చౌక దుకాణం.. ఇదేం విధానం
జిల్లాలో ప్రతినెలా రేషన్ సరకులు పూర్తిస్థాయిలో పేదలకు అందడం లేదు. అయిదు నెలలుగా 90 శాతానికి మించి పంపిణీ జరగడం లేదు. నెలనెలా 57వేల మంది లబ్ధిదారులకు మొండిచేయి ఎదురవుతోంది.
ప్రతినెలా 57వేల కార్డులకు అందని రేషన్
న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్
కాకినాడ ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి రేషన్ సరకుల తరలింపు
జిల్లాలో ప్రతినెలా రేషన్ సరకులు పూర్తిస్థాయిలో పేదలకు అందడం లేదు. అయిదు నెలలుగా 90 శాతానికి మించి పంపిణీ జరగడం లేదు. నెలనెలా 57వేల మంది లబ్ధిదారులకు మొండిచేయి ఎదురవుతోంది. ప్రతినెలా 20 నుంచి 30 వరకు సరకులు చౌక దుకాణాలకు చేర్చాలి. గత నెల 13వ తేదీ వరకు కొన్ని దుకాణాలకు వీటిని చేర్చలేదు. జిల్లాలో ఏడు ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉన్నాయి. వీటిలోని కొన్నింటిలో సరకులను పూర్తిస్థాయిలో నిల్వ చేయడం లేదు. జూన్‌కు సంబంధించి మంగళవారం నాటికి 80 శాతం సరకులే చౌక దుకాణాలకు చేరాయి. రేషన్ పంపిణీకి అన్ని వ్యవస్థలు ఉన్నా... పర్యవేక్షణ లోపం.. సాంకేతిక సమస్యలు, సరకులు సకాలంలో చేరవేయక, అన్ని ప్రాంతాలకు ఎండీయూ వాహనాలు వెళ్లక.. లబ్ధిదారులకు సరకులు అందడం లేదు.
మళ్లీ కందిపప్పు గోల..!
జూన్ నెలకు సంబంధించిన రేషన్ ఒక్కో బియ్యంకార్డుకు కేజీ కందిపప్పు చొప్పున 600 టన్నులు అవసరం. 300 టన్నులే కేటాయించారు. జిల్లాలోని ఏడు ఎంఎల్‌ఎస్ పాయింట్లలో కేవలం 130 టన్నులే ఉంది. దీన్ని చౌక దుకాణాలకు తరలిస్తున్నారు. మిగతా కందిపప్పు ఎప్పుడు సరఫరా చేస్తారో తెలియని పరిస్థితి. ప్రతినెలా సగం తగ్గించేస్తున్నారు. దీంతో లబ్ధిదారులకు మొండిచేయి ఎదురవుతోంది.
వీటిని పరిష్కరిస్తేనే..?
* పౌరసరఫరాల సంస్థ రవాణా భారాన్ని తగ్గించుకోవడానికి మండల స్థాయి సరకు నిల్వ కేంద్రాల(ఎంఎల్‌ఎస్ పాయింట్) నుంచి కాకుండా బఫర్ గోదాముల నుంచి నేరుగా చౌక దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తున్నారు. కందిపప్పు, పంచదార ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి చేరవేస్తున్నారు. ఈ మూడు సరకులు ఒకేసారి చౌక దుకాణాలకు చేరక ఎండీయూ వాహనాల ద్వారా వీటిని ఒకేసారి పంపిణీ చేయలేకపోతున్నారు. దీంతో కొంత మంది సరకులు కోల్పోతున్నారు.
* జిల్లాలో 6,45,811 బియ్యం కార్డులున్నాయి. 1,060 చౌక దుకాణాల పరిధిలో 420 ఎండీయూ వాహనాలు ద్వారా బియ్యం, కందిపుప్పు, పంచదార పంపిణీ చేస్తున్నారు. ఒక్కో ఎండీయూకు సగటున 1,300 కార్డులను కేటాయించాల్సి ఉంది. కొన్నిచోట్ల ఈ పరిమితి మించిపోయింది.
* యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ, పొన్నాడలో ఒక్కోచోట 2,400 కార్డులున్నాయి. వీటికి కేవలం రెండు ఎండీయూలను కేటాయించారు. ప్రతినెలా 1 నుంచి 18 వరకే పంపిణీకి అవకాశం. దీంతో ఈ రెండు గ్రామాల్లోని ప్రజలకు పూర్తిస్థాయిలో సరకులు పంపిణీ చేయలేకపోతున్నారు.
* ప్రతి చౌక దుకాణం పరిధిలో సరాసరి 600 బియ్యంకార్డులు ఉండేలా చర్యలు చేపట్టారు. దీనికి రేషనలైజేషన్ విధానాన్ని తీసుకువచ్చారు. ఎక్కువ కార్డులున్న డీలర్లు వీటి సంఖ్య తగ్గిపోకుండా రాజకీయ పలుకుబడి ఉపయోగించడంతో లక్ష్యం నెరవేరడం లేదు.
* జిల్లా పరిధిలో 2వేల కార్డుల వరకు వేలిముద్రల సమస్య వెంటాడుతోంది. ఇలాంటి వారికి వాలంటీరు వేలిముద్ర ధ్రువీకరణ ద్వారా సరకులు ఇవ్వాల్సి ఉంది. ఇది సక్రమంగా జరగడంలేదు.
రెండు నెలలుగా రేషన్ ఇవ్వలేదు..
కాకినాడ నగరంలోని 37వ డివిజన్ ప్రేజరుపేట ధనమ్మగుడి వద్ద సోదరులు లంకే కామేశ్వరరావు, లంకే జీవరాజు నివశిస్తున్నారు. వీరి తల్లిదండ్రులు చాలాకాలం కిందట మరణించారు. ఇద్దరికీ బియ్యంకార్డు జారీ చేశారు. ఈ-పోస్‌లో వేలిముద్రలు పడటం లేదని రెండు నెలలుగా బియ్యం ఇవ్వడం లేదు.
సరకు రావాల్సి ఉంది..
కందిపప్పు ఇంకా రావాల్సి ఉంది. ఉన్నవరకు చౌక దుకాణాలకు సరఫరా చేశాం. మే నెలకు సరకుల రవాణాలో కాస్త ఇబ్బంది ఏర్పడింది. జూన్‌కు సంబంధించి ఇప్పటికే 80 శాతం సరకులను చౌక దుకాణాలకు చేరవేశాం. దీని కోసం గత నెల 18 నుంచే సరకుల తరలింపు చేపట్టాం. బియ్యం, కందిపుప్పు, పంచదార ఒకేసారి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నాం. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.
డి.పుష్పమణి, పౌరసరఫరాల సంస్థ జిల్లా, మేనేజరు, కాకినాడ జిల్లా
కనుపాప నమోదుతోనే సరకులు
ఈ-పోస్ యంత్రాల్లో వేలిముద్రలు నమోదుకాని లబ్ధిదారులు నష్టపోకుండా ఐరిస్ పరికరాలను సమకూర్చాం. జిల్లాలో 420 ఐరిస్ పరికరాలను ఎండీయూ ఆపరేటర్లకు అందజేశాం. వీటిపై శిక్షణ ఇచ్చాం. అన్ని ప్రాంతాలకు ఎండీయూ వాహనాలు వెళ్లి సరకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం. దీనిపై నిరంతరం పర్యవేక్షణ పెడతాం. పంపిణీలో ఇబ్బంది కారణంగా ఎవరూ నష్టపోకుండా చర్యలు తీసుకుంటాం.
టి.ప్రసన్నలక్ష్మీదేవి, జిల్లా సరఫరాల అధికారిణి (ఇన్‌ఛార్జి), కాకినాడ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
UPPAL Stadium: ఆటతో అదిరేలా.. ఉప్పల్ ఊగేలా!
-
Kushi Ott Release: ఓటీటీలోకి ‘ఖుషి’ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
India Canada Row: ‘భారత్-కెనడా వివాదం.. అమెరికా తలదూర్చకపోవచ్చు’
-
Chandrababu: రెండోరోజు కొనసాగుతున్న చంద్రబాబు సీఐడీ విచారణ
-
Tirumala: తిరుమలలో తితిదే ఎలక్ట్రిక్ బస్సు చోరీ
-
Rakshit Shetty: అతడి సంగతి నాకు తెలియదు.. నేనైతే రష్మికతో మాట్లాడుతున్నా: రక్షిత్‌శెట్టి