logo

ఇట్లుంటాయి.. జగనన్న కాలనీలంటే?

జీడీనెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం మండలం పచ్చికాపల్లం రహదారిలో గుట్టలో ఉన్న జగనన్న కాలనీ ఇది. గుట్ట ప్రాంతంలో ఇంటి స్థలాలు మంజూరు చేయడంతో లబ్ధిదారులు గృహాల్ని కట్టేందుకు అంతగా ఆసక్తి చూపలేదు.

Updated : 10 Apr 2024 07:20 IST

కొండలు, గుట్టల్లో స్థలాలు
ఖర్చుల్ని భరించలేక నిర్మాణాలు నిలిపేస్తున్న పేదలు

జీడీనెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం మండలం పచ్చికాపల్లం రహదారిలో గుట్టలో ఉన్న జగనన్న కాలనీ ఇది. గుట్ట ప్రాంతంలో ఇంటి స్థలాలు మంజూరు చేయడంతో లబ్ధిదారులు గృహాల్ని కట్టేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. ఈ మండలంలో 1,417 గృహాలు మంజూరవగా 85 గృహ నిర్మాణాలు నేటికీ మొదలు పెట్టలేదు. పునాది స్థాయిలో 78, కడగాలు స్థాయిలో 227, పైకప్పు వరకు నిర్మాణాలు జరిగినవి 104, పూర్తయిన గృహాలు 845 మాత్రమే.

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గత ఎన్నికల హామీలో పేదలందరికీ ఇళ్లు అంటే ఆశపడి వైకాపాకు ఓట్లేసిన ప్రజలకు.. ఎన్నికల తర్వాత దిమ్మ తిరిగింది. జగనన్న కాలనీల్లో పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చామంటూ వైకాపా పాలకులు పెద్దఎత్తున గొప్పలు చెప్పారు. వారి మాటలు విని లేఅవుట్లకు వెళ్లిన పేదలకు అక్కడ బొమ్మ కనపడింది. లేఅవుట్‌లోని ఇంటి స్థలాలు.. కొండలు, గుట్టల్లో ఉండటంతో నిరాశే ఎదురైంది. జగనన్న కాలనీల్లో ‘మనం కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు’ సీఎం జగన్‌ అనేక బహిరంగ సభల్లో ప్రగల్భాలు పలికారు. మీరు కట్టే ఊర్లలో మేం ఎలా జీవించాలో తెలియడం లేదంటూ? ఇంటి నిర్మాణంపై ఆసక్తి చూపడం లేదు లబ్ధిదారులు. ఫలితంగా ఇలా ఉంటాయి మన జగనన్న కాలనీలు అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రూ.1.80 లక్షలతో నిర్మాణం సాధ్యమా?

జగనన్న కాలనీల్లో ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. ఇప్పుడున్న సిమెంటు, ఇసుక, ఇనుము ధరలు, కూలీ రేట్లు పరిశీలిస్తే రూ.1.80 ఇంటిని నిర్మించడం సాధ్యం కాదు. పునాదికే రూ.లక్ష నుంచి రూ.1.30 లక్షలు అవుతోంది. ఇంటిని నిర్మించాలంటే యూనిట్‌ ధర కన్నా అదనంగా రూ.4 లక్షలకుపైనే వెచ్చించాల్సి వస్తోంది. అసలు రూ.1.8 లక్షలకు ఇల్లు కట్టడం సాధ్యమా అనేది అటు పాలకులకు.. ఇటు అధికారులకు తెలియదా అనే ప్రశ్నలకు సమాధానం కరవు. గట్టిగా 15 రోజులు పనిచేస్తేనే కూలీలకు ఇవ్వాల్సిన నగదు.. ప్రభుత్వం ఇచ్చే నగదుకు సరిపోతుంది. మరి అలాంటప్పుడు ఇల్లు ఎలా కడతారనేది ఆ దేవదేవుడికే ఎరుక.


భూ మట్టం నుంచి ఎత్తులో కనిపిస్తున్న ఈ ప్రాంతం ఓ గుట్ట. చిత్తూరు మండలం దిగువమాసాపల్లెలోని 31 మంది పేదలకు ఈ లేఅవుట్‌లో స్థలాలిచ్చారు. గుట్టలో ఎవరు ఉంటారని అప్పట్లోనే ప్రజలు నిట్టూర్చారు. దీంతో వారికి ఇష్టం లేక అసలు ఇక్కడ ఇళ్లే నిర్మించుకోలేదు. ఈ మండలంలోని 13 లేఅవుట్లలో పూర్తయిన ఇళ్లు 156 మాత్రమే.


లేఅవుట్లలో నిర్మిస్తున్న  ఇళ్లు 24,756

జిల్లాలో 73,584 గృహాలు మంజూరయ్యాయి. ఆయా లేఅవుట్లలో నిర్మిస్తున్న ఇళ్లు 24,756 మాత్రమే. మిగిలిన ఇళ్లను సొంత స్థలాలున్న లబ్ధిదారుల పేరిట మంజూరు చేయించారు. లేఅవుట్లలో మంజూరైన ఇళ్లలో పూర్తయినవి 8,720 మాత్రమే. 3,800 గృహాలు అసలు గ్రౌండింగే కాలేదు. అసలు ఇవి ఎప్పటికి మొదలవుతాయనేది అధికారులకే తెలియాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని