logo

తీరంలో బోటు బోల్తా.. మత్స్యకారుడి గల్లంతు

ఏటిమొగ సముద్ర తీరంలో మత్స్యకార బోటు బోల్తాపడింది. కాకినాడలోని దుమ్ములపేటకు చెందిన దాసరి దుర్గ మరో అయిదుగురితో కలిసి ఫైబరు బోటులో సముద్రంలో వేట సాగిస్తూ వారం రోజుల కిందట అల్లవరం మండలం ఓడలరేవుకు చేరుకున్నారు.

Published : 02 Oct 2022 04:20 IST

రోదిస్తున్న చిన్న కుటుంబసభ్యులు

అల్లవరం: ఏటిమొగ సముద్ర తీరంలో మత్స్యకార బోటు బోల్తాపడింది. కాకినాడలోని దుమ్ములపేటకు చెందిన దాసరి దుర్గ మరో అయిదుగురితో కలిసి ఫైబరు బోటులో సముద్రంలో వేట సాగిస్తూ వారం రోజుల కిందట అల్లవరం మండలం ఓడలరేవుకు చేరుకున్నారు. శనివారం వేట పూర్తి చేసుకుని ఒడ్డుకు తిరిగి బయలుదేరారు. తీరానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో కెరటాల ఉద్ధృతికి వీరి బోటు తిరగబడింది. చీకటి జాను, వాసుపల్లి రాము, దాసరి దుర్గ, పెమ్మాడి నాగరాజు, ఉమ్మిడి ధనరాజు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా.. టి.చిన్న(21) కెరటాల తీవ్రతకు సముద్రంలో గల్లంతయ్యాడు. చరవాణులు, నిత్యవసరాలు, చేపలు, వంట సామగ్రి, ఇన్వర్టర్, వలలు సముద్రంలో కొట్టుకు పోయాయి. గత మూడు రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడి తీరం వెంబడి ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కెరటాలు సుమారు 5 నుంచి 10 మీటర్ల ఎత్తు వరకు ఎగిసి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరించడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. గల్లంతైన చిన్న ఆచూకీ కోసం స్థానికంగా ఉన్న సోనాబోటు సహాయంతో సముద్ర జలాల్లో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

కొడుకా.. వస్తానని వెళ్లిపోయావా!

సాంబమూర్తినగర్‌: కొడుకా.. వస్తానని వెళ్లిపోయావా! అంటూ చిన్న తల్లి పొట్టెమ్మ రోదిస్తున్న తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. అల్లవరం మండలం వద్ద సముద్ర తీరంలో శనివారం బోటు తిరగబడిన ప్రమాదంలో కాకినాడ దుమ్ములపేట తారకరామ్‌నగర్‌కు చెందిన చిన్న గల్లంతవ్వడంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన చిన్నకు తొమ్మిదేళ్ల క్రితం నూకరత్నంతో వివాహమైంది. వారికి ఎనిమిదేళ్ల కుమార్తె, ఆరేళ్ల బాబు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని