logo

పథకం.. ప్రయోజన దూరం..!

అల్లవరం మండలానికి చెందిన ఎస్సీ యువకుడు మూడున్నరేళ్లుగా వ్యక్తిగత రుణం ఇస్తే వాహనం కొనుక్కుని జీవనోపాధి ఏర్పర్చుకుంటానని బ్యాంకర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఇప్పటివరకు రుణం మంజూరు కాలేదు.

Published : 31 Mar 2023 03:33 IST

కాకినాడలోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం

* అల్లవరం మండలానికి చెందిన ఎస్సీ యువకుడు మూడున్నరేళ్లుగా వ్యక్తిగత రుణం ఇస్తే వాహనం కొనుక్కుని జీవనోపాధి ఏర్పర్చుకుంటానని బ్యాంకర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఇప్పటివరకు రుణం మంజూరు కాలేదు. కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టినట్లు అవగాహనలేదని వాపోయాడు.

* ఉప్పలగుప్తం మండలానికి చెందిన మరో యువకుడు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణం తీసుకుందామని బ్యాంకు అధికారుల దగ్గరకు వెళితే.. ప్రస్తుతం కార్పొరేషన్‌ ద్వారా రుణాలిచ్చే వెసులుబాటు లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై బ్యాంకర్లకు కూడా తగిన సమాచారం లేకపోవడమేంటని అతను విస్మయం వ్యక్తం చేశాడు.

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌

ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకం ఏదైనా సంబంధిత శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించాలి. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద రైతులు, యువకులకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు అందించేందుకు నూతనంగా అమృత్‌ జలధార, యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అనే రెండు పథకాలు తీసుకువచ్చింది. వీటికి దరఖాస్తుచేసుకునే సమయం ముగుస్తున్నా ఇప్పటివరకు ఒక్క దరఖాస్తు కూడా లబ్ధిదారుల నుంచి రాలేదు. దీనికి కారణం ఈ పథకం ఉన్నట్లు జిల్లావ్యాప్తంగా కనీస ప్రచారం లేకపోవడం, ఎవరికీ తెలియకపోవడమేనని పలువురు పేర్కొంటున్నారు.

కేంద్రం అందుబాటులోకి తెచ్చినా..

అన్నదాతల సాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ జలసిరి పథకం పేరుతో బోర్లు తవ్వి, సౌర విద్యుత్తు మోటార్లు అందించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకాన్ని వైఎస్‌ఆర్‌ జలకళగా మార్చి అమలు చేస్తోంది. ఈ నాలుగేళ్లలో రైతులు పూర్తిస్థాయిలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం అమృత్‌ జలధార పథకం ద్వారా ఎస్సీ రైతులకు రూ.లక్ష రుణంతో బోరు వేసుకునే సదుపాయం కల్పించింది. దీనిలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ.50 వేల రాయితీ వర్తించగా, మరో రూ.50 వేలు బ్యాంకు రుణంగా ఇప్పించనున్నారు. కనీసం 2.5 ఎకరాలున్న రైతులే ఈ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు. ఈ పథకానికి అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు ఇప్పటివరకు ఒక ప్రకటన కూడా జారీ చేయలేదు.

వివరాలు లేవు..

నాలుగేళ్లుగా కేవలం అలంకారప్రాయంగా కొనసాగుతున్న పలు సామాజిక వర్గాల కార్పొరేషన్ల వద్ద వ్యక్తిగతంగా స్వయం ఉపాధి పొందుతున్నవారి వివరాలు లేవు. దీంతో గ్రామాల్లో ఎవరైనా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎస్సీ సామాజిక వర్గాలకు ప్రవేశపెట్టిన పథకాలకు అర్హులుంటే.. వారి వివరాలు ఇవ్వాలని బ్యాంకర్లను, ఎంపీడీవోలను ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు కోరినా ఇప్పటివరకు ఒక పేరుకూడా రాకపోవడాన్ని చూస్తే.. వార్షిక రుణ ప్రణాళికలో ఎస్సీవర్గాల అభ్యున్నతికి ఎంత మేర ప్రభుత్వాలు, అధికారులు కృషి చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుత్తున్నాయి. అందివచ్చిన ఆర్థిక ఆసరా అవకాశం కళ్లెదుటే చేజారుతుందనే ఆవేదన ఎస్సీ సామాజిక వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

నాలుగేళ్లుగా  నిలిచిన రుణాలు

జిల్లావ్యాప్తంగా ఎస్సీ రైతులు, నిరుద్యోగులకు రెండేళ్లుగా రాయితీలు అందడం లేదు. ఎస్సీ కార్పొరేషన్‌లో నాలుగేళ్లుగా పథకాలు, రాయితీ రుణాలు లేవు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు సరైన అవగాహన కల్పించడం లేదు. దీంతో అర్హులు పథకాలకు దూరమవుతున్నారు. దళిత రైతులు, నిరుద్యోగులు జీవితంలో నిలదొక్కుకునేలా రూ.50 వేల నుంచి రూ.60 వేల రాయితీతో రుణాలిచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే సమస్యగా మారింది. ఈ నెల మొదటి వారంలోనే పథకాలు అందుబాటులోకి వచ్చినా ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి కారణంగా అధికారులు వివరాలు వెల్ల్లడించలేదు. తీరా సమయం మించిపోతుండగా.. అర్హుల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

అర్హులు తెలియడం లేదు..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలకు అర్హులైనవారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యాం. బ్యాంకర్ల నుంచి ఎలాంటి వివరాలు లభించలేదు. చిన్నతరహా పరిశ్రమలశాఖ వారినీ అడుగుతున్నాం. ఇప్పటివరకు వివరాలు అందలేదు. అర్హులుంటే కచ్చితంగా వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటాం. అర్హత ఉన్నవారు తమ వివరాలను నేరుగా ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయానికి, లేదా సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల్లో అందజేయాలి.

 రాధాకుమారి, ఎస్సీ కార్పొరేషన్‌ జిల్లా అధికారిణి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని