logo

భూసార పరీక్షలెక్కడ జగనన్నా..!

భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తెలుసుకుని తదనుగుణంగా చర్యలు చేపడితే అన్నదాతలు అధిక దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయటపడతారన్నది ఉద్దేశం.. అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి.

Updated : 29 Mar 2024 04:55 IST

పంట నాణ్యత, దిగుబడులపై ప్రభావం

చిత్తూరు (వ్యవసాయం): భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తెలుసుకుని తదనుగుణంగా చర్యలు చేపడితే అన్నదాతలు అధిక దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయటపడతారన్నది ఉద్దేశం.. అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి. కానీ.. ఇంతటి కీలకమైన అంశంపై ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది.. ఐదేళ్లలో జిల్లాలో భూసార పరీక్షల అటకెక్కాయి.. గతేడాది నామమాత్రంగా మట్టి నమూనాలు సేకరించినా ఫలితం అన్నదాతకు అందలేదు. ఆర్‌బీకేల ద్వారా మట్టి నమూనాలకు శ్రీకారం చుట్టినా లక్ష్యం నిస్సారమవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 6.2 లక్షల మంది రైతులు ఉండగా.. ఏటా ఖరీఫ్‌ సాధారణ సాగు 1.98 లక్షల హెక్టార్లు. రబీలో 98 లక్షల హెక్టార్లు. జిల్లాల విభజనతో చిత్తూరు జిల్లాలో వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. ఖరీఫ్‌లో 1.12లక్షల హెక్టార్లు, రబీలో 55-60వేల హెక్టార్లకు పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో తిరుపతి, చిత్తూరు, కుప్పం, శ్రీకాళహస్తి, మదనపల్లెలో ప్రయోగశాలలు ఉన్నాయి.

గతంలో ఇలా..

భూసార పరీక్షలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు నిధులిచ్చింది. ఈవ్యవధిలో ప్రతి గ్రామంలో అక్కడి అన్ని కమతాల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించింది. ఒక్కో మట్టి నమూనాకు రూ.300-400 చొప్పున విడుదల చేసింది. ఆ తర్వాత పథకం రద్దవడంతో నిధులు ఆగిపోయాయి. గతంలో ఏటా ఖరీఫ్‌కు ముందు ఏప్రిల్‌, మే నెలల్లో జిల్లాలో 90 వేల నుంచి 1.2 లక్షల వరకు మట్టి నమూనాలులక్ష్యంగా సేకరించి ఆపై వాటిని ప్రయోగశాలల్లో పరీక్షించారు. ఫలితాలతో కూడిన సాయిల్‌ హెల్త్‌కార్డు రైతులకు అందజేసేవారు.  

రైతు ‘భరోసా’ అంటున్నా..

జిల్లాలో 502 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా మట్టి నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపాలని నిర్ణయించినా అమలు కాలేదు. గత ప్రభుత్వం మండలానికి రెండు చొప్పున భూసార పరీక్ష కిట్లు(యంత్రాలను) కేటాయించింది. ఒక్కో యంత్రానికి రూ.లక్ష ఖర్చు చేసి.. వీటిని సమకూర్చారు. ఇలా జిల్లాలోని 66 మండలాలకు సుమారు 102 భూసార పరీక్ష యంత్రాలు అందాయి. వీటిని రైతు భరోసా కేంద్రాల్లో ఉంచి.. రైతులు మట్టి నమూనాలు పరీక్ష చేయించుకోవచ్చని నిర్ణయించారు. ఆర్‌బీకేల్లో భూసార యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్న విషయం రైతులకు పూర్తి స్థాయిలో తెలియదు.

గతేడాది సేకరించారంతే..

గతేడాది ఖరీఫ్‌ సీజన్‌కు ముందు ఆర్‌బీకేకి రెండు చొప్పున 502 ఆర్బీకేలకు సంబంధించి 1,004 మట్టి నమూనాలు సేకరించారు. ఆ తర్వాత రబీకి ముందు ఆర్‌బీకే 30-32 చొప్పున జిల్లా వ్యాప్తంగా 15 వేల నమూనాలు సేకరించారు. భూసార పరీక్ష ఫలితాల కార్డులు రైతులకు చేరలేదు. పరీక్షలు పూర్తి చేశాం.. ఆన్‌లైన్‌లో పొందుపరిచామంటూ అధికారులు చెబుతున్నారే తప్ప.. ఫలితం అన్నదాతకు అందలేదు. ఇవేం పరీక్షలంటూ ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని