logo

ఊసరవెళ్లే నయమనిపింఛెను

అవ్వతాతలకు మనవడిగా.. ఒంటరి మహిళలకు, వితంతవులు, దివ్యాంగులకు అన్నగా.. తమ్ముడిగా చేనేత కల్లుగీత, మత్స్యకార, చర్మకారులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులకు పింఛన్‌ మూడు వేలకు పెంచుతామంటూ మాటిచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు.

Published : 17 Apr 2024 03:08 IST

ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులు సుమారు 5 లక్షలు  
ఐదేళ్లలో 32 వేల మంది తొలగింపు
గూడూరు, న్యూస్‌టుడే

అవ్వతాతలకు మనవడిగా.. ఒంటరి మహిళలకు, వితంతవులు, దివ్యాంగులకు అన్నగా.. తమ్ముడిగా చేనేత కల్లుగీత, మత్స్యకార, చర్మకారులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులకు పింఛన్‌ మూడు వేలకు పెంచుతామంటూ మాటిచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు. రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామంటూ మాట మార్చారు.

  • ధికారంలోకి రాగానే రూ.3 వేలిస్తానని మాట తప్పిన జగన్‌
  • యిదా పద్ధతుల్లో పెంపు
  • దేళ్లలో రూ.1,652.70 కోట్లు ఎగవేత

మ్మడి జిల్లాలో సుమారు 5 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్నారు. వీరికి ఎన్నికల ముందే పెంచి ఇస్తామన్న జగన్‌ వాయిదాల పద్ధతిలో పెంచారు. పేదల ఆశలకు గండి కొట్టిన సీఎం కొత్త లబ్ధిదారులు ఏడాది వరకు వేచి చూడాల్సి వస్తోంది. 45 ఏళ్లకే పింఛన్‌ అన్న మాటకు వక్ర భాష్యం చెప్పారు. అర్హత ఉండీ దరఖాస్తు చేసుకున్న వారికి చుక్కలు చూపించారు. ఆరంచెల పేరిట కోత పెట్టి ముప్పుతిప్పలు పెట్టారు. అటు ఆధార్‌, ఇటు ఆస్తి పన్నులు, ఆదాయ పన్నులు, భూములు, రవాణా శాఖ వెబ్‌సైట్‌లు లింకు చేసి అర్హత లేకుండా చేశారు. ఇలా ఐదేళ్లలో వేల మందిని తొలగించిన జగన్‌ మళ్లీ ఏడాది ఆరంభంలో కొత్తగా ఇస్తున్నట్లు చెప్పి అడ్డదారులు తొక్కారు.

ఒక్క మాటకు అనేక అర్థాలు.. పెంచి పింఛన్లు ఇస్తామన్న జగన్‌ పెంచుతూ పోతామన్నట్లు ఎన్నికల తర్వాత కూని రాగం తీశారు. ఇలా నాలుగేళ్లు పెంచుకుంటే ఐదో ఏట మూడు వేలకు పెంచారు. ఒక్కో లబ్ధిదారుడు సుమారుగా తొలి రెండేళ్లు రూ.21 వెయ్యి నష్టపోయారు. ఇలా నెలకు రూ.750 లెక్కన 28 నెలలు పెంచలేదు. ఆ తర్వాత 2022లో 2500 చేయగా ఆ ఏడాది 12 నెలల నష్టం రూ.6 వేలు, 2023లో రూ.2750 చేయగా ఏడాది నష్టం రూ.3 వేలు కాగా ఇలా ఒక్కో లబ్ధిదారుడు రూ.30 వేలు నష్టపోయారు. ఇలా ఐదేళ్లలో 5 లక్షల మందికి సుమారు రూ.1600 కోట్లు ఎగనామం పెట్టారు.


ఆరంచెల  పరిశీలన పేరుతో కోత..

ప్రభుత్వానికి ఉన్న అనేక మార్గాల ద్వారా లబ్ధిదారుల వివరాలు సరిచూసి ఏరివేశారు. పెంపుపై దృష్టి పెట్టని జగన్‌ సర్కార్‌ రెండన్నరేళ్లు ఏరివేతలు చేపట్టారు. భూములు ఎక్కువున్నట్లు, ఆధార్‌లో పుట్టినతేదీ పొరపాట్లు, 300 యూనిట్ల కరెంట్‌, రేషన్‌కార్డుల్లో తప్పులు, ఆస్తి ఎక్కువగా ఉండటం.. కార్లు, ఇతర వాహనాలు, ఆదాయపు పన్నులు చెల్లిస్తున్నట్లు వెరసి అనేక కుంటి సాకులు చూపించారు. ఈ ఐదేళ్లలో లక్షకు పైగా ఇలా ఏరివేతలు చేసిన జగన్‌ కొత్త పింఛన్‌కు ఏడాది ఆగాలని పరోక్షంగా వెల్లడించారు.


ఐదేళ్లుగా తిరుగుతున్నా

- నావూరు కృష్ణయ్య, నాయుడుపేట

మూర్చవ్యాధిగ్రస్థుడిగా.. బేల్దారి పనిచేస్తుంటా. గతంలో పింఛన్‌ వచ్చేది. ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు పోగొట్టుకుపోయింది. ఒంటరి కావడంతో సొంతూరు నుంచి నాయుడుపేట వచ్చేశా. ఇక్కడ ఆధార్‌ కార్డు తిరిగి తీసుకుని రేషన్‌కార్డుకి దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదు. పింఛన్‌కు వెళితే కార్డు లేదన్నారు. ఇలా అనేక పర్యాయాలు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నా దిక్కు లేకుండా పోయింది.  


300 యూనిట్లు వచ్చిందని ఆపేశారు

- కమలమ్మ, కాలేపల్లి, రామచంద్రాపురం మండలం

కరెంట్‌ బిల్లు 300 యూనిట్లు వచ్చిందని నాకు వస్తున్న పింఛన్‌ ఆపేశారు. వృద్ధుల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తగదు. ఇంట్లో రెండు వృద్ధాప్య పింఛన్లు వస్తున్న వారికీ రాష్ట్రవ్యాప్తంగా ఒకటి ఆపేశారు. నా పింఛన్‌ డబ్బుతో కుటుంబ పోషణకు ఉపయోగించుకునేవారం. ఇప్పుడు అప్పుచేసే పరిస్థితి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని