logo

ధర్మవరంలో కూటమి జోరు

ధర్మవరంలో రాజకీయ గాలి వేగంగా మారుతోంది. మొన్నటివరకు కూటమి, వైకాపా మధ్య పోటాపోటీగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Published : 18 Apr 2024 04:05 IST

వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు

ఈనాడు డిజిటల్‌, పుట్టపర్తి: ధర్మవరంలో రాజకీయ గాలి వేగంగా మారుతోంది. మొన్నటివరకు కూటమి, వైకాపా మధ్య పోటాపోటీగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థిగా సత్యకుమార్‌ బరిలో నిలిచారు. తెదేపా ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ పూర్తి మద్దతు ప్రకటించడంతోపాటు ప్రచారంలో పాల్గొంటున్నారు. దశాబ్దాల తర్వాత బీసీకి టికెట్‌ కేటాయించడం పట్ల ఆ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. వైకాపాలో కీలకంగా ఉన్న బీసీ నాయకులు సైతం రాజీనామా చేసి సత్యకుమార్‌కు మద్దతు తెలుపుతున్నారు. వైకాపాకు పట్టున్న గ్రామాల్లోనూ పరిస్థితి మారుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది.

వ్యాపారుల్లో సానుకూలత

నియోజకవర్గంలో మొత్తం 2.44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ధర్మవరం పట్టణంలోనే 1.10 లక్షల ఓట్లు ఉన్నాయి. చేనేత కార్మికులు, వ్యాపారుల ఓట్లే అత్యధికం. ఐదేళ్ల వైకాపా పాలనలో ధర్మవరంలోని వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆదాయం పడిపోయి ఆర్థికంగా నష్టపోయారు. దీనికితోడు స్థానిక ప్రజాప్రతినిధి, ఆయన అనుచరుల దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండా సాగింది. వ్యాపారులపై దాడులకు తెగపడ్డ సందర్భాలు ఉన్నాయి. దీంతో ఆయా వర్గాల్లో అభద్రతాభావం నెలకొంది. సత్యకుమార్‌ అభ్యర్థిగా రావడంతో వ్యాపారుల్లో ఆశలు చిగురించాయి. కూటమి అభ్యర్థి గెలిస్తే దాడులు, దౌర్జన్యాలకు తెరపడుతుందనే భావనలో వ్యాపారులు ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో వైకాపా గాలిలోనూ తెదేపాకు పట్టణంలో 6 వేల వరకు మెజారిటీ లభించింది. ఈ ఎన్నికల్లో మెజారిటీ మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అవినీతి, అరాచకాలను ఎండగడుతూ...

సభలు, సమావేశాల్లో వైకాపా అరాచకాలు, అవినీతిని సత్యకుమార్‌ ఎండగడుతున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను జగన్‌ ఎలా పక్కదారి పట్టించారో వివరిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేయాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెబుతున్నారు. స్థానికేతరుడిని అయినప్పటికీ ప్రతి గ్రామంపై అధ్యయనం చేస్తున్నామని... సమస్యలను ఆరా తీసి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన అవినీతి, అక్రమాలను ఓటర్లకు వివరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని