logo

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల పర్వానికి గురువారం నుంచి తెరలేవనుంది. జిల్లాలో అనంత పార్లమెంటు (లోక్‌సభ), 8 శాసనసభా స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Published : 18 Apr 2024 04:27 IST

కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్ల ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల పర్వానికి గురువారం నుంచి తెరలేవనుంది. జిల్లాలో అనంత పార్లమెంటు (లోక్‌సభ), 8 శాసనసభా స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గురువారం నుంచి మొదలయ్యే నామపత్రాల స్వీకరణ ఇదే నెల 25 దాకా కొనసాగుతుంది. కలెక్టర్‌/జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) డాక్టర్‌ వినోద్‌కుమార్‌ సారథ్యంలో ఎక్కడికక్కడ సర్వం సిద్ధం చేశారు. అనంత లోక్‌సభతోపాటు.. శింగనమల ఎస్సీ రిజర్వుడ్‌ స్థానంతోపాటు అనంత అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, రాప్తాడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 13న జరిగే పోలింగ్‌ కోసం నామినేషన్ల పర్వం గురువారం శ్రీకారం చుడుతున్నారు. అనంత పార్లమెంటు స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు కలెక్టర్‌ కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేయాలి. అనంత అర్బన్‌, కళ్యాణదుర్గం, గుంతకల్లు స్థానాలకు సంబంధించి ఆర్డీఓ కార్యాలయాల్లో, తక్కిన రాప్తాడు, తాడిపత్రి, రాయదుర్గం, ఉరవకొండ శింగనమల తహసీల్దారు కార్యాలయాల్లోనే ఆర్వోలు ఉంటారు. అక్కడే నామినేషన్లు దాఖలు పరచాలి. ప్రతి రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటలు దాకా నామపత్రాలు స్వీకరిస్తారు.

ఒక్కొక్కరు నాలుగు సెట్లు

నామినేషన్‌ వేసే అభ్యర్థులు ఒక్కొక్కరు నాలుగు సెట్లు దాఖలు చేయవచ్చు. ప్రతి నామపత్రానికి నిర్దేశిత 13 రకాల పత్రాలను జత చేయాలి. లోక్‌సభకైతే రూ.25వేలు, అసెంబ్లీ స్థానానికి రూ.10 వేలు ప్రకారం డిపాజిట్‌ చెల్లించాలి. ట్రెజరీ లేదా నగదు మాత్రమే స్వీకరిస్తారు. ఎస్సీ, ఎస్టీలకైతే నిర్దేశిత మొత్తంలో 50 శాతం చెల్లిస్తే చాలు. ఇందుకు కుల ధ్రువీకరణ తప్పనిసరి. ఆర్వో వద్ద నామపత్రాలు దాఖలు చేసేందుకు అభ్యర్థితోపాటు ఐదు మందికే అనుమతి ఇస్తారు. ఒక్కో అభ్యర్థి రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేయొచ్చు. ఈనెల 25 దాకా నామినేషన్ల స్వీకరణ ముగుస్తుంది. 26న నామపత్రాల పరిశీలన, 27 నుంచి 29 దాకా ఉపసంహరణ ఉంటుంది. 29నే పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా వెల్లడిస్తారు. మే 13న పోలింగ్‌ జరుగుతుంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.

ఏర్పాట్లపై కలెక్టర్‌ సమీక్ష

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సర్వం సిద్ధం చేశారు.  బుధవారం రెవెన్యూ భవన్‌లో ఎన్నికల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. పోలీసు బందోబస్తును పటిష్ఠంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి వివాదాలు చోటు చేసుకోడానికి వీలులేకుండా చూడాలన్నారు. అనంత లోక్‌సభ స్థానానికి కలెక్టర్‌ రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌ఓ)గా ఉంటారు. డీఆర్‌ఓ రామకృష్ణారెడ్డి, జిల్లా పౌర సరఫరాల సంస్థ డీఎం రమేశ్‌రెడ్డి సహాయ ఆర్వోలుగా వ్యవహరిస్తారు. అసెంబ్లీ స్థానాలకు.. ఉరవకొండ అసెంబ్లీ స్థానం ఆర్వోగా జేసీ కేతన్‌గార్గ్‌, గుంతకల్లు, అనంత, కళ్యాణదుర్గం స్థానాలకు అక్కడి ఆర్డీఓలు శ్రీనివాసులరెడ్డి, వెంకటేశు, రాణి సుస్మిత ఆర్వోలుగా ఉంటారు. రాయదుర్గానికి ఆన్‌సెట్టు సీఈఓ కరుణకుమారి, తాడిపత్రికి పీఏబీఆర్‌ భూ సేకరణ ఉప కలెక్టర్‌ రాంభూపాల్‌రెడ్డి, రాప్తాడుకు హెచ్చెల్సీ భూసేకరణ ఉప కలెక్టర్‌ వసంతబాబు, శింగనమలకు హంద్రీనీవా భూ సేకరణ ఉప కలెక్టర్‌ వెన్నెల శీను ఆర్వోలుగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని