logo

మిగులు ధాన్యం కొనేదెవరు..!

‘మా మిల్లుకు కేటాయించిన సీఎంఆర్‌ లక్ష్యం పూర్తయింది. మళ్లీ ధాన్యం పంపిస్తే.. ఏం చేయమంటారు..?’ ఇదీ ఓ మిల్లు యజమాని ప్రశ్న. దాదాపు 63 మిల్లుల లక్ష్యం మేరకు సీఎంఆర్‌ పూర్తయింది. రైతులు ధాన్యం తీసుకు వస్తున్నారు.

Updated : 05 Feb 2023 06:01 IST

లక్ష్యం పూర్తయ్యిందని సేకరణ నిలుపుదల
జిల్లాలో ఇంకా నూర్పిడి చేయని వరి కుప్పలు
ఈనాడు, అమరావతి పామర్రు రూరల్‌, న్యూస్‌టుడే

పొలాల్లోనే వరికుప్పలు

‘రైతుల దగ్గర ఉన్న ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం. తడిసిన, రంగు మారిన సరకును కూడా కొంటాం. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..!’

జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధుల స్పష్టీకరణ!

‘మా మిల్లుకు కేటాయించిన సీఎంఆర్‌ లక్ష్యం పూర్తయింది. మళ్లీ ధాన్యం పంపిస్తే.. ఏం చేయమంటారు..?’ ఇదీ ఓ మిల్లు యజమాని ప్రశ్న. దాదాపు 63 మిల్లుల లక్ష్యం మేరకు సీఎంఆర్‌ పూర్తయింది. రైతులు ధాన్యం తీసుకు వస్తున్నారు. వాళ్లు తీసుకోవడం లేదు. ఇప్పటికే భారత ఆహార సంస్థ నుంచి మిల్లులకు బిల్లులు రాక లబోదిబోమంటున్నారు. సీఎంఆర్‌ బిల్లులే దాదాపు రూ.1.50 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇంకా ధాన్యం సేకరిస్తే.. బ్యాంకు గ్యారెంటీలు పెంచి చూపెట్టాల్సి ఉంటుంది. దీంతో మిల్లుల యజమానులు వద్దని అంటున్నారు.

దిగుబడులపై కాకి లెక్కలు..!

ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ అనధికారికంగా నిలిపివేశారు. ఆర్‌బీకేలు, కొనుగోలు కేంద్రాల వద్ద అక్కడక్కడ కొంటున్నారు. డబ్బులు ఎప్పుడు వస్తాయో చెప్పలేకపోతున్నారు. ఇంకా నూర్పిడులు కాని ప్రాంతాలు చాలా ఉన్నాయి. అదనంగా మరో 50శాతం వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉంది.‌్ర కృష్ణా జిల్లాలో వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 4,08,900 ఎకరాల్లో ఖరీఫ్‌ వరి సాగు చేశారు. ప్రస్తుతం ఎకరానికి 45 బస్తాల వరకు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. దీని ప్రకారం మొత్తం 13.80లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. రైతులు తమ అవసరాలకు కొంత ఉంచుకున్నా.. ప్రభుత్వానికి 10లక్షల టన్నుల ధాన్యం విక్రయించే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 5.06లక్షల టన్నులే సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఆపైన సేకరించిన ధాన్యానికి సొమ్ములు చెల్లించడం కష్టమని తెలిసింది.
గన్నవరం, గుడివాడ, అవనిగడ్డ, పెనమలూరు నియోజకవర్గాల్లో అక్కడక్కడ మినుము సాగు చేశారు. ఈ ప్రాంతంలో ఇంకా కుప్పలు నూర్పలేదు. మరో 15 రోజుల తర్వాత ఈ ధాన్యం మార్కెట్‌కు రావాల్సి ఉంది. ఇప్పటికే లక్ష్యం పూర్తి కావడంతో వీటిని విక్రయించేదెలా అని కర్షకులు మధనపడుతున్నారు. బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం మండలాల్లో 40వేల టన్నుల ఉత్పత్తికి 20 వేల టన్నులు మాత్రమే మార్కెట్‌కు వచ్చాయి. మిగిలినవి కుప్పల మీదే ఉన్నాయి.
ఎన్టీఆర్‌ జిల్లాలో వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం వరి సాగు విస్తీర్ణం లక్ష ఎకరాలుగా చూపించారు. ఇంతకంటే ఎక్కువగానే సాగు చేశారు. ఇక్కడ కూడా 45 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. ఈ ప్రకారం 3.40లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కావాల్సి ఉంది. దీనిలో కనీసం 3 లక్షల టన్నులను విక్రయిస్తారు. కానీ లక్ష్యం మాత్రం 1.24 లక్షల టన్నులే. ఇది పూర్తయింది. ఇప్పుడు మిగిలిన ధాన్యం పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. 

వ్యాపారులు ఎందుకు కొనడంలేదు..?

ఈ ఏడాది బయట వ్యాపారులు ధాన్యం కొనడం లేదు. సాధారణ రకం (ఎంటీయూ లావులు) మాత్రం విక్రయిస్తున్నారు. బీపీటీలు, సన్నాలు రైతులు ఉంచుకుంటున్నారు. ఈ లావు రకం మద్ధతు ధర క్వింటా రూ.2040 ఉంది. దీన్ని మిల్లు ఆడిస్తే.. కేవలం 60శాతం మాత్రమే బియ్యం వస్తున్నాయి. కేజీ బియ్యం ధర రూ.38 వరకు ఖర్చు అవుతుంది. అంటే కనీసం రూ.40 కు విక్రయించాలి. అంత ధర లేదు. కేజీ రూ.27వరకు బయట మార్కెట్‌లో పలుకుతోంది. దీంతో వ్యాపారులు ధాన్యం కొనుగోలుకు సిద్దంగా లేరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని