logo

పాఠం చెప్పేదెవరు..!

కస్తూర్బా బాలికా (మైనార్టీ) విద్యాలయంలో 6 నుంచి 10వ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 200 మంది అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్‌ వరకూ అప్‌గ్రేడ్‌ చేశారు.

Published : 12 Aug 2022 04:47 IST

అప్‌గ్రేడ్‌ చేసి.. నియామకాలు మరిచి
కస్తూర్బాల్లో ఇంటర్‌  కోర్సులకు అధ్యాపకులేరీ?

అనంత గ్రామీణం కురుగుంటలోని కస్తూర్బా బాలికా (మైనార్టీ) విద్యాలయంలో 6 నుంచి 10వ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 200 మంది అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్‌ వరకూ అప్‌గ్రేడ్‌ చేశారు. సీఈసీ గ్రూపు ప్రవేశపెట్టారు. ఎనిమిది మంది విద్యార్థినులు చేరారు. ఇక్కడ పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ లేరు. ఇంటర్‌ తరగతులు బోధించడానికి పీజీటీలు ఐదుగురిని నియమించాల్సి ఉంది. అధ్యాపకులు లేక తరగతులు నిర్వహించలేని పరిస్థితి.
తనకల్లులో ఎంఈసీ గ్రూపు మంజూరు చేశారు. 15 మంది ప్రవేశాలు పొందారు. తరగతుల నిర్వహణకు పీజీటీలను నియమించలేదు. దీంతో తరగతులకు హాజరు కావద్దంటూ విద్యార్థినులకు చెబుతున్నారు. 6-10 తరగతులకు సరిపడా గదులు ఉన్నాయి.

టర్‌ విద్యార్థులు వస్తే ఇబ్బందులు తప్పవు.
అనంత విద్య, గుమ్మఘట్ట, న్యూస్‌టుడే: నిరుపేదలు, అనాథలైన విద్యార్థినులకు ఉచిత భోజనం, వసతితోపాటు విద్యను అందించాలనే ఉద్దేశంతో కస్తూర్బా బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ఏర్పాటు చేశారు. ఉమ్మడి అనంత జిల్లాలో 62 కేజీబీవీలు ఉన్నాయి. పెనుకొండ, కొత్తచెరువు మినహా అన్ని మండలాల్లో నెలకొల్పారు. తొలుత 6 నుంచి 10 వరకు తరగతులు నిర్వహించగా.. అనంతరం ఇంటర్‌ విద్య ప్రవేశపెట్టారు. రెండు విడతల్లో 28 విద్యాలయాల్లో ఇంటర్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించగా.. తాజాగా అన్ని విద్యాలయాల్లోనూ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఒక కోర్సు మాత్రమే ఆఫర్‌ చేస్తున్నారు. ఉదాహరణకు కురుగుంటలో సీఈసీ, ఆత్మకూరులో కంప్యూటర్‌, శింగనమలలో ఎంపీసీ, నార్పలలో ఎంఈసీ కోర్సు మాత్రమే ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. బోధించే వారే లేరు. కామర్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, కంప్యూటర్‌, ఫిజిక్స్‌, తెలుగు, ఆంగ్లం అధ్యాపకులు ఒక్కరు కూడా లేరు. పాఠాలు చెప్పేవారు లేరు.. తరగతులకు రావద్దని చెబుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సరైన ప్రచారం లేకపోవడంతో 20 శాతంలోపే ప్రవేశాలు పొందారు. ఒక్కో విద్యాలయంలో 8 నుంచి 12 మంది చేరారు.

523 పోస్టులు ఖాళీ
గతేడాది ఇంటర్‌ అమలు చేసిన 28 విద్యాలయాల్లో 78 పీజీటీ పోస్టులు ఖాళీలున్నాయి. వాటిని తాత్కాలిక, ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రకటన జారీ చేశారు. నిబంధనలు కఠినంగా ఉన్నందున దరఖాస్తు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. 78 పోస్టులకు ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తు కూడా అనర్హత లేనిదిగా గుర్తించారు. కొత్తగా అన్నిచోట్ల ఇంటర్‌ అప్‌గ్రేడ్‌ చేయడంలో సుమారు 523 పోస్టులు అవసరమవుతాయి. అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకుండా ఇంటర్‌ ప్రవేశపెడితే ఎలాగని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కేజీబీవీల్లో సీఆర్టీల కొరత వేధిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో 14 ప్రధానాచార్యులు, 6 నుంచి 10 వరకు పాఠ్యాంశాలను బోధించే 85 సీఆర్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

జూనియర్‌ కళాశాలల్లోనూ కొరతే
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనూ అధ్యాపకుల కొరత వెంటాడుతోంది. అనంతపురం జిల్లాలో 23 ప్రభుత్వ కళాశాలలున్నాయి. వాటిలో 12 మంది రెగ్యులర్‌ ప్రిన్సిపాళ్లు, 11 మంది ఇన్‌ఛార్జి ప్రిన్సిపాళ్లు పనిచేస్తున్నారు. రెగ్యులర్‌ అధ్యాపకులు 112, ఒప్పంద ప్రాతిపదికన 210 మంది, మినిమం టైంస్కేల్‌ కింద 17 మంది, అతిథి అధ్యాపకులు 54 మంది పనిచేస్తున్నారు. 736 పోస్టులకు గాను 393 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో బోధన సక్రమంగా సాగడంలేదు. ఇంటర్‌ ఫలితాలపై ప్రభావం చూపుతోంది. గత పరీక్షల్లో 22 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.

గుమ్మఘట్ట కేజీబీవీలో అంతా గెస్టు టీచర్లు ఉన్నారు. ఇక్కడ రెండేళ్ల ఇంటర్‌ కొనసాగుతోంది. ఆంగ్లం, బాటనీ, ఎకనామిక్స్‌కు జీపీటీలు లేరు. దీంతో ఇంటర్‌లో ఆశించిన ఫలితాలు రాలేదు. పాఠ్య పుస్తకాలు రాలేదు.
* ఓడీచెరువులో ఈ ఏడు ఇంటర్‌ బైపీసీ ప్రవేశ పెట్టారు. 18 మంది బాలికలు చేరారు. ఆరుగురు పీజీటీలు అవసరం. ఒక్కరిని కూడా నియమించలేదు.
* పుట్టపర్తిలో ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులో ప్రవేశాలు కల్పించారు. ఐదుగురు మాత్రమే చేరారు. అధ్యాపకులు లేరు.
* తలుపులలో గతేడాది ఇంటర్‌ ప్రారంభించారు. ద్వితీయ విద్యార్థులు 32 మంది ఉన్నారు. ప్రథమ ఇంటర్‌లో 21 మంది చేరారు. ఇక్కడ తెలుగు బోధకురాలు మాత్రమే ఉన్నారు.
బదిలీల తర్వాతే నియామకాలు - తిలక్‌ విద్యాసాగర్‌, ఏపీసీ, సమగ్రశిక్ష
అధ్యాపకులను నియమిస్తారు. ఇంటర్‌ అడ్మిషన్లు జరుగుతున్నాయి. కేజీబీవీలో ఉద్యోగుల బదిలీల తర్వాత నియామకాలు చేపడతారు. విద్యార్థినులకు చదువులకు ఆటంకం లేకుండా చూస్తాం.
*   ఉమ్మడి జిల్లాలో కేజీబీవీలు:        62
*   గతంలో ఇంటర్‌ వరకు ఉన్నవి:   28
*  కొత్తగా అప్‌గ్రేడ్‌ అయినవి:         34
*   ఖాళీగా ఉన్న పీజీటీ పోస్టులు:     78
*  కొత్తగా అవసరమైన పోస్టులు:    172
*  ఇంటర్‌ చేరిన విద్యార్థినులు:      523

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని