logo

ఘాట్‌రోడ్లకు జగన్‌ పోటు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రధానమైన రెండు ఘాట్‌రోడ్లు ప్రమాదకరంగా మారాయి. పాడేరు, అరకులోయ ఘాటీలు అధ్వానంగా తయారయ్యాయి. వీటి నిర్వహణను వైకాపా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు.

Published : 17 Apr 2024 06:50 IST

నిర్వహణను పట్టించుకోని ప్రభుత్వం
తరచూ ప్రమాదాలు
పాడేరు, అరకులోయ, న్యూస్‌టుడే

  • పాడేరు ఘాట్‌రోడ్లోని వంట్లమామిడి సమీపంలో ఐదేళ్ల క్రితం చింతపండు లోడుతో వెళుతున్న ఓ ల్యారీ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
  • 2020లో వంట్లమామిడి వద్ద కాకినాడకు చెందిన ఓ బస్సు ప్రయాణికులతో వెళుతూ బ్రేక్‌లు ఫెయిల్‌ అవ్వడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ముగ్గురు మృత్యువాతపడ్డారు. కందమామిడి మలుపు వద్ద గత మూడేళ్లలో ఐదుగురు యువకులు వేర్వేరుగా జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.
  • ఈనెల 4వ తేదీన ఒడిశా రాష్ట్రం నుంచి వలస కూలీలు వ్యాన్‌లో విజయవాడ వెళ్తుండగా పాడేరు ఘాట్‌రోడ్లోని ఏసుక్రీస్తు బొమ్మ మలుపు సమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా మరో ఇద్దరు తీవ్రగాయాలయ్యారు. 22 మంది స్వల్పగాయాలపాలయ్యారు.

ల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రధానమైన రెండు ఘాట్‌రోడ్లు ప్రమాదకరంగా మారాయి. పాడేరు, అరకులోయ ఘాటీలు అధ్వానంగా తయారయ్యాయి. వీటి నిర్వహణను వైకాపా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. తరచూ ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నా సీఎం జగన్‌కు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం గమనార్హం. ఈ ప్రాంతాలకు దూరప్రాంతాల నుంచి పర్యటకులు తరలివస్తుంటారు. వారికి ఈ మార్గాలపై అవగాహన లేక ప్రమాదాలకు గురవుతున్నారు. కనీసం ఇక్కడ రక్షణ సూచీలు కూడా ఏర్పాటు చేయడం లేదు.


రకులోయ ఘాట్‌రోడ్డు 45 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ మార్గంలో ప్రమాదకర ప్రదేశాలు 50 వరకు ఉన్నాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో అరకులోయ- విశాఖపట్నం మార్గం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అరకు నుంచి పెందుర్తి వరకు ఉన్న ప్రధాన రహదారి నిర్వహణకు అప్పటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐదేళ్ల పాటు రహదారి నిర్వహణకు ప్రపంచబ్యాంకు నిధులు రూ. 21 కోట్లు కేటాయించింది. ఆ ఐదేళ్ల పాటు ఈ మార్గంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా రోజుల వ్యవధిలోనే సమస్య పరిష్కరించేవారు. వైకాపా  అధికారంలోకి వచ్చాక అరకులోయ నుంచి విశాఖపట్నం మార్గంలోని ఘాట్‌రోడ్డును పూర్తిగా విస్మరించారు. గుంతలమయంగా మారిన రహదారికి మరమ్మతులు మర్చిపోయారు. ఎక్కడపడితే అక్కడ రక్షణ గోడలు పూర్తిగా పాడైపోయాయి. ఇక్కడ వాహనదారులు ఏమరుపాటుగా ఉంటే ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు  ఉన్నాయి.

ఈ మార్గంలో 7 హెయిర్‌పిన్‌ బెండ్‌లు ఉన్నాయి. వాటివద్ద ఏర్పాటు చేసిన రెయిలింగ్‌లు, రక్షణ గోడలు చాలా వరకు పాడైపోయాయి. సుమారు 15 చోట్ల రక్షణగోడలు బాగా దెబ్బతిన్నాయి. టైడా జంగిల్‌బెల్స్‌ సమీపంలోని మలుపు వద్ద రక్షణగోడ పూర్తిగా కూలిపోయింది. గాలికొండలున్న సుమారు ఐదు కిలోమీటర్ల మార్గంలో పది చోట్ల కొండపై నుంచి బండరాళ్లు జారి రహదారి పక్కగా పడిపోయాయి. సుంకరమెట్ట, డముకు తదితర ప్రదేశాల్లో రహదారి గుంతలుపడి పలువురు గాయాలపాలవుతున్నారు. నాలుగేళ్ల తర్వాత ఈ రహదారిని రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌   అధికారులకు అప్పగించినట్లు పేర్కొంది. కొంత ప్రాంతాన్ని ఎన్‌హెచ్‌ అధికారులు బాగు చేసినా తర్వాత వదిలేశారు.


పురాతన మార్గం

పాడేరు ఘాట్‌రోడ్డులో ప్రయాణం ప్రమాదభరితంగా మారింది. దీన్ని సుమారు ఐదు దశాబ్దాల క్రితం నిర్మించారు. గతంలో మాజీ మంత్రి బాలరాజు హయాంలో దీని విస్తరణ పనులు చేపట్టారు. అప్పటి వరకు ఐదు మీటర్లున్న రహదారిని ఏడు మీటర్ల వరకు విస్తరించారు. ప్రమాదకర మలుపుల వద్ద మాత్రం వెడల్పు చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని