logo

చెరువులను చెరబడుతున్న వైకాపా నేతలు

వైకాపా నేతల కబంధ హస్తాల్లో చెరువులు చిక్కుకున్నాయి. కుదిరితే కబ్జా చెయ్‌.. లేదంటే మట్టి తవ్వి సొమ్ము చేసుకో అన్న చందంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు.

Published : 29 Mar 2024 02:58 IST

ప్రశ్నిస్తే పోలీసులను ఉసిగొల్పి కేసుల బనాయింపు

ఈనాడు, చిత్తూరు: వైకాపా నేతల కబంధ హస్తాల్లో చెరువులు చిక్కుకున్నాయి. కుదిరితే కబ్జా చెయ్‌.. లేదంటే మట్టి తవ్వి సొమ్ము చేసుకో అన్న చందంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులకు చెప్పి అక్రమ కేసులు పెట్టి నోళ్లు మూయిస్తున్నారు. తవ్వకాలను అడ్డుకోవాల్సిన జలవనరుల శాఖ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. పదేపదే ఫిర్యాదులు వస్తే అక్రమార్కులకు చెప్పి యంత్రాలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తూ స్వామిభక్తి చాటుకుంటున్నారు. ఎన్నికల నియమావళి రాక ముందు వైకాపా నాయకులు ఎలా చెలరేగారో ఇప్పుడూ అలాగే వ్యవహరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మళ్లీ తమ ప్రభుత్వం రాదేమోననే భయంతో ఇష్టారాజ్యంగా చెరువులను కొల్లగొడుతున్నారు.

రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలోనే అత్యధికంగా 3,991 చెరువులున్నాయి. వీటి కింద దాదాపు 1.13 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక తుపాన్ల కారణంగా దాదాపు 1,300 చెరువులు దెబ్బతిన్నాయి. వీటి శాశ్వత మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదు. నిధులు తేవడంలో విఫలమైన వైకాపా నేతలు మట్టి కోసం చెరువులను చెరబడుతున్నారు.

లే ఔట్లను చదును చేసేందుకే

జిల్లాలో ప్రస్తుతం స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. పొలాలను సైతం లేఔట్లుగా మార్చి కొందరు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో వాటిని చదును చేసేందుకు వైకాపా నేతలు చెరువులను ఇష్టారాజ్యంగా తవ్వుతున్నారు. ప్రధానంగా పుంగనూరు నియోజకవర్గంలోని వైకాపా నేతలు బరితెగించారు. చౌడేపల్లె మండలం ఆమనిగుంట, కాతిపేరి చెరువు, పుంగనూరు మండలం కొండసముద్రం, మేలుపట్ల, రాగానిపల్లె చెరువుల్లో రాత్రింబవళ్లు మట్టి తవ్వుతున్నారు. స్థానికులు ఫిర్యాదు చేస్తున్నా జలవనరులు, రెవెన్యూ యంత్రాంగం స్పందించడం లేదు. ‘పెద్ద’ మంత్రి అండదండలున్నాయని అటువైపు కన్నెత్తి చూడటంలేదని అన్నదాతలు వాపోతున్నారు.

నేతిగుట్లపల్లి రిజర్వాయర్‌ నిర్మాణానికి 15- 30 అడుగుల లోతు వరకు స్థానిక చెరువులను తవ్వి అనుమతులు లేకుండా, జలవనరుల శాఖకు రూపాయి చెల్లించకుండా మట్టి తరలించారు. తాజాగా చౌడేపల్లె మండలం ఆమినిగుంట చెరువులో పరిమితికి మించి తవ్వుతున్నారని ప్రశ్నించిన తెదేపా మండల అధ్యక్షుడు గువ్వల రమేశ్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కుప్పంలో ఫిల్టర్‌ ఇసుక తయారుచేస్తూ

కుప్పంలో ఇసుక కొరత నేపథ్యంలో వైకాపా నేతలు చెరువుల్లోని మట్టినే ఫిల్టర్‌ ఇసుకగా మార్చి అమ్ముకుంటున్నాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న కుప్పం చెరువు, లక్ష్మీపురం, పరమసముద్రం చెరువుల్లో నిత్యం యంత్రాలతో మట్టి తవ్వుతున్నారు. గంగవరం మండలం అరసనపల్లె, కలగటూరు చెరువులనూ మట్టి మాఫియా ధ్వంసం చేసింది.


వాహనం ఆపితే నాయకుల ఫోన్లు

చిత్తూరు మండలంలోని కొండలు, గుట్టలను ఎక్స్‌ప్రెస్‌ రహదారులు నిర్మిస్తున్న గుత్తేదారు సంస్థలు కొల్లగొట్టగా.. చెరువులను ధ్వంసం చేసే బాధ్యతను వైకాపా నేతలు తీసుకున్నారు. బ్రాహ్మణ చెరువు, చెర్లోపల్లి చెరువు నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున మట్టి తరలించారు. జలవనరుల శాఖ అధికారులు అడ్డుకునేందుకు యత్నిస్తే వైకాపా నేతల నుంచి ఫోన్లు వస్తున్నాయి. బంగారుపాళ్యం మండలం కోనిరెడ్డిచెరువులోనూ యంత్రాలతో తవ్వడంతో భూగర్భ జలమట్టం పడిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని