logo

అప్రమత్తతతో మెలగాలి..!

‘పది’ పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి జరగనున్నాయి. గతేడాది ఏడు పేపర్లు పెట్టగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో వాటిని ఆరు పేపర్లకే కుదించి పరీక్షలు నిర్వహించేలా పరీక్ష విధానంలో మార్పులు తీసుకొచ్చారు.

Updated : 31 Mar 2023 06:33 IST

ఫిజిక్స్‌, ఎన్‌ఎస్‌ పరీక్షపై విద్యార్థుల్లో ఆందోళన
ప్రతి 15 నిమిషాలకు గుర్తుచేయాలని అధికారుల ఆదేశం
ఈనాడు, అమరావతి

‘పది’ పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి జరగనున్నాయి. గతేడాది ఏడు పేపర్లు పెట్టగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో వాటిని ఆరు పేపర్లకే కుదించి పరీక్షలు నిర్వహించేలా పరీక్ష విధానంలో మార్పులు తీసుకొచ్చారు. ఈ ఏడాది ఫిజిక్స్‌, నేచురల్‌ సైన్స్‌(ఎన్‌ఎస్‌)కు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు, వేర్వేరుగా ఆన్సర్‌ బుక్‌లెట్లు ఇస్తారు. దీనిపై ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో బాగా ఆందోళన నెలకొంది. ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే నిర్వహించిన ప్రీ పబ్లిక్‌ పరీక్షలో ప్రాక్టీస్‌ చేయించినా చాలా స్కూళ్లల్లో విద్యార్థులు ఫిజిక్స్‌ ఆన్సర్‌ బుక్‌లెట్‌లో ఎన్‌ఎస్‌ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు రాశారు. ఈ పొరపాటు పబ్లిక్‌ పరీక్షలో పునరావృతమైతే అంతిమంగా విద్యార్థులు నష్టపోతారని గుర్తు చేస్తున్నారు. రెండు ప్రశ్నపత్రాలు, రెండు ఆన్సర్‌ బుక్‌లెట్లు ఒకేసారి ఇస్తారు. దీంతో విద్యార్థులు వారికి ఏ పేపర్‌ తేలిగ్గా ఉందో దాన్ని ముందుగా రాసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ సమాధాన పత్రాలు వేర్వేరు ఆన్సర్‌ షీట్లపై రాయాల్సి ఉంది. దీంతో వాటిని రాసే క్రమంలో ఏదైనా పొరపాటున ఒక దానిపై రాయాల్సింది మరోదానిపై రాస్తే విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పి వేర్వేరుగా కాకుండా ఒకే ఆన్సర్‌బుక్‌లెట్‌లో సమాధానాలు రాసేలా వెసులుబాటు కల్పించాలని ఇప్పటికే ఉపాధ్యాయులు పరీక్షల విభాగం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. పిల్లలకు ఈ నూతన విధానం అలవాటు కావాలని, ఎన్‌సీఈఆర్‌టీ పరీక్షలు రాసేవారు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా మూడు పేపర్లు విడివిడిగా రాస్తారని, కనీసం మన విద్యార్థులు రెండు పేపర్లయినా రాయకపోతే ఎలా అని చెప్పి పాఠశాల విద్యాశాఖ రెండు పేపర్లు వేర్వురుగా రాసేలా ఈ ఏడాది నూతన విధానం ప్రవేశపెట్టింది.

ఎలా రాస్తారోననే సందేహం...

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఎన్నడూ లేనంత తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. అంతకుముందు ఏడాది వరకూ ఎప్పుడూ 90శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదవ్వలేదు. అలాంటిది గతేడాది  65.21 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఏకంగా 34.79 శాతం మంది పరీక్షలు తప్పారు. గతేడాది ఒక్క విద్యార్థి కూడా పాసవ్వని బడులు కూడా ఉమ్మడి జిల్లాలో ఎనిమిది ఉన్నాయి. ఇటీవల జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు విజయవాడలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పదో తరగతి పిల్లల్లో సామర్థ్యాలు పరిశీలించగా.. ఆంగ్లం, గణితం, సాంఘికశాస్త్రం, తెలుగు సహా అన్నింట్లోనూ బలహీనంగా ఉన్న విషయం బయటపడింది. ఈ సవాళ్ల నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారో, ఉత్తీర్ణత ఎలా ఉంటుందోనన్న ఆందోళన అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయుల్లో నెలకొంది.

సీరియల్‌ నంబరు వేర్వేరుగానే..

సీరియల్‌ నంబరు ఒకటి నుంచి 16 వరకు ఫిజిక్స్‌, 17 నుంచి 33వ ప్రశ్న దాకా ఎన్‌ఎస్‌ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పొరపాటున 17వ నంబరు ప్రశ్నకు ఫిజిక్స్‌ సమాధాన పత్రంలో రాస్తే ఆ మేరకు ఇన్వాలిడ్‌గా పరిగణిస్తారు. ఇది లేకుండా ఉండాలంటే 1 నుంచి 16 దాకా ఫిజిక్స్‌ ప్రశ్నావళికి ఆ ఆన్సర్‌ బుక్‌లెట్‌పైనే రాయాలి. ఎన్‌ఎస్‌కు కేటాయించిన 17 నుంచి 33 నంబర్ల దాకా సంబంధిత ఆన్సర్‌షీట్‌పై సమాధానాలు రాయాలని ప్రతి 15 నిమిషాలకు ఇన్విజిలేటర్లు గుర్తు చేస్తూ పిల్లలను అప్రమత్తం చేసేలా ఆదేశాలిచ్చారు. ఈ విషయాన్ని ప్రతి పరీక్ష గదిలో బోర్డుపై సైతం రాయాలని సూచించారు. తాము ఎంత ప్రాక్టీస్‌ చేయించినా ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు పాఠశాల స్థాయిలో నిర్వహించిన పరీక్షలోనే అయోమయం చెంది ఒకటే బుక్‌లెట్‌పై ఫిజిక్స్‌, ఎన్‌ఎస్‌కు సమాధానాలు రాశారని పలువురు హెచ్‌ఎంలు తెలిపారు. పరీక్ష ఒకే రోజు పెడుతున్నప్పుడు ఆన్సర్‌షీట్‌ సైతం రెండింటికి కలిపి ఒకటే ఇచ్చి రాయమంటే బాగుండేదని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. పరీక్ష వంద మార్కులకు ఉంటుంది.

జిల్లాలో ..
పరీక్షలు రాయబోయే విద్యార్థులు: 30,134
మొత్తం కేంద్రాలు: 154

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు