icon icon icon
icon icon icon

సంక్షేమం జగన్‌ సొత్తు కాదు.. అన్ని పథకాలూ అమలు చేస్తాం

‘కూటమి ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు రద్దవుతాయని జగన్‌ విషప్రచారం మొదలెట్టారు. సంక్షేమ పథకాలు ఏవీ జగన్‌ తాత సొత్తుకాదు. వాటిని తానే అమలు చేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్‌ చాలా గొప్పగా చెప్పుకొంటున్నారు.

Published : 06 May 2024 05:55 IST

భూహక్కు చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే సజ్జల నోట రద్దు మాట
చెల్లెలికి ఆస్తులు పంచని దుర్మార్గుడు సీఎం జగన్‌
మూడు కబ్జాలు.. ఆరు సెటిల్మెంట్ల ప్రభుత్వమిది
భూహక్కు చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే సజ్జల నోట రద్దు మాట
కుల, మతాలకు అతీతంగా పాలన సాగిస్తాం  
కల్తీ మద్యం విక్రయించే వారిపై రౌడీషీట్లు
పొన్నూరు, తుని వారాహి విజయభేరి సభల్లో పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, అమరావతి, కాకినాడ- న్యూస్‌టుడే, తుని, తుని పట్టణం: ‘కూటమి ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు రద్దవుతాయని జగన్‌ విషప్రచారం మొదలెట్టారు. సంక్షేమ పథకాలు ఏవీ జగన్‌ తాత సొత్తుకాదు. వాటిని తానే అమలు చేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్‌ చాలా గొప్పగా చెప్పుకొంటున్నారు. గతంలోనే దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వృద్ధులకు పింఛను పథకాన్ని తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’ అని జనసేనాని పవన్‌కల్యాణ్‌ హితవు పలికారు. ‘పోలవరం నిర్మాణం గురించి తెలియని వ్యక్తి జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు. ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారని అడిగితే ఆ డ్యాన్సుల మంత్రి నాపై రంకెలేస్తారు. పోలవరం ధ్వంసంపై ప్రశ్నిస్తే నా పరిధిలోది కాదంటారు. మంత్రి పదవి అనేది ఒక బాధ్యత అని గుర్తెరగాలి. మంత్రి తమ్ముడు అంబటి మురళి అరాచకవాదిగా తయారయ్యారు. కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఈ వైకాపా నాయకులకు ఒక్కటే చెబుతున్నాను. కులమతాలకతీతంగా వ్యవహరించండి’ అని అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు, తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ చెల్లెల్ని గౌరవించలేని, ఆమెకు ఆస్తులు పంచని వ్యక్తి సీఎం జగన్‌ అని విమర్శించారు. ‘జగన్‌ నన్ను నాన్‌లోకల్‌ అంటున్నారు. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్లే మా కుటుంబం పలు ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చింది. నేను పుట్టింది బాపట్లలో. పెరిగింది పల్నాడు, నెల్లూరులో. నేను గుంటూరు కారం లాంటివాడిని. అది జగన్‌ గుర్తుంచుకోవాలి. నేనొస్తున్నానని వైకాపా నాయకులు రాత్రికిరాత్రే హెలిప్యాడ్‌ ధ్వంసం చేశారు. అది ఎవరూ చూసుకోకుండా ఉంటే జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? హెలిప్యాడ్‌ తవ్వడం అనేది ఉగ్రవాద చర్యకిందకు వస్తుంది. దీనిపై కూటమి ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటాం. రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు, హత్యలు తీసుకొచ్చిన ఘనత వైకాపాదే. ఆఖరికి అంబటి రాంబాబు అల్లుడే ఆయనకు ఓటువెయ్యవద్దని అంటున్నారంటే ఇంట్లోని వారు వీరి ప్రవర్తనతో ఎంతగా విసిగిపోయారో అర్థం చేసుకోవాలి’ అని పవన్‌ అన్నారు.

 ప్రజల్లో వ్యతిరేకత వల్లే

‘జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టంపై జనంలో అవగాహన వస్తుండడంతో ఈ చట్టాన్ని రద్దు చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. రద్దు చేసే చట్టానికి జీవో తీసుకొచ్చి ఎందుకు అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారు’ అని నిలదీశారు.

మద్యంపై జీఎస్‌టీ ఉండదు కానీ..

‘మద్యం విక్రయాల్లో రూ.41 వేల కోట్లు దోచుకున్న వైకాపా నేతలు దానిపై జీఎస్‌టీ కట్టరు. బతుకుతెరువు కోసం మగ్గం నేసేవాళ్లు మాత్రం జీఎస్‌టీ కట్టాలట! ఈ దుర్మార్గ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక 70 శాతంమంది మహిళలు తమ ప్రాంతాల్లో వద్దు అంటే మద్యం దుకాణాలు ఎత్తేస్తాం. కల్తీ మద్యం వ్యాపారులపై రౌడీషీట్లు తెరుస్తాం. ఎంపీగా పోటీ చేస్తున్న రోశయ్య ఒక్క మట్టిలోనే రూ.2 వేల కోట్లు దోచేశారు’ అని విమర్శించారు.

‘రేషన్‌ మాఫియాను పెంచి పోషించిన ప్రభుత్వమిది. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రేషన్‌ బియ్యాన్ని విదేశాలకు సరఫరా చేస్తున్నారు. ధాన్యం రైతుల వద్దనే కోట్ల రూపాయల  కమీషన్‌ తీసుకున్న వైకాపా నాయకుల్ని వదిలిపెట్టం. దళితులు, ముస్లింలు మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కూటమిని బలపరచండి’ అని కోరారు. ‘బ్రాహ్మణ సమాజానికి మంచి గుర్తింపునిస్తాం. పురోహితులకు జీవన భృతి ఇస్తాం. మైనారిటీలకు అండగా ఉంటాం’ అని ఆయన భరోసా ఇచ్చారు.

చెరువులను లోయలు చేసిన మంత్రి దాడిశెట్టి

‘తునిలో 100 చెరువులుంటే ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా వాటిని లోయలు చేశారు. ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా ఉన్నా రోడ్లన్నీ గోతులే.. అడిగితే బూతులు. మాట్లాడితే దాడులు. తునిలో ఓ విలేకరిని దారుణంగా చంపేశారు. దాడిశెట్టి రాజా కావాలా.. వైకాపా గెలవాలని కోరుకుంటున్నారా..?’ అని పవన్‌ ప్రశ్నించగా వద్దు.. అంటూ జనం నినదించారు. తాండవనది ఇసుక అమ్ముకుని రూ.కోట్లు సంపాదించుకున్నారు గానీ పరీవాహక ప్రాంతానికి రిటైనింగ్‌ వాల్‌ కట్టలేదు’ అని ఆరోపించారు. దాడిశెట్టి రాజా మావాడని ఓటేస్తే.. మీ ఆస్తులు గాల్లో దీపంలో పెట్టినట్టే అని హెచ్చరించారు.

సాధ్యమైన ఉద్యమాలే చేయాలి..

‘సాధ్యమయ్యే ఉద్యమాలే చేయాలి. నా భవిష్యత్తు కోసం యువతను ఏ రోజూ రెచ్చగొట్టలేదు. ఎమ్మార్పీఎస్‌ ఉద్యమం రెండున్నర దశాబ్దాలుగా ఉంది. ప్రధాని పక్కన కూర్చొని ఏబీసీడీ వర్గీకరణ ముందుకు తీసుకెళ్లేంత బలంగా వారు నిలబడ్డారు. కాపు రిజర్వేషన్‌కు సంబంధించి చేయగలమా లేదా.. అని ఆలోచించాలి. ఎవరైతే ప్రారంభించారో వారు నిర్ణయించుకోవాలి. ప్రజల్ని తప్పుదోవ పట్టించకూడదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.


ముద్రగడను ఒప్పించాకే.. ఆయన కుమార్తెను జనసేనలో చేర్చుకుంటా

‘ఈ తుని సభలో అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెబుతున్నా.. ముద్రగడకు కుమార్తె ఉందనే విషయం నాకు తెలియదు. ఆయన వైకాపాకు వెళ్లినా నాకేం ఇబ్బందిలేదు. ముద్రగడ కుమార్తె క్రాంతి, అల్లుడు చందు జనసేనలో చేరడానికి వచ్చారు. తండ్రీ, కుమార్తెను వేరుచేసే వ్యక్తిని కాదు. మీకు కండువా వేస్తే.. నాన్నకు ఇబ్బందిగా ఉంటుంది. పెద్దవారు పది మాటలు అంటారు. భరించాలి. నేను మాట ఇస్తున్నా క్రాంతి నా సోదరి. నన్ను మీ నాన్న దగ్గరకు తీసుకెళ్లండి. ఆయనకు చెప్పి మిమ్మల్ని తీసుకొస్తాను. కులాలను, పార్టీలను కలిపేవాడిని. కుటుంబాలను వేరుచేస్తానా? ఆయనతో మాకు విధానపరమైన విభేదాలు ఉండొచ్చు. నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు. మీ ఇంటివాడిని.. భవిష్యత్తు ఎన్నికల్లో క్రాంతిని జనసేన అభ్యర్థిగా నిలబెడతాం. ఆమెకు సత్తా ఉంది. పెద్దలు ముద్రగడకు హృదయపూర్వక నమస్కారాలు. కులం, సమాజ ఐక్యత కోరుకునేవాడిని. నాకు ఎవరి మీదా ద్వేషం లేదు. నన్ను తిట్టినా భరిస్తాను.’’

తుని వారాహి విజయభేరి సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img