logo

పీ అండ్‌ పీవో వ్యవస్థ నిర్వీర్యం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎప్పటికప్పుడు కొత్త వాహకనౌకలను రూపొందించి, మానవాళి అవసరాలకు అనుగుణంగా ఉపగ్రహాలను తయారు చేసి, కక్ష్యలోకి పంపుతోంది.

Published : 29 Mar 2024 02:19 IST

సమాచారం ఇచ్చే ఉద్యోగులేరీ..?

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎప్పటికప్పుడు కొత్త వాహకనౌకలను రూపొందించి, మానవాళి అవసరాలకు అనుగుణంగా ఉపగ్రహాలను తయారు చేసి, కక్ష్యలోకి పంపుతోంది. చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 లాంటి ప్రయోగాలు చేపట్టి అందరి మన్ననలు పొంది, గగన్‌యాన్‌కు సన్నాహాలు చేస్తోంది. దేశంలో ఇస్రోకు సంబంధించి వివిధ చోట్ల 19 కేంద్రాలు ఉన్నా కీలకమైనది సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌. వివిధ కేంద్రాల్లో రూపకల్పన చేసిన వాటిని తీసుకొచ్చి రాకెట్‌గా అనుసంధానం చేసి, నింగిలోకి అవలీలగా పంపుతున్నారు. ఇంతటి ప్రాధాన్యత గల షార్‌లో పబ్లిసిటీ అండ్‌ పబ్లికేషన్‌ విభాగం నిర్వీర్యమైంది. రాకెట్‌ ప్రయోగాలకు మీడియా వారికి ఆహ్వానం తప్ప, మరే ఇతర సమాచారం ఇవ్వడం లేదు.

కేరళ రాజధాని తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో మొదటగా పబ్లిసిటీ అండ్‌ పబ్లికేషన్‌ విభాగం(పీఅండ్‌పీవో) ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఎల్‌పీఎస్‌సీలో ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. 1987లో అప్పటి షార్‌ సంచాలకులు ఎంఆర్‌ కురూప్‌ శ్రీహరికోటలో ఈ విభాగాన్ని ప్రారంభించి పర్యవేక్షణ బాధ్యతలను ఓ అధికారికి అప్పగించారు. అప్పటి నుంచి రెండున్నరేళ్లు అవసరమైన సమాచారం, సందర్శకులకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత షార్‌తో పాటు ఇస్రోకు సంబంధించిన ఎలాంటి సమాచారం చెప్పే వారే కరవయ్యారు. ఎవరిని అడిగినా తమకు ఏమీ తెలియదని, ఎంఎస్‌జీ, పీపీజీ విభాగాన్ని సంప్రదించాలని చెబుతున్నా, వారు కూడ సరైన సమాధానం ఇవ్వడంలేదు.

దేశ, విదేశీ సమాచారం

షార్‌కు చెందిన పీఅండ్‌పీవో విభాగం స్థానికంగా జరిగే ఏ విషయాలు తెలుపకపోగా, దేశ, విదేశాల్లో జరుగుతున్న విషయాలను మాత్రం వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేస్తున్నారు. స్థానిక సమాచారం లేకుండా, ఇతర ప్రాంతాల విషయాలు ఎందుకని మీడియా ప్రతినిధులు, ఇతరులు సైతం ప్రశ్నిస్తున్నారు. షార్‌లోని పీఅండ్‌పీవో విభాగంపై బెంగళూరులోని కేంద్ర కార్యాలయం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని