logo

బంగారు నాణేల పేరుతో కుచ్చుటోపీ

బంగారు నాణేలు ఎర చూపి నకిలీ నాణేలు అంటగట్టి కుచ్చుటోపీ పెట్టిన వైనం శనివారం అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో చోటుచేసుకుంది.

Updated : 26 Mar 2023 04:06 IST

నకిలీ బంగారు నాణేలు

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే : బంగారు నాణేలు ఎర చూపి నకిలీ నాణేలు అంటగట్టి కుచ్చుటోపీ పెట్టిన వైనం శనివారం అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజశేఖరరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన దీపికకు సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తన పేరు రాజు అని చెప్పి ఆమెతో సంభాషించేవాడు. మాటలు కలిపి తన వద్ద బంగారు నాణేలు ఉన్నాయని దీపికను నమ్మించాడు. ఆమెకు రెండు బంగారు నాణేలు పంపించారు. గత నెల 7న రెండు నాణేలను కర్ణాటక రాష్ట్రం హొసపేటెలోని బంగారు దుకాణంలో చూపించగా అవి బంగారు నాణాలే అని నిర్ధారించారు. దీంతో తమకు 200 నాణేలు కావాలని రాజుకు చెప్పారు. రూ.2లక్షలు ఖర్చవుతుందని నిందితుడు వారిని నమ్మించాడు. తక్కువ ధరలకు బంగారు వస్తుందని భావించిన వీరికి నిందితుడు నకిలీ నాణేలు అంటగట్టేందుకు నిత్యం దీపికను చరవాణిలో ఇబ్బంది పెట్టేవాడు. శనివారం కర్నూలు జిల్లాకు ఆమెను రమ్మన్నాడు దీంతో ఆమె కుమారుడు శివసుబ్రహ్మణ్యం, మరో వ్యక్తి రమేష్‌ కలిసి కారులో బయలుదేరారు. కర్నూలుకు వచ్చాక గుత్తికి రావాలని సూచించాడు. గుత్తికి వచ్చాక అనంతపురం రమ్మని చెప్పాడు. తాము ఎక్కడికీ రాలేమని చెప్పడంతో అనంతపురం సమీపంలోని గేట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద తాను ఉన్నాను అక్కడికి రావాలని కోరాడు. వారు కళాశాల వద్దకు వచ్చారు. అంతలోనే రాజు మరో ఇద్దరు వ్యక్తులు దీపికను కలిసి నకిలీ నాణేలు అప్పగించి రూ.2లక్షలు నగదు తీసుకుని పరారయ్యారు. నాణేలను దీపిక గుత్తిలోని బంగారు దుకాణంలో పరీక్షించగా అవి నకిలీవని తేలింది. అవాక్కయిన వారు తాము మోసపోయామని భావించి పెద్దవడుగూరు పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై రాజశేఖరరెడ్డి చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఎవరూ మోసపోవద్దు:    బంగారు నాణేలు, ఆభరణాలంటూ ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు చరవాణిలో నమ్మించేందుకు ప్రయత్నిస్తే మోసపోవద్దని ఎస్సై రాజశేఖరరెడ్డి సూచించారు. వారి ప్రలోభాలకు గురికావద్దన్నారు.

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని