logo

విద్యుత్తు సిబ్బంది ఏరీ.. ఎక్కడా..!

చిత్తూరు నగరం ఎల్‌బీపురంలో ఈ నెల 23న పెనుగాలుల వర్షానికి రెండు విద్యుత్తు స్తంభాలు పడిపోగా.. లైన్లు తెగిపోయాయి. నాలుగు రోజులు గడిచినా ఎవరూ పట్టించుకోలేదు.

Published : 30 Mar 2023 02:23 IST

గ్రామాల్లో సేవలు కరవు
వినియోగదారులకు తప్పని తిప్పలు
న్యూస్‌టుడే, చిత్తూరు(మిట్టూరు)

చిత్తూరు నగరం ఎల్‌బీపురంలో ఈ నెల 23న పెనుగాలుల వర్షానికి రెండు విద్యుత్తు స్తంభాలు పడిపోగా.. లైన్లు తెగిపోయాయి. నాలుగు రోజులు గడిచినా ఎవరూ పట్టించుకోలేదు. స్తంభం కూలిన ప్రాంతంలోనే పాఠశాల, శ్రీరాములవారి గుడి ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని గ్రామస్థులు విద్యుత్తు శాఖ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. ‘సిబ్బంది లేరు.. ట్రాక్టర్‌, రిగ్‌ యంత్రం సమకూర్చుకోవాలని’ వారిచ్చిన సమాధానం. ఎట్టకేలకు సోమవారం(27న)  మరమ్మతులు చేపట్టి పూర్తిచేశారు. ఇలా విద్యుత్తు సేవలందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందనే ఆరోపణలు  వెల్లువెత్తుతున్నాయి.

క్షేత్రస్థాయిలో సత్వర సేవలు అందించాల్సిన విద్యుత్తు అధికారులు, సిబ్బంది పోస్టులు గత కొన్నేళ్లుగా భర్తీ కావడం లేదు.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో చిన్నపాటి అంతరాయం కలిగినా పరిష్కరించేవారు కరవయ్యారు.. లైన్‌మెన్‌ పోస్టులు ఖాళీగా ఉండటం.. మరోవైపు విధుల్లో ఉన్నవారు అప్పుడప్పుడైనా తనిఖీ చేయకపోవడం చిక్కులు తెచ్చిపెడుతోంది.. స్థానికులే కొద్దిపాటి అవగాహనతో ఎలక్ట్రీషియన్‌గా మారి విద్యుత్తు పరివర్తకా వద్ద ఫ్యూజు వేయడం తదితర పనులు చేస్తున్నారు.. ఇదీ విద్యుత్తు శాఖ చిత్తూరు అర్బన్‌ డివిజన్‌లో నెలకొన్న పరిస్థితి.

నిబంధనలు ఇలా..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైన్‌మెన్‌ మాత్రమే స్తంభం ఎక్కాలి. జూనియర్‌ లైన్‌మెన్‌, సహాయ లైన్‌మెన్‌ అనుసంధానంగా ఉంటారు. 2001లో డిస్కంల ఆవిర్భావం తర్వాత నిబంధనలు సడలించారు. తద్వారా సహాయ లైన్‌మెన్‌ కూడా స్తంభం ఎక్కేలా సవరించారు. సచివాలయాల ఎనర్జీ అసిస్టెంట్‌(జేఎల్‌ఎం-గ్రేడ్‌ 2) పోస్టులు మినహా 2014 నుంచి ఎలాంటి ఉద్యోగాల భర్తీ జరగలేదు. మార్గదర్శకాల ప్రకారం ఎనర్జీ అసిస్టెంట్‌ స్తంభం ఎక్కడానికి లేదు. అత్యవసర సమయంలో వారితో పనిచేయించినా, ఆ సమయంలో ఊహించని ప్రమాదాలు సంభవించినప్పుడు అందుకు బాధ్యులైన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఉద్యోగుల కొరతను దృష్టిలో ఉంచుకుని జూనియర్‌ లైన్‌మెన్‌, సహాయ లైన్‌మెన్‌కు రెండు లేదా మూడు గ్రామాల చొప్పున విద్యుత్తు సరఫరా నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.

జేఎల్‌ఎం పోస్టులన్నీ ఖాళీయే..

చిత్తూరు అర్బన్‌ డివిజన్‌లో 12 సెక్షన్లు ఉన్నాయి. డివిజన్‌ పరిధిలో అన్ని విభాగాల సర్వీసులు సుమారు 1.75లక్షలు ఉన్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది పోస్టులు భర్తీకి నోచుకోలేదు. డివిజన్‌లో 63 జెఎల్‌ఎం పోస్టులు ఉండగా అవన్నీ ఖాళీయే. ఇక 90 ఏఎల్‌ఎం పోస్టులకు 21 పోస్టులు భర్తీ కాలేదు. 12 ఏఈ పోస్టులు ఉండగా ఆరుగురే పనిచేస్తున్నారు. గిరింపేట, రెడ్డిగుంట, కొత్తపల్లె, పెనుమూరు, చిత్తూరు రూరల్‌-3, ఆవలకొండలలో ఇన్‌ఛార్జి ఏఈలు కొనసాగుతున్నారు.

ప్రైవేటు సిబ్బందితో సేవలు..

క్షేత్రస్థాయి సిబ్బంది కొరతతో అధికారులు ప్రైవేటు సిబ్బందితో విద్యుత్తు స్తంభాలు, లైన్ల మార్పులు తదితర పనులు చేయిస్తున్నారు. ప్రధానంగా రెడ్డిగుంట, అనుప్పల్లి సెక్షన్లలో ప్రైవేటు సిబ్బందే గతి. వారిద్వారానే అన్ని సేవలందిస్తూ వారికి వినియోగదారుల నుంచి నగదు వసూలు చేసి అందజేస్తు న్నారు. పైసలు ముట్టచెబితేనే సేవలందుతాయి. లేనిపక్షంలో ఎన్నిరోజులైనా పట్టించుకునే వారు ఉండరు.


అంతరాయం లేకుండా చర్యలు

పద్మనాభపిళ్లై, ఇన్‌ఛార్జి ఈఈ, అర్బన్‌ డివిజన్‌, చిత్తూరు

వినియోగదారులకు అంతరాయం లేకుండా సేవలందిస్తున్నాం. సరఫరాలో ఏదైనా సమస్య వస్తే తక్షణమే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం. జేఎల్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యుత్తు సేవలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని