస్థులు (పాత చిత్రం)

దశాబ్దాలుగా రహదారుల నిర్మాణంపై అధికారులు హామీలు, రాతలు, కాగితాల వరకే పరిమితమవుతున్నాయి. కనీస మార్గం లేని గ్రామాల్లో గిరిజనులు అత్యవసర సమయాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. గడుతూరు పంచాయతీ బొడ్డుమామిడిలో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణి పాంగి సోలుతిమ, అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలు వంతాల దివుడు(50) మృతి చెందారు. వీరిని ఆసుపత్రులకు తరలించేందుకు కనీస రహదారి సదుపాయం లేకపోవడం ప్రాణాలమీదకు తెచ్చింది.

గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, ప్రభుత్వ పథకాలు గ్రామాలకు అందాలన్నా రహదారులు ముఖ్యం. రోగులను, గర్భిణులను ఆసుపత్రులకు సకాలంలో చేర్చాలంటే రహదారులు ఎంతో కీలకం. పాడేరు ఏజెన్సీ 11 మండలాల్లో వందలాది గ్రామాలకు రహదారులు లేకపోవడంతో గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. కనీసం పక్క గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రహదారి సదుపాయాలు కల్పించాలని నాటి నుంచి నేటి వరకు ఎందరు కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలను కోరినా ప్రయోజనం లేకపోయింది. ఫలితంగా గిరిజనులు రహదారి కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. దీనికి పరిష్కారంగా పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రతిపాదించిన మిషన్‌ కనెక్టులో భాగంగా మంజూరు చేసిన రహదారుల పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కొన్నిచోట్ల రోజువారీ తిప్పలు తప్పేందుకు గిరిజనులే ఏకమై శ్రమదానంతో రహదారులను నిర్మించుకొంటున్నారు.

* ఇటీవలే జి.మాడుగుల మండలంలోని పర్యటించిన ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి రహదారుల నిర్మాణానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 11 మండలాల్లోని అన్ని గ్రామాలకూ రహదారులు వేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని చెప్పారు. పాడేరు ఏజెన్సీ పరిధిలోని 900 గ్రామాలకు రహదారులు లేవని, మిషన్‌ కనెక్టులో భాగంగా రహదారులు నిర్మిస్తామని వారు చెప్పారు.

రహదారిని బాగుచేసుకుంటున్న రాసపనుకు గ్రామస్థులు (పాత చిత్రం)

గ్రామస్థులు నిర్మించుకున్న రోడ్లివే..

రహదారి సౌకర్యం కల్పించాలని అధికారులు ముందు వేడుకొని, విసుగుచెందిన గిరిజనులు కలిసికట్టుగా పలుగు, పారలు పట్టుకొని శ్రమదానంతో రహదారులుగా మలుచుకొంటున్నారు.

* జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీ లక్కపాడుకు రహదారి సదుపాయం లేదు. ఇక్కడ రహదారి నిర్మిస్తే మరో మూడు గ్రామాలకు సౌకర్యవంతంగా ఉంటుందని ఐటీడీఏ స్పందన కార్యక్రమంలో విన్నవించారు. స్పందన లేకపోవడంతో గతేడాది మే 22న లక్కపాడుతో పాటు మరో మూడు గ్రామాలు గిరిజనులు చేయిచేయి కలిపి రహదారిని బాగుచేసుకున్నారు.

* మిషన్‌ కనెక్టులో భాగంగా వంతాల పంచాయతీ రాసపనుకు 3 కిలోమీటర్లు రహదారిని మంజూరు చేసింది. ఈ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో గ్రామస్థులే ఏకమై శ్రమదానంతో తాత్కలికంగా నిర్మించుకున్నారు.

* వంజరి పంచాయతీ సువ్వపాడు, గేదెలబంద గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించకపోతే రానున్న ఎన్నికల్లో పోలింగుకు దూరంగా ఉంటామని గిరిజనులు హెచ్చరించారు. గత ఏడాది తాత్కాలిక రహదారిని నిర్మించుకున్నారు.

* డుంబ్రిగుడ మండలం గుంటసీమ్మ పంచాయతీ తడ్డా గ్రామానికి శాశ్వత రహదారి కల దశాబ్దాలుగా నెరవేరలేదు. తాత్కాలిక మట్టిరోడ్డు వర్షాలకు కొట్టుకుపోయింది. అధికారులకు తెలియజేసినా ఫలితం లేకపోవడంతో తడ్డా గిరిజనులు శ్రమదానంతో బండరాళ్లను తొలగించి తాత్కాలికంగా రహదారిని నిర్మించుకున్నారు.

* రోడ్డు సదుపాయం మెరుగుపరచాలని పాలకులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీ నుంచి రాసపనుకు వరకు 4 కిలోమీటర్లు రహదారిని గ్రామస్థులే నిర్మించుకున్నారు. ఈ రహదారికి పాడేరు ఐటీడీఏ రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. పొక్లెయిన్‌తో కొంత మేర మట్టి పనులు చేసి వదిలేశారు.

* జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ డేగలరాయి గ్రామానికి సరైన మార్గం లేదు. గత ఏడాది అక్టోబర్‌ 30న గ్రామస్థులు మట్టి దారిని నిర్మించుకున్నారు.


అన్ని గ్రామాలకు రోడ్లేస్తాం: మిషన్‌ కనెక్టులో భాగంగా ఇప్పటికే రహదారులు లేని గ్రామాలను గుర్తించాం. మిషన్‌ కనెక్టు పథకంలో రహదారులు మంజూరు చేస్తున్నాం. ఇప్పటికే పలు గ్రామాలకు రహదారి పనులు జరుగుతున్నాయి. మిగతా గ్రామాలకు త్వరలోనే మంజూరు చేస్తాం. ముందుగా కనీస మార్గం లేని వాటికి ప్రాధాన్యం ఇస్తున్నాం. క్రమంగా మిగతా వాటికీ సదుపాయాలు కల్పిస్తాం.

మాణిక్యం, మండల ఇంజినీరింగ్‌ అధికారి, జి.మాడుగుల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని