logo

పీఎంజీకేఏవై బియ్యానికి ఎసరు!

కాకినాడ జిల్లాలో జనవరికి సంబంధించి ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) బియ్యం పంపిణీకి ఎసరు పెట్టారు.

Published : 28 Jan 2023 03:05 IST

రేషన్‌ బియ్యం

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లాలో జనవరికి సంబంధించి ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) బియ్యం పంపిణీకి ఎసరు పెట్టారు. కొన్ని నెలలుగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు, ఏఏవై కార్డుదారులకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా బియ్యాన్ని చౌక దుకాణల వద్ద పంపిణీ చేస్తోంది. ఈ నెల మాత్రం వాటిని అందించ లేదు. కరోనా నేపథ్యంలో కేంద్రం ఉచితంగా ప్రతి బియ్యంకార్డులోని సభ్యుడికి అయిదు కేజీలు చొప్పున బియ్యం(నాన్‌ సార్టెక్స్‌) పంపిణీ చేస్తోంది. మరో ఏడాది పాటు దీన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్‌ కింద ప్రతినెలా ఒకటి నుంచి 17 వరకు రాయితీపై రేషన్‌ సరకులు పంపిణీ చేస్తుంది. కేజీ బియ్యానికి రూపాయి చొప్పున వసూలు చేస్తోంది. ఈ నెల కేజీకి రూపాయి వసూలు చేయకుండా ఉచితంగా అందజేసింది. ఈ నేపథ్యంలో పీఎంజీకేఏవై పథకంలో ఇచ్చేవాటిని ఇంతవరకు ఇవ్వలేదు.

ఇక రానట్టే..

కేంద్రం పీఎంజీకేఏవై కింద ఇచ్చే ఉచిత బియ్యాన్ని ప్రతినెలా 18 నుంచి 30 వరకు చౌక దుకాణాల వద్ద పంపిణీ చేస్తున్నారు. ఈనెల్లో మాత్రం ఇప్పటికీ చౌక దుకాణాలకు చేర్చలేదు. ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తామంటూ కాలయాపన చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నుంచి ఎటువంటి ఉత్తర్వులూ రాకపోవడంతో నిల్వలున్నా, సరఫరా నిలిపివేశారు. వచ్చేనెలకు రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్‌ కింద ఇచ్చే బియ్యం, పంచదార, కందిపప్పును మండలస్థాయి నిల్వ కేంద్రాలు, బఫర్‌ గోదాముల నుంచి చౌక దుకాణాలకు తరలించే ప్రక్రియ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇక కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం రావని తేలిపోయింది.

1.38 లక్షల  కుటుంబాలకు నష్టం

కొన్ని నెలలుగా కాకినాడ జిల్లాలో 1.38లక్షల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పీఎంజీకేఏవై కింద ఉచిత రేషన్‌ అమలు చేస్తోంది. కార్డులోని ఒక్కో సభ్యుడికి అయిదు కేజీలు ఉచితంగా అందిస్తున్నారు. జిల్లాలో సుమారుగా 2,100 టన్నుల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నారు. నాన్‌సార్టెక్స్‌ బియ్యం(ముతక బియ్యం) మాత్రమే పంపిణీ చేస్తున్నారు. కేజీ బియ్యం తయారీకి కనిష్ఠంగా రూ.30 వరకు ఖర్చవుతోంది. అంటే ఈ నెలకు రూ.6.50కోట్లు మేర పేదలు లబ్ధిని కోల్పోయారు.


ఈ నెలకు ఇవ్వలేదు..  

కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాలు, ఏఏవై కార్డులకు ఇస్తున్న పీఎంజీకేఏవై ఉచిత బియ్యం ఈనెలకు ఇవ్వలేదు. వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేయమని ఉత్తర్వులు రాలేదు. వచ్చేనెల పరిస్థితి ఏంటనేది తెలియదు. ఈనెలకు మాత్రమే కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం పంపిణీ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని ఉచితంగానే పంపిణీ చేశాం. ఇన్నాళ్లు కేజీకి రూ.1 వసూలు చేసేవారు. ఈనెల ఏవిధమైన సొమ్ము తీసుకోకుండా అందజేశాం. ఫిబ్రవరికి పీడీఎస్‌ బియ్యాన్ని చౌక దుకాణాలకు చేరవేస్తున్నాం. వచ్చేనెల ఒకటి నుంచి ఎండీయూల ద్వారా ఇంటింటికి రేషన్‌ పంపిణీ ప్రారంభిస్తాం.

జి.చాముండేశ్వరి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి, కాకినాడ జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని