logo

అరాచకాన్ని వీడి.. ప్రగతి బాట

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు సమీపిస్తోందని వైకాపా నేతలు గ్రహిస్తున్నారు.

Published : 29 Mar 2024 02:28 IST

తెదేపాలో చేరుతున్న వైకాపా నేతలు

ఈనాడు-తిరుపతి: రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు సమీపిస్తోందని వైకాపా నేతలు గ్రహిస్తున్నారు. పార్టీని వీడితే ఇబ్బందులకు గురి చేస్తారని, ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తారని ఇన్నాళ్లూ భయపడుతూ వచ్చిన వైకాపా నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా గొంతు విప్పుతున్నారు. పార్టీలో జరుగుతున్న అరాచకాలను ఎండగడుతున్నారు. ఇప్పటికే జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో అధికార పార్టీని వీడి బయటకు రాగా తిరుపతి, చంద్రగిరి ప్రాంతాలకు చెందిన వైకాపా నేతలు గురువారం రాజీనామాలు చేశారు. రానున్న రోజుల్లో మరింత మంది వైకాపాను వీడేందుకు సిద్ధంగా ఉన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ వచ్చిందని, అందరూ స్వేచ్ఛగా బయటకు వచ్చి ప్రభుత్వంపై పోరాటం చేయాలన్న తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునకు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ముగ్గురు జడ్పీటీసీలు, ఓ జడ్పీటీసీ మాజీ సభ్యుడు వైకాపా నుంచి తెదేపాలో చేరారు. గురువారం తిరుపతి కార్పొరేటర్లు అనితయాదవ్‌, సంధ్యయాదవ్‌లు వైకాపా సభ్యత్వానికి రాజీనామా చేశారు. కార్పొరేటర్లుగా తమకు సముచిత న్యాయం లేదంటూ వారు వెల్లడించారు. వెంకటగిరిలో కౌన్సిలర్‌ పొట్టేళ్ల ప్రభావతి తెదేపాలో చేరారు. బుధవారం చంద్రబాబు సమక్షంలో పుత్తూరు కౌన్సిలర్లు భువనేశ్వరి, కెన్నడీలు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటకు చెందిన రాష్ట్ర సాహితి అకాడమీ డైరెక్టర్‌ దొడ్ల గౌరి, వైకాపా యువత విభాగం ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి తదితరులు తెదేపాలో చేరారు.

దౌర్జన్యాలు సహించలేక.. .

గ్రామీణ ప్రాంతాల్లో వైకాపా నేతల దౌర్జన్యాన్ని, అరాచకాలను సహించలేక ఆ పార్టీ కార్యకర్తలే భీతిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో తమనూ ఇబ్బందులకు గురి చేస్తారని వైకాపా కార్యకర్తలు గుర్తించారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తిలోని ముస్లింలు, యువత, వైకాపా సీనియర్‌ నేత లక్కమనేని మధు తన అనుచరులతో ఇటీవలే తెదేపాలో చేరారు. ఏర్పేడు మండలం అంజిమేడుకు చెందిన వైకాపా రాష్ట్ర యూత్‌ కార్యదర్శి మోహన్‌రెడ్డితోపాటు సీతారాంపేట, గోవిందవరం, పాపానాయుడుపేట, పల్లం ప్రాంతాల్లో వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. శ్రీకాళహస్తి మండలం ముచ్చువోలు, గుంటకిందపల్లి, తొట్టంబేడు మండలంలోని తొట్టంబేడు చిట్టత్తూరు, బసవయ్యపాలెం, సాంబయ్యపాలెం, కాసరం తదితర గ్రామాల ప్రజలు వైకాపాను వీడుతున్నారు. గూడూరు పరిధిలో చెన్నూరుకు చెందిన వైకాపా నేతలు కరుణాకర్‌రెడ్డి, ఎలసిరి శ్రీనివాసరెడ్డి, శ్రీకిరిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జనార్దన్‌రెడ్డి తదితరులు తెదేపాలో చేరారు. గూడూరు నియోజకవర్గంలోని తిక్కవరం, ముత్యాలపాడు, తొండుమాకుల గ్రామాలకు చెందిన వైకాపా కార్యకర్తలు తెదేపాలోకి వచ్చారు. వెంకటగిరి, సూళ్లూరుపేట, సత్యవేడు పరిధిలోనూ పలువురు తెదేపాలో చేరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని