logo

పదోన్నతులు, బదిలీలు లేనట్టే!

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. బదిలీలు, పదోన్నతులు కల్పించకుండా సర్దుబాటు చర్యలు చేపట్టింది.

Published : 03 Dec 2022 02:35 IST

ఉపాధ్యాయుల సర్దుబాటుకు కసరత్తు

పుట్టపర్తి గ్రామీణం, అనంత విద్య, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. బదిలీలు, పదోన్నతులు కల్పించకుండా సర్దుబాటు చర్యలు చేపట్టింది. అవసరమైన పాఠశాలలకు ఉపాధ్యాయుల సర్దుబాటు ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులకు ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే పదోన్నతులు వచ్చిన వారు, మిగులుగా తేలిన వారు చాలాచోట్ల పాత పాఠశాలల్లోనే పని చేస్తున్నారు. వీరిని కొత్త స్థానాలకు పంపనున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో ఉన్నందున ఈ ఏడాది బదిలీలను వాయిదా వేసినట్లు తెలిసింది. డిసెంబరు 3వ తేదీలోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.

జిల్లాలో ఎక్కడికైనా..

సర్దుబాటు కింద ఉపాధ్యాయులను జిల్లాలో ఎక్కడ్నుంచి ఎక్కడికైనా మండలం, డివిజన్‌ అనే నిబంధనలతో సంబంధం లేకుండా నియమించుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. పదో తరగతి  ఉన్న పాఠశాలలో ప్రతి సబ్జెక్టుకు కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండేలా స్కూల్‌ అసిస్టెంట్లను సర్దుబాటు చేస్తారు. 3, 4, 5 తరగతులు మ్యాప్‌ చేయబడిన ఉన్నత పాఠశాలలకు ఎస్‌ఏలను డిప్యూట్‌ చేయడంతోపాటు మిగులుగా ఉన్న ఎస్జీటీలను 3, 4, 5 తరగతులకు కూడా సబ్జెక్టు టీచర్లను కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు.

430 మందిపై ప్రభావం

ఉమ్మడి జిల్లాలో పదోన్నతులు, బదిలీల కౌన్సెలింగ్‌ ప్రక్రియ సెప్టెంబరు, అక్టోబరులో జిల్లా విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. మొత్తం 430 మంది దాకా హెచ్‌ఎంలు, ఎస్‌ఏలు పదోన్నతులు పొందారు. వీరంతా పదోన్నతులు, బదిలీ ఉత్తర్వులు వస్తాయని ఎదురుచూశారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఉసూరుమన్నారు. జిల్లాలో 42 మంది హెచ్‌ఎంలు, ఎస్‌ఏలు ఉర్దూ 30, హిందీ 45, ఆంగ్లం 130, గణితం 36, ఉర్దూ గణితం 6, ఉర్దూ పీఎస్‌ 6, ఎన్‌ఎస్‌ 4, సోసియల్‌ స్టడీస్‌ 12, ఎస్‌ఏ పీడీ 113 మందికి పదోన్నతులు కల్పించారు. అయితే వారికి అధికారికంగా ఉత్తర్వులు అందలేదు.


ఉత్తర్వుల మేరకే..

మీనాక్షి, డీఈవో, శ్రీసత్యసాయి జిల్లా

జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి ప్రభుత్వం సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల మేరకు ఉమ్మడి జిల్లా అధికారులతో చర్చించి ప్రక్రియ పూర్తి చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని