logo

అసౌకర్యాల అరకులోయ

ఆంధ్రాఊటీ అరకులోయ పరిస్థితి.. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న మాదిరిగా ఉంది. ఈ పట్టణంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో సుమారు 10 వేల మంది జనాభా ఉన్నారు.

Published : 18 Apr 2024 01:54 IST

అరకులోయ, న్యూస్‌టుడే

ఆంధ్రాఊటీ అరకులోయ పరిస్థితి.. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న మాదిరిగా ఉంది. ఈ పట్టణంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో సుమారు 10 వేల మంది జనాభా ఉన్నారు. తాగునీరు, కాలువలు, సీసీ రోడ్లు, వీధి దీపాలు పూర్తిస్థాయిలో లేవు. అంతర్గత రహదారులు సైతం లేకపోవడంతో ప్రజలు, వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు.

తాగునీటికి కటకట

అరకులోయ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇంటింటికీ కుళాయిలు బిగించారు. ప్రస్తుతం ఇవి సక్రమంగా లేకపోవడంతో తాగునీరు అంతంతమాత్రంగానే ప్రజలకు అందుతోంది. అరకులోయలోని సీ, జడ్పీ కాలనీలు, స్టేట్‌బ్యాంక్‌ వీధి తదితర ప్రాంతాల్లో కుళాయిల పైపులు చాలా వరకు పాడైపోయాయి. మిగిలిన వీధుల్లో కుళాయిల ద్వారా రెండు రోజులకు ఒకసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. రానున్న రోజుల్లో తాగునీటి ఇక్కట్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

గోతుల దారులు

అరకులోయ పట్టణంలో అంతర్గత రహదారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఆరేళ్ల క్రితం నిర్మించిన సీసీ రోడ్లు తప్ప కొత్తవి వేయలేదు. పాతవి చాలావరకు పాడవటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లే రహదారి దారుణంగా ఉంది. భారీగా గుంతలు పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం పడితే మోకాళ్ల లోతున నీరు నిల్వ ఉండిపోతోంది. ఈ గోతుల్లో పడి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కంఠబంసుగుడకు వెళ్లే మార్గం అధ్వానంగా తయారైంది. వాన కురిస్తే చాలు బురదమయంగా మారుతోంది.

అరకులోయ ప్రధాన రహదారి మార్గంలో ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేశారు. పాత దీపాలు ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలా వరకు సరిగా వెలగడం లేదు. ప్రజలు చీకట్లోనే మగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. అరకులోయలోని ఆదివాసీ, జడ్పీ కాలనీలు, శరభగుడ ప్రాంతాల్లో వీధి దీపాలు సక్రమంగా వెలగకపోవటంతో ప్రజలు అవస్థలకు గురవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు