logo

చేపా..చేపా.. నువ్వెందుకు ఈదలేదు!

వైకాపా ప్రభుత్వంలో అన్నదాతలకే కాదు.. చేపల పెంపకానికీ నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాదే మత్స్య క్షేత్రాల్లో చేపల పిల్లల ఉత్పత్తి చేపట్టారు. ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాల్సి ఉంది.

Published : 24 Apr 2024 05:09 IST

వైకాపా పాలనలో సంరక్షణకు నానాతంటాలు

అనంతపురం మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలోని క్షేత్రంలో తొట్టెల్లో పెంచుతున్న చేపపిల్లలు

అనంతపురం(వ్యవసాయం), న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వంలో అన్నదాతలకే కాదు.. చేపల పెంపకానికీ నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాదే మత్స్య క్షేత్రాల్లో చేపల పిల్లల ఉత్పత్తి చేపట్టారు. ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాల్సి ఉంది. నిరుడు వర్షాభావ పరిస్థితులు, కాలువలకు నీరు వదలకపోవడం, చెరువుల్లో నీరు లేకపోవడంతో చేపల పెంపకానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. కాలువల్లో నీరు ఆపడం, మత్స్యక్షేత్రాల్లో బోర్లు ఎండిపోవడంతో చేపపిల్లల్ని సంరక్షించేందుకు నానాతంటాలు పడుతున్నారు. క్షేత్రాల్లో గుడ్డు వదిలిన తర్వాత 90 రోజులు తర్వాత చేప పిల్లల్ని ప్రాజెక్టుల్లోను, చెరువుల్లోను వదలాలి. సుమారు 8 నెలలు కావస్తోంది. చేప పిల్లలు ఎదిగాయి. దాణా ఖర్చు విపరీతంగా పెరిగిపోతోంది. మత్స్య క్షేత్రాల్లోనే చేప పిల్లలు నిల్వ ఉంచాల్సిన పరిస్థితి. వాటిని ఎలా అమ్ముకోవాలో తెలియక మత్స్యశాఖ అధికారులు ఆవేదన చెందుతున్నారు.

  • అనంతపురం జిల్లా మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో క్షేత్రం ఉంది. ఇది పూర్తిగా హెచ్చెల్సీ కాలువ నీటిపైనే ఆధారపడి ఉంది. కాలువ నీటికే చేప పిల్లలు త్వరగా ఎదుగుతాయి. ఈ ఏడాది ఒక్క నెల కూడా కాలువలో నీరు పారలేదు. బోరు నీటికి ఎదుగుదల ఉండదు. ఒక బోరు ఎండిపోయింది. రెండో బోరులో కొద్దిగా నీరు వస్తోంది. ఆ నీటితోనే తక్కువ చేప పిల్లలు ఉత్పత్తి చేపట్టామని అధికారులు తెలిపారు. 9.10 లక్షలు చేప పిల్లలు పెంచారు. అందులో 82-100 ఎంఎం పొడవున్న మృగాల రకం పిల్లలు 4 లక్షలు మాత్రమే శ్రీశైలం, వెలుగోడు ప్రాజెక్టులకు సరఫరా చేశారు. ఇంకా 700 ఎంఎం పొడవున్న చేపపిల్లలు 5.10 లక్షలు మిగిలి ఉన్నాయి.
  • ఎంపీఆర్‌ ప్రాజెక్టు క్షేత్రంలో 13.50 లక్షల చేప పిల్లలు ఉత్పత్తి చేయగా, ఎంపీఆర్‌ డ్యాంలో 5 లక్షలు వదిలారు. 2 లక్షల చేప పిల్లలను కడప జిల్లాకు సరఫరా చేశారు. ఇంకా 6 లక్షల పిల్లలు మిగిలి ఉన్నాయి.
  • పీఏబీఆర్‌లో 12 లక్షల చేప పిల్లలు ఉత్పత్తి చేశారు. 4 లక్షలు కడప జిల్లా తెలుగుగంగ ప్రాజెక్టుకు సరఫరా చేశారు. 8 లక్షల పిల్లల నిల్వ మిగిలిపోయాయి.
  • బైరవానితిప్ప ప్రాజెక్టులో 3.85 లక్షల చేప పిల్లలు ప్రాజెక్టులో వదిలారు. 6.40 లక్షల పిల్లలను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని