logo

AP Volunteers: మీకో దండం.. మీతో ఉండం

మచిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్‌కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు.

Updated : 29 Mar 2024 07:47 IST

వైకాపా అభ్యర్థుల ఒత్తిడి తట్టుకోలేక రాజీనామాలు
బందరులో నెలలోపే వైదొలగిన 12 మంది వాలంటీర్లు
ఈనాడు, అమరావతి - ఈనాడు డిజిటల్‌, మచిలీపట్నం

మచిలీపట్నంలో ఇటీవల కిట్టు ప్రచారంలో పాల్గొని వేటుకు గురైన వాలంటీర్లు

చిలీపట్నం నగరపాలిక పరిధిలో 12 మంది వాలంటీర్లు ఈ నెలలోనే తమ రాజీనామాలను కమిషనర్‌కు సమర్పించారు. 39వ వార్డులో ఆరుగురు, 20వ వార్డులో నలుగురు, 7, 47వ వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున వైదొలగారు. వీరందరూ ఎన్నికల నేపథ్యంలో వైకాపా నాయకుల ఒత్తిడి తట్టుకోలేక వ్యక్తిగత కారణాలను చూపిస్తూ.. రాజీనామాలు సమర్పించారు.  

వీరి బాటలోనే కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో చాలామంది వాలంటీర్లు రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నిత్యం తమతో ప్రచారానికి రావాలనీ, జనాన్ని తేవాలని వైకాపా నేతలు తెస్తున్న ఒత్తిడి భరించలేకే.. వాలంటీర్లు కొలువులు వదిలి వెళ్లిపోతున్నారు. కోడ్‌ అమలుతో ఇప్పటికే గన్నవరం, మచిలీపట్నం, తిరువూరు సహా పలు నియోజకవర్గాల్లో వాలంటీర్లపై వేటు పడింది. ఉద్యోగం నుంచి తొలగించడమే కాదు.. కేసులు సైతం నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో వాలంటీర్లు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. కొలువులో ఉంటే వైకాపా అభ్యర్థుల ఒత్తిడి ఎక్కువైపోతోంది.. వారితో వెళితే అధికారులు సస్పెండ్‌ చేస్తున్నారు. ఒకవేళ కేసులు నమోదైతే.. ఇక జీవితంలో ఏ కొలువుకూ పనికి రాకుండాపోతారు. ఈ తలనొప్పులు ఎందుకని చాలామంది వదిలేసి వెళ్లిపోతున్నారు.

విస్సన్నపేటలో ఇటీవల వైకాపా ప్రచారంలో వాలంటీర్లు

వాలంటీర్లను పావులుగా వాడుకుని మళ్లీ అధికారంలోకి రావాలని సీఎం జగన్‌ మొదలు వైకాపా అభ్యర్థుల వరకూ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే.. నియోజకవర్గాల్లో ఏ సమావేశం జరిగినా, విందు, వినోదాలు నిర్వహించినా.. కొన్ని నెలలుగా వాలంటీర్లకే నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ‘మనమంతా ఒకటే.. మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే.. అది మీపైనే ఆధారపడి ఉంది. ఇంటింటికీ వెళ్లి.. జగనన్న రాకపోతే.. పింఛన్లు ఆగిపోతాయని తప్పుడు ప్రచారం చేయండి. ప్రతిపక్ష అభ్యర్థులపైనా విష ప్రచారం చేయండని’.. వాలంటీర్లకు సమావేశాలు పెట్టి మరీ వైకాపా అభ్యర్థులు కొన్నాళ్లుగా నూరి పోస్తున్నారు. దీని ప్రభావంతో.. వాలంటీర్లు కూడా ఇంటింటికీ వెళ్లి.. ఇదే చెబుతున్నారు. కానీ.. ప్రస్తుతం పరిస్థితి మారింది. కోడ్‌ అమలుతో వాలంటీర్ల మెడపై కత్తి వేలాడుతోంది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న, వైకాపా అభ్యర్థులతో కలిసి తిరిగే వారిపై.. వేటు వేస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఇప్పటికే చాలామంది వాలంటీర్లపై వేటు పడింది. ప్రస్తుతం కేసులు పెట్టేందుకూ సిద్ధమవుతున్నారు. కేసులు నమోదైతే భవిష్యత్తులో కొలువులు, ఉద్యోగ అవకాశాలు రావని తల్లిదండ్రుల్లో భయం నెలకొంది. అందుకే.. ఎట్టిపరిస్థితుల్లోనూ వైకాపా అభ్యర్థులతో కలిసి ప్రచారం చేయొద్దని వాలంటీర్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు చెబుతున్నారు.

తాయిలాల్లోనూ పెద్దపీట..

ఉమ్మడి జిల్లాలో 22 వేల మంది వాలంటీర్లు.. ఒక్కో నియోజకవర్గంలో 1,300-1,500 మంది ఉన్నారు. వీరితో వైకాపా అభ్యర్థులు ఇప్పటికే ఆత్మీయ సమావేశాలు పెట్టారు. వైకాపాను గెలుపునకు ఓటర్లను ఎలా ప్రభావితం చేయాలో హితబోధ చేశారు. సమావేశం ముగిశాక విందు భోజనాలు పెట్టి, చేతిలో కుక్కర్లు, మిక్సీలు, చీరలు, దుస్తులు, స్మార్ట్‌వాచ్‌లు పెట్టారు. వాటితోనే ఓ చిన్న కవరులో రూ.2-5 వేలు చొప్పున ఒక్కోచోట ఒక్కో మాదిరిగా నగదు అందజేశారు. మొదట్లో దర్జాగా ఈ తాయిలాలు పంచారు. పెనమలూరులో మంత్రి జోగి తాయిలాల పంపిణీ వివాదంగా మారడం, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వెళ్లడంతో.. ఆపై గుట్టుగా వాలంటీర్ల ఇళ్లకే అందించారు. కోడ్‌ వచ్చేంత వరకూ ఇవన్నీ దర్జాగా సాగాయి. కోడ్‌ వచ్చాక.. వైకాపా అభ్యర్థులతో వాలంటీర్లు కనిపించడం, ఇంటింటికీ వెళ్లి ప్రతిపక్షాలపై విష ప్రచారం చేసే వారిపై వేటు పడడంతో.. వారిలో భయం మొదలైంది.

బయటకు వెళ్లొద్దంటున్న తల్లిదండ్రులు..

‘కష్టపడి బీటెక్‌ చదివిస్తే.. వాలంటీరుగా చేరారు. నెలంతా గొడ్డు చాకిరీ చేస్తే రూ.5 వేలు ఇస్తున్నారు. మూడు నెలలుగా వైకాపా అభ్యర్థులు ప్రచారంలో వాడుకుంటున్నారు. కోడ్‌ వచ్చినా.. వెంట తిరగాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రచారానికి వెళ్తే కేసులు పెడతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. కేసులు నమోదైతే వీళ్ల జీవితమే నాశనమైపోతుంది. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు కూడా రావు. ఏమైనా సరే.. ఇల్లు దాటి వెళ్లొద్దని మా పిల్లలకు చెప్పాం. అవసరమైతే కొలువు వదిలేయమన్నామని’ ఉమ్మడి జిల్లాలో ఇంజినీరింగ్‌ చదివి వాలంటీర్లుగా చేరిన పలువురి తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రధానంగా మహిళా వాలంటీర్లను బయటకు పంపేందుకు చాలామంది తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని