logo

Chittoor: ‘సీకే బాబుకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత’

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో క్రియాశీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తొలగించడం శోచనీయమని, ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని సీకే బాబు సతీమణి సీకే లావణ్య అన్నారు.

Published : 16 Mar 2024 04:27 IST

మాట్లాడుతున్న సీకే బాబు సతీమణి లావణ్య

చిత్తూరు (క్రీడలు), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో క్రియాశీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తొలగించడం శోచనీయమని, ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని సీకే బాబు సతీమణి సీకే లావణ్య అన్నారు. చిత్తూరులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘సీకే బాబు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రజల మధ్యనే ఉన్నారు. గతంలో ఆయనపై తొమ్మిది సార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఆయనకు ఎనిమిది మంది గన్‌మెన్లను కేటాయించారు. తర్వాత నలుగురికి కుదించారు. తాజాగా తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్మోహన్‌కు మద్దతు తెలుపుతూ సీకేబాబు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజాభిమానాన్ని కూడగడుతున్న సీకేబాబును చూసి ఓర్వలేక.. రాజకీయ అక్కసుతో వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తొలగించారు. ప్రత్యర్థుల నుంచి ఆయనకు ప్రాణహాని ఉంది. వాస్తవాలు గుర్తించాలని ఆయన అభిమానుల తరఫున ఎస్పీకి విన్నవిస్తున్నాం. భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయకుంటే న్యాయపోరాటం చేస్తాం’ అని లావణ్య స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో మంచి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని