logo

వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు

ఎన్నికల నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. ఇకపై తామంతా వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రత్యక్షంగా పనిచేస్తామని చెబుతున్నారు.

Published : 16 Apr 2024 02:18 IST

పెదబయలులో రాజీనామా పత్రాలను ఈవోపీఆర్డీ నర్సింగరావుకు అందజేస్తున్న వాలంటీర్లు

పాడేరు, గూడెంకొత్తవీధి, కొయ్యూరు, చింత పల్లి, న్యూస్‌టుడే: ఎన్నికల నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. ఇకపై తామంతా వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రత్యక్షంగా పనిచేస్తామని చెబుతున్నారు. గూడెంకొత్తవీధి మండలంలోని దామనాపల్లి సచివాలయం పరిధిలో 16 మంది రాజీనామా చేస్తున్నట్లు స్థానిక సచివాలయ కార్యదర్శి కళ్యాణ్‌కృష్ణకు లేఖ అందించారు. కొయ్యూరు మండలంలోని ఆరు పంచాయతీల్లోని 45 మంది సోమవారం రాజీనామా చేశారు. శరభన్నపాలెం సచివాలయంలో ఆరుగురు, కొమ్మికలో 11 మంది, కంఠారం ఏడుగురు, చింతలపూడిలో 10 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని ఎంపీడీవో సీతయ్య తెలిపారు. చింతపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో వివిధ పంచాయతీల్లో పని చేస్తున్న సుమారు 136 మంది తమ రాజీనామాలను ఎంపీడీఓ వీరసాయిబాబు, ఈఓపీఆర్డీ శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ వివరాలను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు ఎంపీడీఓ తెలిపారు.

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: పెదబయలు మండలంలో 45 మంది గ్రామ వాలంటీర్లు సోమవారం ఈవోపీఆర్డీ నర్సింగరావుకు రాజీనామా పత్రాలు అందజేశారు. వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు పనిచేస్తామన్నారు.


ఇలా రాజీనామా... అలా వైకాపా నేతలతో సమావేశాలు

వైకాపా పాడేరు అసెంబ్లీ పరిశీలకులు శ్రీకాంత్‌రాజును కలిసిన చింతపల్లి మండల వాలంటీర్లు

చింతపల్లి, న్యూస్‌టుడే: వాలంటీర్ల రాజీనామాలు పూర్తిగా వైకాపా నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నడానికి సోమవారం చింతపల్లి జరిగిన సన్నివేశాలే నిదర్శనం. పెద్ద ఎత్తున రాజీనామాలు చేసిన వాలంటీర్లంతా కొద్ది క్షణాల్లోనే చింతపల్లిలో ఒక ప్రైవేటు రిసార్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ అప్పటికే ఉన్న వైకాపా పాడేరు అసెంబ్లీ పరిశీలకులు శ్రీకాంత్‌ రాజు కలిశారు. జగనన్న సైన్యంగా ఇక నుంచి తాము పని చేస్తామని బాహాటంగానే ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని