logo

పెద్దిరెడ్డి.. ప్ర‘జల’ ఆశలకు గండి

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తర్వాత వైకాపాలో నంబరు 2గా, రాయలసీమ జిల్లాల్లో పెత్తనం చెలాయిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శాసనం.. కాంట్రాక్టులన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే.

Published : 20 Apr 2024 04:10 IST

అనుమతులు సాధించలేకపోయిన అటవీ మంత్రి

ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాజెక్టులపై ఏదీ శ్రద్ధ?

వైకాపా వచ్చిన తర్వాత నిలిచిన మల్లెమడుగు జలాశయ పనులు

ఈనాడు-తిరుపతి: ‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తర్వాత వైకాపాలో నంబరు 2గా, రాయలసీమ జిల్లాల్లో పెత్తనం చెలాయిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శాసనం.. కాంట్రాక్టులన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే.. ఈ స్థాయిలో చక్రం తిప్పుతున్నా.. ఉమ్మడి చిత్తూరు జిల్లా సాగు, తాగునీటి జలాశయాలకు అటవీ అనుమతులు సాధించేందుకు కనీస ప్రయత్నం చేయలేదు. ఇదే శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నా వీటిని విస్మరించడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు.
జిల్లాకు వరప్రదాయిని గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టును సీఎం జగన్‌ గాలికి వదిలేశారు. ఇందులో బాలాజీ, మల్లెమడుగు, వేణుగోపాలసాగర్‌ ప్రధానమైనవి. ఇవి పూర్తయితే తిరుమల, తిరుపతితోపాటు పలు నియోజకవర్గాలకు తాగు, సాగు నీరు అందించవచ్చు. తెదేపా హయాంలోనే మల్లెమడుగు జలాశయానికి అటవీ భూమి కాకుండా 546.20 ఎకరాలు, బాలాజీ జలాశయానికి 519.30 ఎకరాలు సేకరించారు. వేణుగోపాలసాగర్‌కు సైతం 1192.24 ఎకరాలకు దాదాపు భూసేకరణ పూర్తయింది. అటవీ భూముల విషయానికి వచ్చే సరికి సమస్య తలెత్తింది. మల్లెమడుగుకు 117.581 హెక్టార్లు, బాలాజీకి 477.75 హెక్టార్లు, వేణుగోపాలసాగర్‌కు 372.546 హెక్టార్ల భూమి జలాశయాల నిర్మాణానికే సేకరించాల్సి వచ్చింది. ఇందుకోసం కేంద్ర అటవీశాఖ నుంచి తెదేపా హయాంలో తొలి విడత అనుమతులు తెచ్చారు.

వర్షాధారంపైనే..

ఉమ్మడి జిల్లాలో కేవలం వర్షాధారం ద్వారానే జలాశయాల్లో నీటిని నిల్వ చేసుకునే ఆస్కారముంది. రెండేళ్ల క్రితం కురిసిన వర్షానికి తొమ్మిది టీఎంసీల నీరు మల్లెమడుగు జలాశయం నుంచి సముద్రంలో కలిసింది. బాలాజీ చుట్టూ ఉన్న శేషాచల అటవీ ప్రాంతం కారణంగా ఏడాదిలో కురిసే వర్షాలకు కనీసం టీఎంసీ నీటిని నిల్వ చేసుకునే వీలుంటుంది.
వేణుగోపాలసాగర్‌లోనూ వాన నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నా మంత్రి పెద్దిరెడ్డి మాత్రం దీన్ని పట్టించుకోకుండా సొంత ప్రయోజనాల కోసం పాత ప్రాజెక్టులను పక్కనబెట్టి జిల్లా ప్రజలకు తీరని ద్రోహం చేశారన్న ఆరోపణలున్నాయి.
స్వప్రయోజనాల కోసం కొనసాగుతున్న ప్రాజెక్టును మంత్రి పెద్దిరెడ్డి పక్కనబెట్టి కేవలం తన స్వార్థ ప్రయోజనాలు, కాంట్రాక్టుల కోసం కొత్తగా ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి జలాశయాల నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్‌జీటీ మొట్టికాయలు వేయడంతో వెనక్కు తగ్గారు.

పట్టించుకోని నేతలు·

రెండో దశ అనుమతులు తెచ్చే అంశంపైనా తెదేపా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రత్యామ్నాయ భూమి గుర్తించి అటవీశాఖకు నివేదించారు. ఆపై వచ్చిన వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రి కావడంతో అటవీ అనుమతులు వస్తాయని ప్రజలు భావించారు. అయితే మూడు జలాశయాలకు రెండో దశ అటవీ అనుమతుల కోసం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా, బియ్యపు మధుసూదన్‌రెడ్డిలు ఎటువంటి చొరవ చూపలేదు.


తాగునీటి సదుపాయం: 20 లక్షల మందికి
లబ్ధి పొందే మండలాలు: 11
సాగునీటి సౌకర్యం: 1.03 లక్షల ఎకరాలు
లబ్ధి పొందే  మండలాలు: 12

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని