logo

కలహించుకుని.. కడతేర్చుకుని!

క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయి. పలువురు ఆవేశపూరిత నిర్ణయాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.

Updated : 02 Jun 2023 06:12 IST

చిన్నపాటి సమస్యలకే ఊపిరి తీసుకుంటున్న వైనం

అనంత నేరవార్తలు, కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే : క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయి. పలువురు ఆవేశపూరిత నిర్ణయాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సభ్యుల చిన్నపాటి మనస్పర్థలు విలువైన ప్రాణాలను తీస్తున్నాయి. నాలుగు గోడల మధ్య కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే వాటికి పరుష పదజాలంతో, కించపరుచుకునే విధంగా ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఎవరూ తగ్గకపోవడం.. మనస్తాపానికి గురై దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. వేరు కాపురాలు పెట్టడంతో కలహాలు తలెత్తినపుడు మంచీచెడూ చెప్పేవారు కరవయ్యారు.

పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి: కలహాలకు కారణాలు ఏవైనా చివరగా తీవ్రంగా నష్టపోయేది, ఒంటరిగా మిగిలిపోయేది పిల్లలే. వారి భవిష్యత్తు అంధకారం అవుతోంది. తాము దూరమైతే పిల్లలు ఎలా బతుకుతారు అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అనంత నగరంలోని ఆర్కేనగర్‌కు చెందిన బాలశంకరయ్య కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. వ్యాపారం, కుటుంబ పోషణ నిమిత్తం అప్పులు చేశాడు. ఈ విషయంగా కుటుంబంలో గొడవ జరిగింది. గత నెల 19న ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. ఐదు రోజుల తర్వాత గార్లదిన్నె సమీపంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
నగర పరిధిలోని సిండికేట్‌ నగర్‌లో సుంకన్న కుటుంబం వ్యాపారం చేస్తుంది. కుమారులు ఇద్దరూ చూసుకునే వారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించి తండ్రి.. చిన్నకుమారుడు హరిబాబును మందలించడంతో ఇంటి పక్కనే షెడ్డులో ఉరేసుకున్నాడు.

అనంత గ్రామీణం కొడిమికి చెందిన స్వర్ణ నెల క్రితం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. అనార్యోగం, తమ్ముడు జీవితంలో స్థిరపడలేదని తరచూ బాధపడుతుండేది. ఈక్రమంలో మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంది.

ఈ చిత్రంలోని చిన్నారి పేరు చరణ్‌(4). అమ్మమ్మ లక్ష్మిదేవి వద్ద పెరుగుతున్నాడు. కళ్యాణదుర్గం పట్టణంలోని మారంపల్లి కాలనీలో నివాసముంటున్న లక్ష్మిదేవి కూతురు చిట్టెమ్మకు మహేష్‌తో వివాహమైంది. వీరి కుమారుడే చరణ్‌. దంపతుల మధ్య చిన్నపాటి గొడవలు తలెత్తాయి. దీంతో మనస్తాపానికి గురైన చిట్టెమ్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి మరణంతో తండ్రి బాధ్యతలు తీసుకోకపోవడంతో ఒంటరైన చిన్నారి అమ్మమ్మ  కూలి పనులకెళ్లి మనువడికి అన్నీ తానై చూసుకుంటోంది.

ఐదు నెలల్లో 25 మంది..  

అనంత జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 25 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో పురుషులు 11 మంది కాగా, మహిళలు 14 మంది. వారిలో భార్యాభర్తలు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.

మార్గదర్శనం అవసరం..

ఇటీవల నమోదవుతున్న కేసుల్లో కుటుంబ కలహాలు అధికంగా ఉంటున్నాయి. కూర్చుని సామరస్యపూర్వకంగా మాట్లాడుకుంటే చాలా వరకు పరిష్కారం అవుతాయి. గొడవ పడినపుడు వారికి సాంత్వన, మార్గదర్శనం అవసరం. మా దగ్గరికి వచ్చే వారికి మూడు దఫాలుగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. చాలా మంది మనస్పర్ధలు వీడి కలిసిపోతున్నారు.

చిన్నగోవిందు, సీఐ, దిశ పోలీస్‌స్టేషన్‌, అనంతపురం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని