logo

కార్మికుడి మృతితో ఉద్రిక్తం

ప్రభుత్వపరంగా జరుగుతున్న పనుల్లో అధికారుల పర్యవేక్షణ కరవై కార్మికుడు మృత్యువాత పడ్డాడు. యంత్రాలతో చేయాల్సిన పనులను మనుషులతో చేయించి వ్యక్తి మృతికి కారణమైన గుత్తేదారు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామస్థులు, జనసేన నాయకులు, దళిత సంఘాలు శనివారం రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

Published : 05 Feb 2023 05:55 IST

బాధిత కుటుంబ సభ్యులు, దళిత నాయకుల నిరసన

రాజమహేంద్రవరం వైద్యం, కోరుకొండ, న్యూస్‌టుడే: ప్రభుత్వపరంగా జరుగుతున్న పనుల్లో అధికారుల పర్యవేక్షణ కరవై కార్మికుడు మృత్యువాత పడ్డాడు. యంత్రాలతో చేయాల్సిన పనులను మనుషులతో చేయించి వ్యక్తి మృతికి కారణమైన గుత్తేదారు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామస్థులు, జనసేన నాయకులు, దళిత సంఘాలు శనివారం రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు రెండు గంటలపాటు కంబాలచెరువు-లాలాచెరువు ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..  కోటికేశవరానికి చెందిన బూలా రాంబాబు మేకల కాపరి. కూలి పనులకూ వెళ్తుంటాడు. శుక్రవారం కోటికేశవరం-నాగంపల్లి రహదారిలో కల్వర్టు పునర్నిర్మాణం పనులకు వెళ్లాడు. సుమారు 12 అడుగుల లోతులో పనిచేయాలని గుత్తేదారు చెప్పడంతో అది యంత్రాలతో చేయాల్సిందని, తనవల్ల కాదని రాంబాబు చెప్పాడు. కచ్చితంగా పని చేయాల్సిందేదని బలవంతంగా అందులోకి దింపడంతో మట్టి పెళ్లలు విరిగిపడి రాంబాబుకు తీవ్రంగా గాయపడ్డాడు. రాజమహేంద్ర వరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రికి తరలించారు. విషయాన్ని గుత్తేదారు వద్ద ప్రస్తావించడానికి వెళ్తే పరారయ్యాడని, ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ చేసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఆసుపత్రి ఎదుట బైఠాయించి గుత్తేదారుడిని రప్పించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో డీఎస్పీలు జేవీ సంతోష్‌, కడలి వెంకటేశ్వరరావు, ఎం.శ్రీలత ఆందోళనకారులకు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. వైకాపా నాయకుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్‌ నిరసనకారులతో మాట్లాడే ప్రయత్నం చేయగా... గుత్తేదారును రప్పించిన తర్వాతే మాట్లాడతామంటూ తేల్చిచెప్పారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నిరసనకారులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. జనసేన రాజానగరం నియోజకవర్గ నాయకుడు బత్తుల బలరామకృష్ణ ఆందోళనకు సంఘీభావం తెలిపారు.  

భార్య కువైట్‌లో..

రాంబాబుకు భార్య మేరీ, కుమారుడు కిషోర్‌, కుమార్తె కుసుమ ప్రియ ఉన్నారు. సొంత ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సమస్య తలెత్తడంతో భార్య మేరీ ఆరు నెలల క్రితం కువైట్‌ వెళ్లారు. రాంబాబుది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు కోరుకొండ ఏఎస్‌ఐ సత్యనారాయణ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని