logo

ఫ్యాన్‌ రెక్కలు విరగడం ఖాయం : బొండా

మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్‌ రెక్కలు విరిగి, ముక్కలవుతుందని తెదేపా, జనసేన, భాజపా కూటమి మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

Updated : 17 Mar 2024 06:40 IST

ఉమామహేశ్వరరావు

మొగల్రాజపురం (చుట్టుగుంట), న్యూస్‌టుడే : మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్‌ రెక్కలు విరిగి, ముక్కలవుతుందని తెదేపా, జనసేన, భాజపా కూటమి మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఆయన మొగల్రాజపురంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో.. రాష్ట్ర ప్రజలకు రాక్షస పాలన నుంచి విముక్తి లభించిందన్నారు. మరో 45 రోజుల్లో పూర్తి స్వేచ్ఛ వస్తుందని పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అయిదేళ్ల విధ్వంసక, విద్వేష పాలనతో రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేరని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 28 పథకాలు, బీసీలకు 30 పథకాలు, మైనార్టీలకు చెందిన 11 పథకాలను రద్దు చేసి.. వందలాది మందిపై మారణహోమం సృష్టించారని పేర్కొన్నారు. జగన్‌ పాలనకు ముగింపు పలికే సమయం శనివారంతో మొదలైందన్నారు. ప్రజలంతా ముక్తకంఠంతో బైబై జగన్‌ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు శాశ్వతంగా రాజకీయ సమాధి కడతారని పేర్కొన్నారు. అన్నకు ఓటు వేయవద్దని సొంత చెల్లెళ్లే కోరుతున్నారని, ఇంతకంటే చెంపదెబ్బ ఏం ఉంటుందన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచే కాదు.. ఈ రాష్ట్రం నుంచి కూడా ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో నిర్వహించే ‘ప్రజాగళం’ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఉమా కోరారు. ఈ సమావేశంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్‌ ఘంటా కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని