logo

అప్పుల బాధతో చేనేత కార్మికుడి బలవన్మరణం

ధర్మవరంలోని సిద్ధయ్యగుట్ట కాలనీకి చెందిన జింకా హరీష్‌ (26) అనే చేనేత కార్మికుడు అప్పుల బాధతో గాంధీనగర్‌ రైల్వే వంతెన వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Published : 04 Feb 2023 04:00 IST

హరీష్‌
(పాత చిత్రం)

ధర్మవరం, న్యూస్‌టుడే : ధర్మవరంలోని సిద్ధయ్యగుట్ట కాలనీకి చెందిన జింకా హరీష్‌ (26) అనే చేనేత కార్మికుడు అప్పుల బాధతో గాంధీనగర్‌ రైల్వే వంతెన వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను శుక్రవారం ఉదయం రైల్వేట్రాక్‌పై తల, మొండెం వేరు అయి విగత జీవిగా కనిపించాడు. రైల్వే జీఆర్పీ ఎస్‌ఐ గోపీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు హరీష్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చేనేత మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్న అతను మూడేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు పడుతుండేవాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. హరీష్‌ అవివాహితుడు కాగా అతనికి సోదరుడు చంద్రమోహన్‌, తల్లిదండ్రులు లలితమ్మ, రామాంజనేయులు ఉన్నారు. కరోనా సమయంలో ముడిపట్టు ధరలు పెరగడం, నేసిన పట్టు చీరలకు గిట్టుబాటు ధర లభించకపోవడం, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక రైలు కిందపడి హరీష్‌ ఆత్మహత్య చేసుకున్నాడని, రూ.10 లక్షలకు పైగా అప్పులు ఉన్నాయని సోదరుడు చంద్రమోహన్‌ తెలిపారు. అప్పులు ఇచ్చిన వారు చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేయడంతో రైలు కిందపడి బలవన్మరణం చెందాడని పేర్కొంటున్నారు. హరీష్‌ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని