logo

నమ్మించి.. వంచన

ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారికి రావాల్సిన బకాయిలను సైతం ఏళ్లతరబడి విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 17 Apr 2024 04:22 IST

బకాయిల కోసం ఉద్యోగుల ఎదురు చూపులు
మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే

బందరు: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా చౌక్‌లో ఆందోళన

ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారికి రావాల్సిన బకాయిలను సైతం ఏళ్లతరబడి విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బకాయిలు చెల్లించకపోగా ఆ నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకోవడం పట్ల ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్‌ నుంచి రుణాలు తీసుకోవాలన్నా ఆరునెలల నుంచి ఏడాది కాలం ఎదురు చూడాల్సిన దుస్థితి దాపురించింది. పిల్లల ఉన్నత చదువులు, వివాహాలు, ఇంటి నిర్మాణాలకోసం జీపీఎఫ్‌ రుణం కోసం దరఖాస్తు చేసుకుని సకాలంలో అందక, బయట అప్పులు చేసి వడ్డీలు చెల్లించలేక అనేక అవస్థలు పడ్డారు.  రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛను దారులకు రావాల్సిన వివిధ బకాయిలు రూ.25వేలకోట్లు  ఉండగా జిల్లాలో దాదాపు 15వేలమందికి పైగా రూ.వెయ్యి కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్లు ఉద్యోగ వర్గాల అంచనా. బకాయిలపై తరుచూ ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకపోగా కక్ష కట్టినట్లు వ్యవహరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యనిధి ఖాతాకు వడ్డీ జమచేయకపోవడంతో నిల్వలు తగ్గిపోతున్నాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.


అప్పులు చేయాల్సివచ్చింది.. 
- బి.మాణిక్యాలరావు, ఏటీపీఎఫ్‌ నాయకుడు

గతంలో ఎన్నడూ లేని విధంగా బకాయిలు రూ.వేల కోట్లల్లో పేరుకుపోయాయి. ఓ ఉద్యోగి తన కుటుంబ అవసరాల నిమిత్తం పీఎఫ్‌ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఆరునెలలకు గాని రుణానికి సంబంధించి నిధులు జమ కాలేదు. అవసరానికి రుణం నిధులు జమకాకపోవడంతో చేసేది లేక బయట వ్యాపారుల వద్ద అప్పుతెచ్చుకోవాల్సి వచ్చింది. సరెండర్‌లీవుల బకాయిల కోసం ఇప్పటికీ ఎదురుచూపులు చూస్తూనే ఉన్నాం.


ఎప్పుడూ ఇలా లేదు
-  వీరంకి వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయ సంఘ నాయకుడు

జిల్లా పరిషత్‌ పీఎఫ్‌ బకాయిలు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి.ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆరునెలలైనా ఇంతవరకు  పీఎఫ్‌ చివరి చెల్లింపులు ఇవ్వడం లేదు. ఉన్నత పాఠశాలలో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన పీజీటీలకు ఇంక్రిమెంట్‌ చేసుకోవడానికి ఏడాది తరువాత అవకాశం కల్పించారు. అవి ఇప్పటికీ ఖాతాలకు జమకాలేదు. ఇలా ఉద్యోగ, ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.


నెలల తరబడి ఎదురుచూపులే..
- కొప్పినీడి సూర్యప్రకాష్‌, యూటీఎఫ్‌ జిల్లా నాయకుడు

ఉద్యోగ విరమణ చేసిన ఓ ఉద్యోగి తనకు రావాల్సిన భవిష్యనిధికి సంబంధించిన డబ్బుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి గతంలో లేదు. బ్యాంకు ఖాతా చూసుకోవడం నిరాశ చెందడం పరిపాటిగా మారింది. బకాయిలు విడుదల చేయాలంటూ రోడ్లెక్కి నిరసనల రూపంలో ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తే అవసరాలకు వినియోగించుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని