logo

పెల్లుబుకిన ఆక్రోశం, అసంతృప్తి

ఐదేళ్ల వైకాపా పాలనపై ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఆక్రోశం పెల్లుబుకింది. జగన్‌ పాలనపై వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నీ పాలన ఇక చాలంటూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో వారిలో కసి.. కోపం ప్రస్ఫుటమయ్యాయి.

Published : 10 May 2024 03:41 IST

రికార్డు స్థాయిలో పోస్టల్‌ బ్యాలెట్‌
ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో కనిపించిన కసి
84.87 శాతం నమోదు

జిల్లా సచివాలయం: ఐదేళ్ల వైకాపా పాలనపై ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఆక్రోశం పెల్లుబుకింది. జగన్‌ పాలనపై వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నీ పాలన ఇక చాలంటూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో వారిలో కసి.. కోపం ప్రస్ఫుటమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ జరగడమే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. గడిచిన ఏ ఎన్నికలోనూ నమోదు కాని రీతిలో.. తాజా పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ శాతం ఆమాంతం పెరగడం విశేషం. బుధవారంతోనే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ముగిసినా.. ఇంకా కొందరు మిగిలిపోవడంతో గురువారం కూడా ఓటు హక్కు వినియోగానికి కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అవకాశం కల్పించారు. గురువారం నాటి ఆఖరు నివేదిక ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధులకు నియమితులైన 24,454 మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో 20,755 మంది ఓటు వేశారు. అంటే.. 84.87 శాతం మంది రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఎన్నికలకు విధులకు నియమితులైన వారిలో సగానికిపైగా ఉపాధ్యాయులే ఉన్నారు.

తాడిపత్రిలో భేష్‌!

ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల సిబ్బందిగా నియమితులైన ఉద్యోగ, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ, బీఎల్‌ఓ, సచివాలయ, ఒప్పంద సిబ్బందిలో 3,699 మంది ఓటు వేయలేదు. ఇందులో ఎక్కువగా అనంత అర్బన్‌లో 787 మంది, రాయదుర్గంలో 649, రాప్తాడులో 599, గుంతకల్లులో 549, కళ్యాణదుర్గంలో 545, శింగనమలలో 420, ఉరవకొండలో 103, తాడిపత్రిలో 47 మంది ప్రకారం ఓటు హక్కు వినియోగానికి దూరంగా ఉన్నారు. డ్వామాలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఇతర జిల్లాల అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మొత్తం 2,231 మంది ఓటర్లుగా నమోదు కాగా వీరిలో కేవలం 1,514 మందే ఓటు వేశారు. అంటే.. 67.86 శాతమే నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు