logo

ఉద్యోగం, కాంట్రాక్టు పేరుతో మోసం

ఉద్యోగం లేదంటే ఏదైనా కాంట్రాక్టు ఇప్పిస్తానని సుమారు రూ.10 లక్షల మేర తీసుకుని మోసగించిన వ్యక్తిపై కొత్తపేట పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.

Published : 28 Nov 2022 04:04 IST

నకిలీ సబ్‌ కలెక్టర్‌ లీలలు..

చిట్టినగర్‌, న్యూస్‌టుడే: ఉద్యోగం లేదంటే ఏదైనా కాంట్రాక్టు ఇప్పిస్తానని సుమారు రూ.10 లక్షల మేర తీసుకుని మోసగించిన వ్యక్తిపై కొత్తపేట పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిట్టినగర్‌ వెంకటేశ్వరస్వామి గుడిలో పూజారిగా వినుకొండ రత్నమాచార్యులు పని చేస్తున్నారు. ఆ గుడికి కొత్తపేటకు చెందిన పిళ్లా వెంకట రాజేంద్ర, తన భార్య మహాలక్ష్మి గుడికి వచ్చి పూజలు చేయించుకునేవారు. వెంకట రాజేంద్ర తాను పౌరసరఫరాల శాఖ సబ్‌ కలెక్టర్‌నని, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు బాగా తెలుసని, పలుకుబడి ఉందని చెప్పాడు. పూజారి భార్య ఎం.కాం వరకు చదివి ఇంట్లోనే ఉంటుందని చెప్పగా బుక్‌ స్టేషనరీ కాంట్రాక్టు గానీ, ప్రభుత్వ ఉద్యోగం గానీ ఇప్పిస్తానని నమ్మబలికాడు. రెండేళ్లుగా పరిచయం ఉండటంతో వెంకట రాజేంద్రను పూజారి నమ్మాడు. ఎంత ఖర్చు అవుతుందని అడిగాడు. రూ.8లక్షలకు పైగా ఖర్చవుతుందని అతడు చెప్పాడు. ఈ నేపథ్యంలో 2022 జనవరి, ఫిబ్రవరిలో పలు దఫాలుగా వెంకట రాజేంద్రకు పూజారి డబ్బులు ఇచ్చాడు. రూ.1,10,000 విలువైన ఐ ఫోన్‌ కొనుగోలు చేసి వెంకట రాజేంద్ర భార్యకు ఇచ్చాడు. ఇలా మొత్తం రూ.9,91,500లు చెల్లించాడు. అప్పటి నుంచి ఉద్యోగం, కాంట్రాక్టు ఇప్పించకుండా కాలయాపన చేస్తూ వెంకట రాజేంద్ర తప్పించుకు తిరుగుతున్నాడు. పెద్దల సమక్షంలో మాట్లాడితే రూ.9,50,000 15 రోజుల్లో ఇస్తానని చెప్పాడు. గడువు పూర్తయినా డబ్బులు ఇవ్వలేదు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో మోసపోయినట్లు పూజారి గుర్తించారు. వంశీకృష్ణ అనే వ్యక్తి కూడా ఇదే తరహాలో వెంకట రాజేంద్రకు రూ.10 లక్షలు ఇచ్చి మోసపోయినట్లు తనకు తెలుసని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పూజారి పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని