logo

కాలుతున్న కడుపులు.. ఏవీ ఉపాధి బిల్లులు?

వారంతా దినసరి కూలీలు. రోజు పని చేస్తే తప్ప కుటుంబాలను పోషించుకోలేని స్థితి. పొట్టకూటి కోసం ఎండలో ఎండుతూ పనులు చేస్తున్నారు.

Published : 29 Mar 2024 04:32 IST

దుర్భరంగా నెట్టుకొస్తున్న కూలీలు

ఎండలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

లక్ష్మీనగర్‌ (అనంతపురం), పుట్టపర్తి, న్యూస్‌టుడే: వారంతా దినసరి కూలీలు. రోజు పని చేస్తే తప్ప కుటుంబాలను పోషించుకోలేని స్థితి. పొట్టకూటి కోసం ఎండలో ఎండుతూ పనులు చేస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు మొత్తం నిధులను కేంద్రం విడుదల చేస్తోంది. రోజు వారి ఉష్ణోగ్రతలు సగటున 39 నుంచి 42 డిగ్రీలుగా నమోదవుతున్నప్పటికీ ఉమ్మడి అనంత జిల్లా పరిధిలో ఉపాధి కూలీలు సౌకర్యాలు లేకపోయినా పనికి వెళ్తున్నారు. వీరికి రోజువారీ ఇవ్వాల్సిన కూలీ మొత్తం కూడా జనవరి 28 నుంచి కూలీల ఖాతాల్లో జమ కాలేదు. వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ వడ దెబ్బకు గురై అనారోగ్యం పాలవుతామేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • నిధులు విడుదల చేయకపోవటంతో ఉమ్మడి జిల్లాల్లో వివిధ భవన నిర్మాణాల పనులను గుత్తేదారులు నిలిపివేశారు. పెద్ద మొత్తంలో బకాయి ఉండటంతో నిధులు విడుదలైతే తప్ప పనులు చేయలేమని గుత్తేదారులు చెబుతున్నారు. కేంద్రం ప్రభుత్వ పథకం కావటంతో గుత్తేదారులు గతంలో నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం మార్చి నెల కావటంతో చేసిన బిల్లులకు సంబంధించి బిల్లులను ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌ చేశామని నిధులు విడుదల జరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు.
  • ఉపాధి కూలీలు పనిచేసే ప్రాంతంలో రెండేళ్లకు ఒకసారి కొత్త గడ్డపారలు ఇచ్చేవారు. గడ్డపార పదునుకు నెలకు రూ.40 చొప్పున నిధులు విడుదల చేసేవారు. ఉపాధి పథకంలో అక్రమాలు జరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తించిన కేంద్రం గతంలో టీసీఎస్‌ సాప్ట్‌వేర్‌ను రద్దు చేసి ఎన్‌ఐసీ సాప్ట్‌వేర్‌ను తీసుకురావటంతో సౌకర్యాలు అమలు చేయటం లేదు.

బకాయిలు ఇలా..

అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలో 59 వేల మంది కూలీలకు చెల్లించాల్సిన మొత్తం రూ.38.19 కోట్లు బకాయి ఉంది. కార్యాలయాలకు సంబంధించిన భవన నిర్మాణాలు, రహదారుల పనులకు సంబంధించి మెటీరియల్‌ కింద మొత్తం రూ.80.50 కోట్లు బకాయిలున్నాయి. రోజువారీ కూలి పని చేసిన తరువాత వారు ఎంత పనిచేశారన్న వివరాలను ఆన్‌లైన్‌లో ఏ రోజుకు ఆ రోజు నమోదు చేస్తారు. ఈ వివరాల ప్రకారం కూలీ ఖాతాలోకి మొత్తం విడుదల చేయాల్సి ఉంది. జనవరి 28 నుంచి కూలీలకు రావాల్సిన నిధుల విడుదల నిలిచిపోవటంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నిర్ణయించిన కూలి కంటే తక్కువ

ఉపాధి పనులు చేపట్టే కూలీలకు వారు పనిచేసిన వివరాలను బట్టి రోజువారీ రూ.272 మొత్తం చెల్లించాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో కూలీలకు నిర్ణయించిన ధర కంటే తక్కువగా రూ.240 మాత్రమే కూలికి జమ చేస్తున్నారు. కూలీలు నిర్ధేశించిన పని చేయకపోవటంతోనే కూలి మొత్తం తక్కువగా వస్తోందని అధికారులు చెబుతున్నారు.


త్వరలో జమ..  

కూలీలకు విడుదల చేయాల్సిన మొత్తంతోపాటు మెటీరియల్‌ నిధులు కొన్ని రోజులుగా విడుదల కాని మాట వాస్తవమే. కూలీలు చేసిన పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. మెటీరియల్‌ పనులకు సంబంధించిన బిల్లులను అప్‌లోడ్‌ చేశాం. త్వరలోనే బకాయిలున్న నిధులు కూలీల ఖాతాల్లో జమ అవుతాయి. గుత్తేదారులు కొన్ని చోట్ల పనిచేస్తున్నారు. మరికొన్ని చోట్ల నిలిపివేశారు. వీరికి చెల్లించాల్సిన నిధులు త్వరలో విడుదలవుతాయి.

వేణుగోపాల్‌రెడ్డి, విజయేంద్రప్రసాద్‌, పీడీలు, డ్వామా, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని