logo

Vijayawada: దుర్గగుడిలో టికెట్ల మాఫియా

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దర్శన టికెట్లు రీసైక్లింగ్‌ చేస్తూ అమ్మవారి ఆదాయానికి భారీగా కొందరు ఉద్యోగులు గండికొడుతున్నారు.

Updated : 17 Mar 2024 09:38 IST

రూ. 500 టికెట్ల రీసైక్లింగ్‌
వైకాపా నేతల అండతో రెచ్చిపోతున్న కొందరు ఉద్యోగులు

ఇటీవల దుర్గగుడి దర్శనానికి వచ్చి అధికారులతో
గొడవ పడి వెళ్లిపోతున్న పాలకమండలి సభ్యురాలి భర్త

విజయవాడ వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దర్శన టికెట్లు రీసైక్లింగ్‌ చేస్తూ అమ్మవారి ఆదాయానికి భారీగా కొందరు ఉద్యోగులు గండికొడుతున్నారు. అధికార పార్టీ వైకాపా నేతల అండదండలతో కొందరు ఉద్యోగులు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. వైకాపా ప్రజా ప్రతినిధులు-దుర్గగుడి పాలకమండలికి సంబంధించిన అనుచరులు, బంధువులు యథేచ్ఛగా అంతరాలయ దర్శనాలు చేసుకుంటున్నారు. దీని కోసం పాత టికెట్లను మళ్లీ.. మళ్లీ వినియోగిస్తున్నారు. దుర్గగుడిలో ఐదేళ్లుగా ఈ దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. పరిస్థితి చేయదాటిన తరువాత ఎట్టకేలకు తాజాగా ఇద్దరిపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. దుర్గగుడికి రెండు రోజుల కిందట వైకాపాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి బంధువులు కొంత మంది దర్శనానికి వచ్చారు. వారిని రూ.500 టికెట్లు స్కానింగ్‌ చేసే ప్రాంతం వద్ద సిబ్బంది ఆపారు. దీంతో తాము ప్రజాప్రతినిధికి సంబంధించిన బంధువులమంటూ గొడవకు దిగారు. అనంతరం వారు ఈవోకు ఫిర్యాదు చేశారు. ఈవో వచ్చి దర్శనం చేసుకుంటున్న భక్తుల సంఖ్య, టికెట్ల సంఖ్యను బేరీజు వేసి చూస్తే తేడా ఉన్నట్లు తేలింది. పాత టికెట్లనే మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే టికెట్లు చించే వ్యక్తిని, స్కానింగ్‌ వద్ద ఉన్న వ్యక్తిని ఒక రోజు విధులకు రాకుండా ఆపేశారు. ఆ మరుసటి రోజు వైకాపా నాయకుల జోక్యంతో వారిద్దరికీ రైల్వే స్టేషన్‌ వద్ద ఉన్నటువంటి దుర్గగుడి ప్రసాదాల కౌంటర్‌లో విధులు కేటాయించారు. స్థానికంగా ఉన్నటువంటి కొంత మంది వైకాపా నేతల అండదండలతో టికెట్ల పునర్వినియోగం జరుగుతుండగా బయట నుంచి దర్శనానికి వచ్చిన మరో వైకాపా ప్రజాప్రతినిధి బంధువులు అనుకోకుండా చేసిన ఫిర్యాదుతోనే ఈ అక్రమం వెలుగు చూడటం కొసమెరుపు.

అడ్డదారిలో దర్శనాలు..  ఆపై బెదిరింపులు

దుర్గగుడికి తాజాగా ఒక పాలకమండలి సభ్యురాలి భర్త దర్శనానికి వచ్చారు. దర్జాగా అంతరాలయ దర్శనం చేసుకున్న అనంతరం మండపంలో ఆశీర్వచనం అందుకున్నారు. అది కూడా చాలదని వీఐపీల మాదిరిగా ఆలయ గౌరవ మర్యాదలతో తనకు దర్శనం కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీనికి అక్కడున్న ఏఈవో అంగీకరించకలేదు. పాలకమండలి సభ్యురాలొస్తే మర్యాదలు కల్పిస్తామని, మిగతా వారికి ఏ విధంగా కల్పిస్తామని ప్రశ్నించారు. దీనికి నిబంధనలు అంగీకరించవని తేల్చి చెప్పారు. పాలకమండలి సభ్యురాలి భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీ అంతు చూస్తానంటూ సదరు అధికారిని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని