logo

చెరువు మట్టినే కాదు.. చేపలనూ వదలని నాయకులు

దోచుకోవడానికి ఏదీ అనర్హం కాదన్నట్లుగా హిందూపురంలో అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. చెరువు మట్టిని లేఅవుట్లకు తోలుకొని సొమ్ము చేసుకున్న నాయకులు కొందరైతే, చెరువుల్లోని చేపలను అమ్ముకున్నది మరికొందరు.

Published : 10 May 2024 03:53 IST

హిందూపురం పట్టణం: దోచుకోవడానికి ఏదీ అనర్హం కాదన్నట్లుగా హిందూపురంలో అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. చెరువు మట్టిని లేఅవుట్లకు తోలుకొని సొమ్ము చేసుకున్న నాయకులు కొందరైతే, చెరువుల్లోని చేపలను అమ్ముకున్నది మరికొందరు. ఎవరికి అందినంత వారు దోచుకోవడం ఇక్కడ రివాజుగా మారింది. ఇందుకు ఉదాహరణ హిందూపురం పట్టణంలోని కొట్నూరు చెరువులోని చేపలను పట్టుకొని అమ్ముకోవడమే. గతేడాది కురిసిన భారీ వర్షాలకు పట్టణంలోని చెరువులు నిండిపోయాయి. జిల్లాలోని అతిపెద్ద చెరువుల్లో కొట్నూరు ఒకటి. ఇందులో మత్స్యశాఖ చేపలను వదిలింది. అవి పెరగడంతో వాటిపై అధికార పార్టీ నాయకుడి కన్ను పడింది.

వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడానికి ప్రణాళిక రచించాడు. మత్స్యశాఖ వాటిని వేలం వేయకుండా పురపాలక శాఖ పరిధిలోకి వస్తాయంటూ మెలిక పెట్టాడు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నాయకుడితో చెప్పించుకుని రూ.32 వేలకు చేపల చెరువును దక్కించుకున్నాడు. చెరువు నుంచి వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి ఖర్చు పెడతామంటూ చెప్పుకొచ్చాడు. వేలం కాల పరిమితి మూడు నెలలు ఉండగా, ఏడాదిన్నరగా చెరువులో చేపలను తమిళనాడుకు చెందిన వ్యక్తులకు సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చాడు. చేపల చెరువు నుంచి ఇప్పటికే లక్షల రూపాయలు దండుకున్నాడు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ సాగిస్తున్న వైనంపై ఫిర్యాదులు అందినా మత్స్య, పురపాలక శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కాలపరిమితి ముగిసిన తర్వాత వేలం పాటలు నిర్వహించాలన్న ఆలోచన కూడా చేయడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని