logo

Vijayawada: నువ్వు కట్టేయ్‌.. నే చూసుకుంటా.. వెలంపల్లి అరాచకం..

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అనేది నానుడి. కానీ ఇపుడు ‘రాజు’ గారు తలుచుకుంటే అసాధ్యం... సుసాధ్యం అవుతుందంటున్నారు మధురానగర్‌ వాసులు.

Updated : 10 Mar 2024 08:10 IST

ఇరుకు దారిలో దుకాణాల నిర్మాణం పునః ప్రారంభం

గత ఏడాది ఆగస్టు 24న  అడ్డుకోగా.. ఇలా పరదాలు కప్పేసి వదిలేశారు.

విజయవాడ, న్యూస్‌టుడే: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అనేది నానుడి. కానీ ఇపుడు ‘రాజు’ గారు తలుచుకుంటే అసాధ్యం... సుసాధ్యం అవుతుందంటున్నారు మధురానగర్‌ వాసులు. నాడు వద్దన్నది నేడు ముద్దు అవుతుందని మధురానగర్‌ పై వంతెన పక్కన పునఃప్రారంభమైన దుకాణాల నిర్మాణాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో నగర వాసులకు వరుసగా హామీలు గుప్పిస్తున్న ఓ ప్రజాప్రతినిధి.. నిర్మాణదారులకు నువ్వు కట్టేయ్‌... అంతా నేచూసుకుంటా అంటూ అడ్డగోలు హామీ ఇచ్చినట్లు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. గత ఏడాది ఆగస్టు 25న కూల్చివేసిన దుకాణాల సముదాయాన్ని.. మళ్లీ రాత్రికి రాత్రే కడుతున్నారు. మధురానగర్‌ పై వంతెన పక్కన అనుమతి లేకుండా నిర్మిస్తున్న దుకాణాల తంతు చూద్దామా..

మధురానగర్‌ పైవంతెన పక్కన సర్వీసురోడ్డులో 7 దుకాణాలను గత ఏడాది ఆగస్టులో నిర్మించారు. ఇరుకు దారిలో అనుమతి లేకుండా కడుతున్న దుకాణాలతో వచ్చే ఇబ్బందులను తెలియజేస్తూ ‘ఈనాడు’ గత ఏడాది ఆగస్టు 25న ‘ఇరుకు దారిలో... అనుమతి లేని నిర్మాణాలు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై అప్పట్లో పట్టణ ప్రణాళికాధికారులు స్పందించారు. బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ అదే రోజు అనుమతి లేకుండా నిర్మిస్తున్న దుకాణాల గోడలను కూల్చి వేశారు. రేకులను కొంత మేర తొలగించారు. తామే స్వచ్ఛందంగా తొలగించుకుంటామంటూ నిర్మాణదారులు కోరడంతో ఊరుకున్నారు. అప్పటి నుంచి నిర్మాణం చేయకుండా ఊరుకున్నారు.

ఇప్పుడు షట్టర్లు పెట్టి గోడలు కడుతున్నారిలా...

రాత్రికి రాత్రే వెలిసిన షట్టర్లు

దాదాపు 7 నెలలు ఊరుకున్న నిర్మాణదారులు తాజాగా నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన నియోజకవర్గ ఇన్‌ఛార్జిని కలిసినట్లు సమాచారం. స్థానిక వైకాపా నేత.. నిర్మాణదారులను సదరు కొత్త ఇన్‌ఛార్జికి పరిచయం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన.. అంతా నే చూసుకుంటా అంటూ హామీ ఇవ్వడంతో రాత్రికి రాత్రే షట్టర్లు నిర్మించారు. శనివారం ఉదయం దుకాణాల గోడలను నిర్మించడం ప్రారంభించారు. స్థానికులు నిర్మాణం జరుగుతున్న తీరును చూసి అంతా ‘వెలంపల్లి హామీ’ మహత్యం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పవు

పై వంతెన పక్కన రెండు సర్వీసు రోడ్లు ఉన్నాయి. పెట్రోల్‌ బంక్‌ వైపు సర్వీసు రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. ఒక కారు ఎదురు వస్తే తప్పుకొనేందుకు వీలుండదు. అందుకే కార్లు పైవంతెనకు రెండో వైపు ఉన్న సర్వీసు రోడ్డులో వెళుతూ, వస్తూ ఉంటాయి. ఇపుడు ఆ రోడ్డులోనే 7 దుకాణాలను వరుసగా నిర్మిస్తున్నారు. రేపు ఆ దుకాణాలకు వచ్చే వారు వాహనాలను రోడ్డు మీద పెడితే.. రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని స్థానికులు అంటున్నారు. అందుకే వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

తెలియదు... పరిశీలిస్తా

అనుమతి లేకుండా దుకాణాలు నిర్మిస్తున్నట్లు స్థానిక బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రమణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తాను కొత్తగా వచ్చానని దుకాణాల నిర్మాణం గురించి తెలియదని చెప్పారు. వాటిని పరిశీలిస్తానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని