logo

వైకాపా పాలనలో గార్మెంట్స్‌ పరిశ్రమ కుదేలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణం గార్మెంట్స్‌ పరిశ్రమకు ప్రసిద్ధి.. ఏటా కోట్లలో వ్యాపారం జరిగేది.

Published : 20 Apr 2024 03:40 IST

వలస వెళుతున్న కార్మికులు
జాబ్‌వర్క్‌ దుకాణాల మూత

దుస్తులు కుడుతున్న కార్మికులు

రాయదుర్గం, న్యూస్‌టుడే: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణం గార్మెంట్స్‌ పరిశ్రమకు ప్రసిద్ధి.. ఏటా కోట్లలో వ్యాపారం జరిగేది. ఇక్కడి నుంచి జీన్స్‌ దుస్తులను దేశ విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఒకప్పుడు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లిన పరిశ్రమ వైకాపా పాలనలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. 20 వేల మందికి ఉపాధి నిచ్చి.. రూ.వెయ్యి కోట్ల టర్నోవర్‌ కలిగిన పరిశ్రమ కుదేలయ్యింది. జగన్‌ సర్కారు నూలు పోగంత సాయం కూడా చేయకపోవడంతో గార్మెంట్‌ యూనిట్లు మూత పడుతున్నాయి. ఒకవైపు షోరూమ్‌ల నుంచి ఆర్డర్లు రాక ఉత్పత్తులు గుట్టలుగా పేరుకుపోయాయి. విద్యుత్తు బిల్లులు షాక్‌ కొడుతుండటంతో నిర్వహణ భారమై చిన్నా చితకా యూనిట్లు మూతపడ్డాయి. స్థానికంగా పనులు లేక ఇప్పటికే వేలాది మంది కార్మికులు బెంగళూరు, చెన్నై, బళ్లారి, ముంబయి వంటి నగరాలకు వలస వెళ్లారు. సొంతూళ్లను వదులుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లలేని వారు కూలీలుగా, హోటళ్లు, కూరగాయల దుకాణాలు నడుపుతూ కాలం వెళ్లదీస్తున్నారు.

మినిస్ట్రీ ఆఫ్‌ మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ పథకంలో భాగంగా బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను 45 రోజుల్లోగా పేమెంట్లు చేయాలనే నిబంధనలతో వ్యాపారులు సతమతమవుతున్నారు. షోరూమ్‌లు, బహుళ జాతి కంపెనీలకు అరువుగా సరఫరా చేసిన దుస్తుల పేమెంట్లు రాకపోవటంతో రుణాల చెల్లింపుల కోసం వ్యాపారులకు ఇబ్బందులు తప్పటం లేదు. గతంలో ఏడాదికోమారు జీఎస్టీ నిబంధనల్లో మార్పులు జరిగేవి. ప్రస్తుతం ప్రతి నెలా మార్పులు చేస్తుండటంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. అమెజాన్‌, ప్లిప్‌కార్ట్‌ లాంటి సంస్థల ఆన్‌లైన్‌ వ్యాపారాలతో కూడా గార్మెంట్స్‌ వ్యాపారం కుదేలైంది.

30 శాతం మాత్రమే దుస్తుల ఉత్పత్తి

రిటైల్‌ వ్యాపారాలు, ఆర్డర్లు లేక ప్రస్తుతం 30 శాతం మాత్రమే జీన్స్‌, కాటన్‌ దుస్తులను తయారు చేస్తున్నారు. పేమెంట్లు కూడా సకాలంలో రావటం లేదు. చిన్నా చితకా వ్యాపారులు కూడా బెంగళూరులో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. మరి కొందరు నైపుణ్యం గల కార్మికులను వదులుకోలేక, పండగల సీజన్‌లపై ఆశతో కొంత మేర మాత్రమే దుస్తులు తయారు చేస్తున్నారు.

విద్యుత్తు రాయితీలేవీ?

తెదేపా ప్రభుత్వ హయాంలో గార్మెంట్స్‌ పరిశ్రమకు నిరంతర విద్యుత్తును సరఫరా చేసేవారు. మరో 20ఏళ్లపాటు పట్టణËంలో లోఓల్టేజీ నివారణకు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. పట్టణానికి ఉప విద్యుత్తు కేంద్రం మంజూరైనా వైకాపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు కాకపోవటం, విద్యుత్తు అవాంతరాలను సరిచేసేందుకు పట్టణమంతా సరఫరాను తొలగించటం, ప్రస్తుతం కోతలు అధికం కావటం, రాయితీలు లేకపోవటంతో దుస్తుల ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది.

ప్రభుత్వ ప్రోత్సాహం కరవు

గార్మెంట్స్‌ పరిశ్రమకు వైకాపా ప్రభుత్వం ఎలాంటి రాయితీలు ఇవ్వటం లేదు. రాయదుర్గంలో గార్మెంట్స్‌ పరిశ్రమల మనుగడకు విద్యుత్తు రాయితీలు, తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు, వస్త్రం, ముడి వస్తువులు, రంగుల ధరల తగ్గింపు లాంటి చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వం వస్త్ర సన్యాసం చేయటంతో కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారు.

టంకశాల హనుమంతు, గార్మెంట్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, రాయదుర్గం

నెల రోజులుగా పనుల్లేవు

కుటుంబాన్ని రాయదుర్గంలో వదిలి బెంగళూరుకు వలస వెళ్లాను. అక్కడ హోటళ్లలో భోజనాలు చేస్తూ, గార్మెంట్స్‌ యూనిట్‌లో నిద్రిస్తూ దుస్తులు కుడుతున్నా. రోజుకు రూ.500 సంపాదిస్తున్నా.

మల్లికార్జున, గార్మెంట్స్‌ కార్మికుడు, రాయదుర్గం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని